top of page

నాడు ఆమెపైకి నెపం.. మరి ఇప్పుడెవరిది ఆ పాపం!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jul 19
  • 3 min read
ree
  • ఆర్ట్స్‌ కళాశాల గత ప్రిన్సిపాల్‌పై అధ్యాపకుల దుష్ప్రచారం

  • మూల్యాంకనానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఫిర్యాదులు

  • మొన్న బహిష్కరిస్తున్నట్లు యూనియన్ల మోమొరాండం

  • సెకండ్‌ సెమిస్టర్‌ పక్క సెంటర్‌కు వెళ్లిపోయింది

  • గతంలోనూ ఈ డిమాండ్లే ఉన్నా.. సురేఖను బలిపశువు చేశారు

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘స్థానిక యూనివర్సిటీ అధికారులు మాకు సెమిస్టర్‌`1, 3 మూల్యాంకనంలో పాల్గొనాలని ఆదేశించగా.. అప్పుడు ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న చిన్నారావును అడిగాం. ఆయన సెలవులో ఉన్న ప్రిన్సిపాల్‌ సురేఖ గారికి ఫోన్‌ చేశారు. మూల్యాంకనానికి ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదని, అలా వెళ్తే ఇక్కడ పాఠాలు యూనివర్సిటీవారు వచ్చి చెబుతారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై తాను కమిషనర్‌కు చెప్పుకుంటానని, ఎవరూ స్పాట్‌ వాల్యూయేషన్‌కు వెళ్లడానికి వీల్లేదని ఆమె గద్దించారు. ఆ తర్వాత తామంతా మూల్యాంకనానికి వెళ్తామని, రిలీవ్‌ చేయమని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్‌గా ఉన్న ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎ.మోహన్‌రాజు గారికి విన్నవించగా ఆయన మాకు అనుమతి ఇచ్చారు. అయితే ప్రిన్సిపాల్‌ సురేఖ సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయనపై రుసరుసలాడారు. మూల్యాంకనం కూడా అభ్యసన, బోధన ప్రక్రియలో భాగమే కదా.. మేడమ్‌ అని ఆయన అన్నారు.’

..ఇవి అప్పటి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పెంకి సురేఖ స్పాట్‌ వాల్యూయేషన్‌ నియమాలను ఉల్లంఘించారంటూ 17 మంది అధ్యాపకులు సంతకాలు చేసి 2022 అక్టోబర్‌ 13న రాష్ట్ర ముఖ్యమంత్రికి అడ్రస్‌ చేస్తూ పంపిన ఫిర్యాదులోని కొన్ని అంశాలు.

ఏళ్లుగా అవే డిమాండ్లు
ree

ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో డాక్టర్‌ సురేఖపై చేసినన్ని ఫిర్యాదులు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరి మీదా.. ఎవరూ చేసుండరు. వీటిపై విచారణ జరిగినా.. దోషులెవరో తేలకపోయినా.. ఫిర్యాదుల పరంపర మాత్రం ఆగలేదు. ఆ క్రమంలో 2022 అక్టోబర్‌లో చేసిన ఫిర్యాదులో ఉన్న అంశాలు నిజమా కాదా అన్నది కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు ఆర్ట్స్‌ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ సురేఖ లేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా స్థానిక వర్సిటీ నుంచి డిగ్రీ ఫోర్త్‌ సెమిస్టర్‌ పేపర్లు దిద్దడానికి రండి అంటూ గత నెల మొదటి వారంలో ఆదేశాలు వచ్చాయి. కానీ తాము ఈ మూల్యాంకనానికి రామని, తమ డిమాండ్లు పరిష్కరించేవరకు స్పాట్‌ వాల్యూయేషన్‌లో పాల్గొనబోమంటూ కళాశాల అధ్యాపకులు ఒక వినతిపత్రం విడుదల చేశారు. చీఫ్‌ ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లకు రెమ్యునరేషన్‌ పెంచాలని, పేపరుకు రూ.15 నుంచి రూ.20 వరకు ఇవ్వాలని, స్పాట్‌ వాల్యూయేషన్‌కు వచ్చేవారికి డీఏలు ఇవ్వాలని, ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లకు లోకల్‌ కన్వేయన్స్‌ ఇవ్వాలంటూ.. మొత్తం ఏడు డిమాండ్లను వర్సిటీ అధికారుల ముందుంచి, వాటిని నెరవేర్చేవరకు స్పాట్‌ వాల్యూయేషన్లు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ డిమాండ్లు కొత్తవి కావు.. 2022లో సురేఖపై ఫిర్యాదు చేయకముందే యూనివర్సిటీ అధికారుల ముందు ఉంచారు. ఇప్పటి వరకు వాటిని నెరవేర్చకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రకటించారు.

