ధర్మాన వ్యాఖ్యలు హాస్యాస్పదం
- SATYAM DAILY
- Dec 15, 2025
- 1 min read
అస్తవ్యస్త రీసర్వే వల్ల జిరాయితీ కూడా అమ్ముకోలేని పరిస్థితులు
పరిష్కారానికి కృషి చేస్తుంటే విమర్శలా?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూదోపిడికి తెర లేపలేదా
ఫ్రీ హోల్డ్ భూముల పేరుతో వేలాది ఎకరాలు అమ్ముకున్నదెవరు?
ఎమ్మెల్యే గొండు శంకర్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
రెండు రోజుల క్రితం రాష్ట్రంలో రీసర్వేపై మాజీ రెవెన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈమేరకు పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రెవిన్యూ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసి, రెవెన్యూ సమస్యలను పరిష్కరించకుండా మరిన్ని సమస్యలను సృష్టించిన ధర్మాన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం భావ్యం కాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను కాజేసేందుకు చేసిన కుట్రలను ప్రజలు గమనించారని, రైతుల పాస్ పుస్తకాలపై జగన్మోహన్‌రెడ్డి ఫోటో ముద్రించడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. రీసర్వే పేరుతో వేలాది అసైన్డ్ ల్యాండ్లు, డి`పట్టాలను, కొన్ని జిరాయితీ పొలాలను సామాన్యుల నుంచి లాక్కున్నదెవరో అందరికీ తెలుసన్నారు. రీసర్వేలో జరిగిన తప్పులను సవరించడానికి కృషి చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో భూములను ఇష్టానుసారంగా పేర్లు మార్చి నచ్చిన వారి పేరున ఆన్‌లైన్‌లో ఎక్కించి నేటికీ పరిష్కారం కాకుండా సమస్యను జఠిలం చేశారని ఆయన దుయ్యబట్టారు. అన్నిటినీ పరిష్కరించి ప్రభుత్వ రాజమద్రతో పాస్‌బుక్కులు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అనేక భూములను 22`ఏ నుంచి తొలగించి అనుచరుల ద్వారా కొనుగోలు చేయించింది ధర్మాన కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికీ దీనిపై సిట్ దర్యాప్తు కొనసాగుతుందని శంకర్ గుర్తు చేశారు. ఇసుక మాఫియాపై వైకాపా మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తుంటే పెత్తందారుల ప్రభుత్వం అనడం ఎంతవరకు సమంజసంమని, పింఛన్లను రూ.3వేల నుంచి 4వేలకు పెంచామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుచేసి సామాన్యుని భూమికి రక్షణ కల్పించామన్నారు. చుక్కల భూములు, లంక భూములు, అసైన్డ్ భూముల టైటిల్ పరిష్కారం పేరుతో వేలాది ఎకరాలు కొల్లగొట్టింది ఎవరో గుర్తెరగాలని శంకర్ అన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, అంపోలు మూర్తి, కలగ జగదీష్, అరవల రవీంద్ర, చిట్టి రమణ, ఎస్‌వీ రమణమాదిగ, కొర్ను నాగార్జున ప్రతాప్, బుర్రి మధు, మాధవి, పెద్ది కవిత తదితరులు పాల్గొన్నారు.










Comments