top of page

నిఘా వైఫల్యం.. నకిలీ నోట్ల కలకలం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 6 days ago
  • 2 min read
  • ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే

  • డీజీపీ కార్యాలయం అలెర్ట్‌ చేస్తే తప్ప సమాచారం లేని పోలీసులు

  • డే అండ్‌ నైట్‌ జంక్షన్‌లోని లాడ్జీల్లో కొన్ని రోజులుగా దందా

  • నగరానికి చెందిన ఓ పెద్దమనిషి కీలక పాతధ్రారిగా అనుమానాలు

															(ఫైల్‌ ఫోటో)
(ఫైల్‌ ఫోటో)

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నేర నియంత్రణలో అతి కీలకమైనది.. నిఘా. అది కన్ను చేరేస్తే నేరాలకు అడ్డుండదు.. ఇక్కడా అక్కడా అన్న తేడా కూడా ఉండదు. శ్రీకాకుళంలో అచ్చం ఇదే జరిగింది. జిల్లా పోలీస్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే కొన్ని రోజులుగా దొంగనోట్ల చెలామణీ దందా జరిగిపోతున్నా పోలీసుల దృష్టికి రాలేదు. రాష్ట్ర పోలీస్‌ బాస్‌ (డీజీపీ) కార్యాలయం నుంచి సమాచారం అందితే తప్ప స్థానిక పోలీసులు అప్రమత్తం కాలేదంటే జిల్లాలో నిఘా ఎంత నీరసంగా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. తమకు అందిన ఫిర్యాదును డీజీపీ కార్యాలయం జిల్లా పోలీసు కార్యాలయానికి పంపడంతో అలెర్టయిన పోలీసులు తనిఖీలు నిర్వహించి జిల్లా ఎస్పీ కార్యాలయ సమీపంలోనే ఉన్న ఒక లాడ్జీని కేంద్రంగా చేసుకుని గత ఇరవై రోజులుగా దొంగనోట్లు చెలామణీ చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నట్లు తెలిసింది. వాటాల విషయంలో ముఠా సభ్యుల మధ్య తేడాలు రావడం వల్లే ఈ సమాచారం బయటకొచ్చిందని పోలీసువర్గాలు పేర్కొన్నాయి.

అనైతిక కార్యకలాపాలకు అడ్డాలు

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏచిన్న ఘటన జరిగినా.. నగరంలోని లాడ్జీల్లో తనిఖీల పేరుతో పోలీసులు హడావుడి చేస్తుంటారు. అలాగే రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ముఖ్యమైన రోజుల్లో భదత్రా కారణాలతో లాడ్జీల్లో తనిఖీలు చేయడం సర్వ సాధారణం. మిగిలిన రోజుల్లో మాత్రం లాడ్జీలను పట్టించుకోరన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఉన్న లాడ్జీ కేంద్రంగా దొంగనోట్ల దందా యథేచ్ఛగా సాగి.. చివరికి డీజీపీ కార్యాలయ హెచ్చరికలతో గుట్టు రట్టయింది. జిల్లా కేంద్రంలోని దాదాపు అన్ని లాడ్జీల్లో పేకాట, మద్యపానం, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యమయ్యాయి. ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఎన్నోసార్లు వెలుగు చూసినా పోలీసులకు పట్టడం లేదన్న విమర్శలున్నాయి. కొద్దిరోజుల క్రితం డే ఆండ్‌ నైట్‌ జంక్షన్‌లోని ఒక లాడ్జీలో పేకాడుతూ కొందరు దొరికారు. టాస్క్‌ఫోర్సు ద్వారా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పేకాటను అదుపు చేయగలిగిన పోలీసు బాస్‌ లాడ్జీల్లో జరుగుతున్న జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలను మాత్రం నియంత్రించలేకపోతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రాన్ని గాలికొదిలేశారా?

పలాస, మెళియాపుట్టి, జి.సిగడాం కేంద్రంగా నకిలీ నోట్ల చెలామణీ చేస్తున్న ముఠాలు గతంలో చిక్కాయి. వీరికి వైజాగ్‌, రాజమండ్రి, తిరుపతికి చెందిన ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలన్నీ పలాస కేంద్రంగా నకిలీ నోట్లు చెలామణీ చేస్తున్నట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు పలాసపైనే దృష్టిపెట్టి జిల్లా కేంద్రాన్ని గాలికొదిలేశారు. ఇదే అదనుగా నకిలీ నోట్ల ముఠాలు జిల్లా కేంద్రాన్నే అడ్డాగా మార్చేసుకున్నాయి. ఇటీవల డే అండ్‌ నైట్‌ జంక్షన్‌లోని ఒక లాడ్జీలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకోవడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ నోట్ల వ్యవహారంలో నగరానికి చెందిన ఒక ప్రముఖుడి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో మరి కొన్ని అంశాలు కూడా వెలుగు చూసినట్టు తెలిసింది. పోలీసులు ఈ కేసులో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. గతంలో పట్టుబడిన నకిలీ నోట్ల ముఠాలపై దృష్టి సారించకపోవడంతో పోలీసుల వైఫల్యం వల్లే జిల్లా కేంద్రం నకిలీ నోట్లు చెలామణీకి తెర లేచిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page