top of page

ధర్మస్థలలో ధర్మం చెర!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 22, 2025
  • 3 min read
  • రెండు దశాబ్దాల్లో వందల సంఖ్యలో మహిళలు మాయం

  • అత్యాచారం, ఆపై హత్య చేసి రహస్యంగా మృతదేహాల ఖననం

  • ఈ పాపకృత్యంలో శ్రీమంజూనాథ దేవస్థానం వర్గాల పాత్ర

  • అక్కడి పారిశుధ్య కార్మికుడిని బెదిరించి మృతదేహాల తరలింపు

  • అజ్ఞాతంలో ఉన్నా పదేళ్లపాటు అతడిని వెంటాడిని భయం, పశ్చాత్తాపం

  • పోలీసుల వద్దకు స్వయంగా వెళ్లి ఫిర్యాదు.. సిట్‌ ఏర్పాటు

అది ధర్మస్థలం పోలీస్‌ స్టేషన్‌..

స్టేషన్‌ సిబ్బంది ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.

ఆ సమయంలో ఓ ఆగంతకుడు అక్కడికి వచ్చి స్టేషన్‌ అధికారిని కలిసి ఏదో చెప్పాడు.

తర్వాత.. అటునుంచి అటే దక్షిణ కన్నడ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయానికి వెళ్లి నేరుగా జిల్లా ఎస్పీని కలిసి అదే విషయం వెల్లడిరచాడు.

అతగాడు చెప్పింది విని ధర్మస్థల పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా ఒక్కసారి షాక్‌ అయ్యారు. కాసేపు ఆగంతకుడు చెప్పింది నిజమా లేక మతి భ్రమించి మాట్లాడుతున్నాడా అన్న సందిగ్ధంలో పడ్డారు.

కానీ తాను చెప్పింది కఠోర వాస్తవమని.. దాదాపు ఇరవయ్యేళ్ల వ్యవధిలో వందలాది శవాలను తన స్వహస్తాలతో భూస్థాపితం చేశానని.. ఇప్పుడు పశ్చాత్తాపంతో నిజాలు చెప్పడానికి వచ్చానని ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.

ఇంతకూ ధర్మస్థలలో అతడు చెప్పిన దారుణాలు ఎందుకు.. ఎప్పుడు జరిగాయి..? ఒక్కసారి చూద్దాం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

శ్రీమంజూనాథుడు కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల క్షేత్రం. ఆధ్యాత్మికతకు నెలవుగా ఉండే ఈ దేవస్థానం పరిధిలోనే దారుణాతిదారుణమైన శవాల అక్రమ తరలింపు ఉదంతం జరగడం చర్చనీయాంశంగా మారింది. శవాలు మాయం చేసిన వ్యక్తి, చేయించినవారు కూడా మంజూనాథ దేవస్థానంతో సంబంధం ఉన్నవారు కావడం విశేషం. ఈ క్షేత్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వందలాది మహిళలు, బాలికల మృతదేహాలను తాను రహస్యంగా తరలించి ఖననం చేసేవాడినని దేవస్థానంలో పరిశుధ్య కార్మికుడిగా పని చేసిన వ్యక్తే స్వయంగా వెల్లడిరచడం సంచలనంగా మారింది. 1995 నుంచి 2014 వరకు దాదాపు ఇరవయ్యేళ్లుగా తాను పాపకృత్యాలు చేశానని కొద్దిరోజుల క్రితం అతను పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి మరీ వివరించాడు. మంజునాథ ఆలయ వర్గాల ఒత్తిడి, బెదిరింపుల కారణంగానే ఈ కృత్యాలకు పాల్పడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. ఖననం చేయమని తనకు అప్పగించిన మృతదేహాలపై లైంగిక దాడి, అనంతరం హత్య జరిగిన ఆనవాళ్లు కనిపించాయని ఫిర్యాదులో వివరించాడు. మొదట పోలీసులు ఈ విషయాన్ని నమ్మకపోయినా చివరికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఉదంతం కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో సైతం అలజడి రేపింది. దీనిపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ఏర్పాటు చేసింది.