ఆమెపై అనసరంగా నెపం

మరి.. ఈ మాత్రం దానికి తమను స్పాట్‌ వాల్యుయేషన్‌కు వెళ్లనివ్వడంలేదని, రిలీవ్‌ చేయమంటే కమిషనర్‌తో మాట్లాడుకుంటానని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా సురేఖ పెద్ద మాటలన్నారంటూ అప్పుడు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడమెందుకో అర్థం కాలేదు. అంతేకాదు 2022 నుంచి మొన్నటి వరకు సురేఖ ప్రిన్సిపాల్‌గా ఉండి దీన్ని ఆపేశారని ప్రచారం చేశారు. మరి ఇప్పుడెందుకు స్పాట్‌ వాల్యుయేషన్‌ను బహిష్కరించారో యూనియన్‌ నాయకులు చెప్పడంలేదు. వాస్తవానికి గవర్నమెంట్‌ కాలేజ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌, గవర్నమెంట్‌ కాలేజ్‌ గెజిటెడ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ పేరుతో రెండు సంఘాలు ఉన్నాయి. వీటికే రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్నాయి. ఈ లెటర్‌ హెడ్లను అడ్డు పెట్టుకునే ప్రతిసారీ బదిలీల నుంచి కొందరు తప్పించుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు సంఘాల లెటర్‌హెడ్లను పక్కన పెట్టి కాంట్రాక్ట్‌ అండ్‌ గెస్ట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ పేరుతో వర్సిటీకి మెమొరాండం ఇచ్చారు. భవిష్యత్తులో ఇది బూమరాంగ్‌ అయితే.. అసలు ఈ అసోసియేషన్‌కు, తమకు సంబంధం లేదని దీర్ఘకాలంగా ఇక్కడ తిష్ట వేసుక్కూర్చున్నవారు చేతులెత్తేయడానికి వీలుగా దీన్ని సృష్టించారు.

