నిజంగానే వృద్ధి వెలిగిపోతోంది?
- DV RAMANA

- Dec 2, 2025
- 3 min read

దేశం వెలిగిపోతోంది.. అంటూ నాడు ఏబీ వాజ్‌పేయి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం నినాదాన్ని ఎత్తుకుంది. అయితే 2004 ఎన్నికల్లో ఆ నినాదం ఎదురుతిరిగి ఎన్డీయేను ఓడగొట్టింది. ఆ తర్వాత ‘దేశం వెలిగిపోతుంది’ అన్న నినాదం మలిగిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దేశాన్ని నేరుగా కాకుండా ఆర్థిక గణాంకాలు వెలుగులీనుతూ ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న వారిని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇది పరోక్షంగా దేశం అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పడమే. అయితే ఇదెలా సాధ్యం.. నమ్మశక్యమా.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈసారి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 6.5 శాతం ఉండవచ్చని రిజర్వు బ్యాంక్ అంచనా వేసింది. కానీ అది ఏకంగా 7.8 శాతానికి పెరిగి ఆశ్చర్యానికి గురిచేసింది. దీని అసలు కథ వేరే ఉంది. ఈ మెరుపుల వెనుక ఒక చీకటి కోణం ఉంది. మార్కెట్లో వస్తువులు కొనేవారే కరువయ్యారు. దీన్నే ఆర్థిక పరిభాషలో డిమాండ్ స్లోడౌన్ అంటే.. మాంధ్యంగా అభివర్ణిస్తుంటారు. సాధారణంగా ధరలు తగ్గితే జనం సంతోషిస్తారు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల రేటు) 0.25 శాతానికి పడిపోయింది. ఇది గత 13 ఏళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ. దీనర్థం ప్రజల దగ్గర డబ్బు లేక వస్తువులు కొనడం లేదు. డిమాండ్ లేక ధరలు పడిపోతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ లక్షణం కాదు. గణాంకాల పట్టికలను కాసేపు పక్కన పెట్టి వాస్తవాలను చూస్తే.. మే 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీ రేట్లు 0.52 శాతం మాత్రమే పెరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో పెరుగుదల 0.83 శాతంగా ఉండేది. అంటే ఆదాయం పెరగడం అటుంచి అంతకంతకూ తగ్గిపోతోంది. గత ఆరేళ్ల లెక్కలు పరిశీలిస్తే (2017-18 నుంచి 2023-24 వరకు) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిజమైన ఆదాయం స్తంభించిపోయింది. కొన్నిచోట్ల అది మైనస్‌లోకి వెళ్లిపోయింది. చేతిలో డబ్బు ఆడకపోవడంతో ఆహారం మీద చేసే ఖర్చును కూడా జనం తగ్గించుకుంటున్నారు. గ్రామీణ భారతం ఆర్థికంగా చితికిపోయింది. ఎఫ్‌ఎంసీజీ రంగంలో అమ్మకాలు అంతంత మాత్రమే. సబ్బులు, పేస్ట్‌లు వంటి నిత్యావసరాల అమ్మకాలు మందగించడం దీనికి నిదర్శనం. ఆర్‌బీఐ, పీఎల్‌ఎఫ్‌ఎస్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీల లాభాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ వాటిలో పనిచేసే ఉద్యోగుల, కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదు. జీడీపీ వృద్ధి రేటు పెరగడం మంచిదే. కానీ సామాన్యుడికి ఉపాధిని, ఆదాయాన్ని ఇవ్వలేనప్పుడు అది కేవలం కాగితాలకే పరిమితం అవుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి. అప్పుడే ఆర్థిక వ్యవస్థలో నిజమైన చలనం వస్తుంది. లేదంటే ఈ ‘స్లోడౌన్’ (మందగమనం) మరింత ముదిరే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) దేశీయ పారిశ్రామిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గినట్లు ఎస్‌ఎస్‌వో నివేదిక వెల్లడిరచింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వృద్ధిరేటు నాలుగు శాతం ఉండటం గమనార్హం. అంటే ఏడాది వ్యవధిలోనే పారిశ్రామిక రంగం 1.3 శాతం మందగించిందన్నమాట. తయారీరంగం(మాన్యుఫాక్చరింగ్ సెక్టార్)లో చూస్తే ఈ రంగంలో 23 గ్రూపులు ఉంటే వాటిలో తొమ్మిది గ్రూపులు మాత్రమే గత ఏడాది కాలంలో వృద్ధి సాధించగలిగాయి. మిగిలిన 14 రంగాలు నిరాశాజనక ఫలితాలు సాధించాయి. మొత్తంగా తయారీరంగాన్ని తీసుకుంటే గత ఏడాది అక్టోబర్ 4.4 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈ ఏడాది అక్టోబర్ నాటికి 1.8 శాతం తగ్గి 2.6 శాతానికి పరిమితమైంది. గనుల రంగంలో అయితే వృద్ధి లేకపోగా తిరోగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది 0.9 శాతంగా ఉన్న వృద్ధిరేటు ఈ ఏడాది మైనస్ 1.8 శాతంగా నమోదైంది. విద్యుత్‌రంగం ప్రగతి కూడా ఏకంగా మైనస్ 6.9 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా దేశ ఆర్థికవ్యవస్థ ప్రగతి ఆందోళనకరంగానే ఉన్నట్లు రంగాలవారీగా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో ఉత్పాదకత క్షిణించడం, అదే సమయంలో జాతీయ స్థాయిలో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడం మార్కెట్ డిమాండును పతనావస్థలోకి నెట్టేసింది. మెజారిటీ ఆర్థిక నిపుణులు ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్పాదన, కొనుగోలు శక్తిలో క్షీణత అనివార్యంగా నిరుద్యోగ సమస్య పెరుగుదలకు దారితీస్తుంది. ఈ ప్రభావమే దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)పై పెను ప్రభావం చూపించింది. ఫలితంగా ఐఐపీ వృద్ధిరేటు 0.4 శాతానికే పరిమితమైంది. పరిశ్రమలకు పెట్టుబడులు, రుణాల లభ్యత, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కరువైపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వైపు పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల పెద్దలు చూస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2026`27) బడ్జెట్‌ను వచ్చే ఫిబ్రవరి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కానీ దానికి సంబంధించి వివిధ రంగాలు, శాఖల చేయాల్సిన కేటాయింపులు ప్రాధాన్యతల ఆధారంగా ఖరారు చేసే కసరత్తును కేంద్ర ఆర్థిక శాఖ అప్పుడే ప్రారంభించేసింది. ఆ మేరకు వచ్చే బడ్జెట్‌లో పరిశ్రామిక రంగానికి పన్నుల రాయితీలు, ఇతరత్రా ప్రోత్సాహకాలు ప్రకటించాలని ఆయా రంగా ప్రతినిధులు కోరుతున్నారు. ఆ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖలు రాస్తున్నారు. ఈ పరిణామాలన్నీ దేశీయ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో నెలకొన్న నిరుత్సాహకర వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది అక్టోబర్ నాటికి 7.8 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధించామని ప్రకటించడం వాస్తవాలను మసకబార్చడంతోపాటు ఇవే అంకెలతో భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తే మరింత చేటు తప్పదు.










Comments