రక్షణ కల్పిస్తేనే పూర్తి వివరాలు

తనచేత ఈ పని చేయించిన ఆలయ వర్గాల నుంచి తనకు ప్రాణ హాని కలగవచ్చని, అందువల్ల పూర్తి రక్షణ కల్పిస్తేనే గత రెండు దశాబ్దాలుగా జరిగిన మృతదేహాల అక్రమ ఖననాల వివరాలు పూర్తిగా చెబుతానని, ఖననం చేసిన ప్రదేశాలు కూడా చూపిస్తానని సదరు మాజీ పారిశుధ్య కార్మికుడు పోలీసులకు స్పష్టం చేశాడు. ధర్మస్థలం మంజునాథ ఆలయంలో సదరు కార్మికుడు పని చేస్తున్నప్పుడు ఆ దేవస్థానానికి చెందిన కొందరు తరచూ మహిళలు, బాలికల మృతదేహాలను తనకు అప్పగించి, వాటిని పూడ్చిపెట్టాలని ఆదేశించేవారు. తాము చెప్పినట్లు వాటిని పూడ్చడం లేదా దహనం చేయకపోతే అతన్ని, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించడంతోపాటు.. తీవ్రంగా కొట్టేవారట! పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే మంజూనాథ ఆలయాన్ని ఆ ప్రాంతంలో అత్యంత పలుకుబడి కలిగిని హెగ్డే కుటుంబం నిర్వహిస్తోంది. ‘ఆ 1995లో పారిశుధ్య కార్మికుడిగా చేరిన తనను కొన్నాళ్లకే భయానక నేరాలకు సాక్ష్యాలను మాయం చేసే పనికి వాడుకోవడం ప్రారంభించారు’ అని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తొలుత తాను ఆ శవాలు నేత్రావతి నది వద్ద ఆత్మహత్య చేసుకున్నవారివో లేక ప్రమాదవశాత్తూ చనిపోయినవారివో అనుకునేవాడినని.. కానీ ఆ శవాలపై లైంగిక దాడి ఆనవాళ్లు గుర్తించాక దారుణాలు జరుగుతున్నాయని అర్థమైందన్నాడు. 2010 నాటి ఒక సందర్భాన్ని ప్రస్తావించిన ఫిర్యాదుదారుడు.. ‘పెట్రోల్‌ పంప్‌ నుంచి 500 మీటర్ల అవతలికి నన్ను సూపర్‌వైజర్లు పంపారు. అక్కడ ఒక బాలిక మృతదేహం కనిపించింది. పదిహేనేళ్లకు మించి వయసుండదు. ఒంటిపై స్కూల్‌ యూనిఫాం షర్ట్‌ మాత్రమే ఉంది. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయి’ అని పేర్కొన్నాడు. ముఖంపై యాసిడ్‌ చల్లి ఉన్న ఒక యువతి మృతదేహాన్ని సైతం తాను తగులబెట్టానని పేర్కొన్నాడు.

భయంతో ఇన్నాళ్లూ అజ్ఞాతవాసం

చివరికి తన కుటుంబంతో సంబంధం ఉన్న ఒక బాలిక కూడా వారి చేతిలో దాడికి గురైందని చెప్పుకొచ్చాడు. దేవస్థానం సూపర్‌వైజర్లతో లింకు ఉన్న ఒక వ్యక్తి తనపై లైంగికదాడి చేశాడని ఆ బాలిక చెప్పడంతో భయపడిన పారిశుధ్య కార్మికుడు ఉద్యోగాన్ని వదిలేసి 2014లో ధర్మస్థలను వదిలి పారిపోయాడు. పొరుగు రాష్ట్రంలో జీవిస్తున్నా, తనను ఎక్కడ పట్టుకుంటారోనన్న భయంతో తరచూ ఇళ్లు మార్చేవాడట. ఇటీవల ఒకరోజు రహస్యంగా ధర్మస్థలికి వచ్చి తాను గతంలో పాతిపెట్టిన శవాన్ని వెలికితీసి, దాని ఫొటో తీశాడు. ఫిర్యాదుతోపాటు ఆ ఫొటోను కూడా పోలీసులకు అప్పగించాడు. ధర్మస్థల ప్రాంతంలో ఎక్కడెక్కడ శవాలను పాతిపెట్టానో అన్నీ పోలీసుల సమక్షంలో వెలికి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, ఈ ఘాతుకాలకు పాల్పడిన వారి పేర్లు భయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పాడు. అయితే తనకు, తన కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని కోరాడు.

పాత కేసులు మళ్లీ తెరపైకి

బెదిరించి తనతో తప్పులు చేయించారని, నిస్సహాయ స్థితిలో లెక్కలేనన్ని మృతదేహాలను మాయం చేశారనని చెబుతున్న సదరు వ్యక్తి ఇప్పుడు మానసిక క్షోభ అనుభవిస్తూ.. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. మరోవైపు భయం వెంటాడుతోంది. అందుకే తెగించి చివరికి పోలీసులను ఆశ్రయించినట్లు కనిపిస్తోంది. పోలీసుల సమక్షంలో తాను గతంలో పూడ్చిన శవాలను వెలికితీసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఆ శవాలకు తగిన పద్ధతిలో అంత్యక్రియలు చేయకపోతే వాటి ఆత్మలు శాంతించవని, తనను కూడా అపరాధ భావం వెంటాడుతుందని పేర్కొన్నాడు. మాజీ పారిశుధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. కర్ణాటక అసెంబ్లీని మాత్రం ఈ అంశం కుదిపివేసింది. దీనిపై సిట్‌ వేసి పూర్తిస్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించాల్సి వచ్చింది. గుర్తు తెలియని మృతదేహాల పూడ్చివేత, దహనం ఉదంతాలు వెలుగులోకి వచ్చిన క్రమంలో తమ పిల్లలు కనిపించడం లేదన్న ఫిర్యాదులు పెరుగుతున్నాయి. 2003లో స్నేహితులతో కలసి ధర్మస్థలకు వెళ్లిన అనన్య భట్‌ అనే మెడికో అదృశ్యమైంది. తాజా ఫిర్యాదు నేపథ్యంలో తమ కుమార్తె మిస్సింగ్‌ కేసును మళ్లీ ఫిర్యాదు చేయాలంటూ ఆమె తల్లి సుజాతా భట్‌ దక్షిణ కన్నడ జిల్లా పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఇలాగే పలువురు తమ కుమార్తెల ఆచూకీ కనుగొనాలంటూ పాత కేసులతో మళ్లీ పోలీసుల వద్దకు వస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page