సెలవులు కుదించారని యాగీ

తాము కళాశాల సెలవుల్లో స్పాట్‌ వాల్యుయేషన్‌కు రాలేమని స్పష్టం చేయడం వల్లే స్థానిక వర్సిటీ సెలవులను కుదించేసి, జూన్‌ 16కే కళాశాలలు తెరవాలని ఆదేశాలిచ్చారంటూ రిజిస్ట్రార్‌ సుజాతపై ప్రచారం చేశారు. వాస్తవానికి ప్రధానమంత్రి సమక్షంలో గిన్నిస్‌బుక్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం విశాఖలో యోగాడే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉన్నత విద్యాశాఖ అన్ని యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలు జూన్‌ 16న తెరిచి యోగాపై ఒకరోజు శిక్షణ ఇచ్చి, వారిని వైజాగ్‌ తీసుకురావాలని ఆదేశాలిచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ కాలేజీ కూడా జూన్‌ 16న తెరిచారు. వాస్తవం ఇదయితే.. తమను మూల్యాంకనానికి రప్పించడానికే రిజిస్ట్రార్‌ సుజాత ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అసోసియేషన్‌ నాయకులు గగ్గోలు పెట్టారు. తమ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్‌ కళాశాల అధ్యాపకులు స్పాట్‌ వాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామంటున్నారని వర్సిటీ వీసీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో విజయవాడలో కళాశాల ప్రిన్సిపాళ్లతో కమిషనర్‌ వర్క్‌షాప్‌ నిర్వహించి స్పాట్‌ వాల్యూయేషన్‌కు వెళ్లని వారిని క్షమించలేమంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అయితే ఆ వర్క్‌షాప్‌కు ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ హాజరుకాలేదు. అది వేరే సంగతి. అయితే కళాశాలలు రీ ఓపెన్‌ అయిన తర్వాత మాత్రమే స్పాట్‌ వాల్యూయేషన్‌ చేపడతామని వీరు మరో కండిషన్‌ పెట్టారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని యూనివర్సిటీల పరిధిలో సెలవు రోజుల్లోనే నిర్వహించారు. స్పాట్‌ వాల్యూయేషన్‌లో పాల్గొనే అధ్యాపకులకు సంబంధిత వర్సిటీలు రెమ్యునరేషన్‌ ఇస్తాయి. ఇదేదో ఉచితంగా చేసే పని కాదు. పనిదినాల్లో క్లాసులు చెప్పాలి కాబట్టి సెలవు రోజుల్లో స్పాట్‌ వాల్యూయేషన్‌కు రావాలని పిలుస్తారు. కానీ మన ఆర్ట్స్‌ కాలేజ్‌ అధ్యాపకులు మాత్రం క్లాసులు ఎగ్గొట్టి మాత్రమే వాల్యూయేషన్‌కు వస్తామని, అయినా తమకు రెమ్యునరేషన్‌ మాత్రం ఇచ్చేయాలని అంటున్నారు. మొత్తానికి కమిషనర్‌ ఒత్తిడి కానీయండి, క్లాసులు ఎగ్గొట్టి పేపర్లు దిద్దే అవకాశం వచ్చిందనుకోండి.. ఏది ఏమైనా మొత్తానికి ఫోర్త్‌ సెమిస్టర్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ పూర్తయింది. కానీ వీరి డిమాండ్లేవీ ఎప్పట్లాగే పరిష్కారం కాలేదు. కాకపోతే ఈసారి నెపం నెట్టేయడానికి సురేఖ లేరు. అలాగే సెకండ్‌ సెమిస్టర్‌ పేపర్లు కూడా దిద్దకపోవడంతో వాటిని టెక్కలి, రాజాం ఉమెన్స్‌ కాలేజీలకు పంపించి పని పూర్తి చేశారు. ఇప్పుడు వీరి నిర్వాకం వల్ల ఆర్ట్స్‌ కళాశాలకు ప్రాక్టికల్స్‌ రీజనల్‌ సెంటర్‌ కూడా ఇవ్వకుండా రాజాం, ఉమెన్స్‌ కాలేజీలకు బదిలీ చేస్తున్నట్టు తెలిసింది. 2022.. ఆ తర్వాత స్పాట్‌ వాల్యూయేషన్‌కు వెళ్లడానికి సురేఖ అడ్డు చెప్పారని ఫిర్యాదు చేసిన నాయకులు ఇప్పుడెందుకు పేపర్లు దిద్దడానికి వెళ్లలేదన్న విషయం మాత్రం బయటకు చెప్పరు. ఉమెన్స్‌ కాలేజీకి వెళ్లి పేపర్లు దిద్దడానికి పోటీ పడిన అధ్యాపకులు ఇప్పుడు తమ సొంత కాలేజీలోనే పేపర్లు దిద్దే అవకాశమొస్తే చేతులెత్తేశారు. ఈసారి స్పాట్‌ వాల్యూయేషన్‌కు వెళ్లమని, గతంలో సురేఖ వెళ్లనివ్వడంలేదని విప్లవం రేకెత్తించిన కెమిస్ట్రీ అధ్యాపకుడు గత తొమ్మిదేళ్లలో ఎన్ని స్పాట్‌ వాల్యూయేషన్లకు హాజరయ్యారో ఒక్కసారి రికార్డులు తిరగేస్తే తెలుస్తుంది. ఎందుకంటే.. ఈ తతంగాన్ని తెర వెనుక నడిపింది ఆయనే. వర్సిటీకి నిమ్మ వెంకటరావు వీసీగా ఉన్నప్పుడు గుర్తుకురాని డిమాండ్లు, స్పాట్‌ వాల్యూయేషన్‌ బహిష్కరణలు ఇప్పుడు ఎందుకు తెరమీదకు వచ్చాయి? వర్సిటీలో ఏ కులనాయకుడ్ని రక్షించడానికి ఆర్ట్స్‌ కళాశాలలో నాటకాలు మొదలయ్యాయి? వంటి అంశాలతో మళ్లీ కలుద్దాం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page