మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
- BAGADI NARAYANARAO

- 3 days ago
- 2 min read
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే
బయోమెట్రిక్‌ను మేనేజ్ చేస్తున్న వైనం
స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు
నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది
బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ పథకం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్వయంగా ఫోర్డ్ కంపెనీ సీఈవో ఆమధ్య ట్వీట్ చేశారు. దాన్నే మన దేశంలో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అధినేత ఆనంద్ మహీంద్ర ఫార్వర్డ్ చేశారు. అంటే స్కిల్ ఎంత పెద్ద సమస్యో అర్థమవుతుంది. అందరికీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలే కావాలి. మిగిలినవారందరూ స్టార్టప్‌లే పెట్టుకోవాలి. స్టార్టప్‌కి, వ్యాపారానికి తేడా తెలియనివారు సైతం ఏదో ఒకటి చేయడం, చేతులు కాల్చుకుని నష్టపోయామని చెప్పడం ఫ్యాషనైపోయింది. అటువంటివారికి ఇష్టమైన రంగంలో నైపుణ్యం మీద శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంది. మేక్ ఇన్ ఇండియా నినాదం నుంచి ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ వరకు అన్నింటి లక్ష్యం మనకు అవసరమైన వాటిని మనమే తయారుచేసుకోవడం. ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే, నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినవారు మాత్రం ఇదో మొక్కుబడి వ్యవహారంగా, తప్పనిసరి తంతుగా భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకు ఓ తాజా ఉదాహరణ చూద్దాం.
కంచు, ఇత్తడి కళాత్మక పరిశ్రమకు సారవకోట మండలం బుడితి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక్కడ తయారయ్యే గృహ అవసరాలు, పూజా సామాగ్రి, అలంకరణ వస్తువులు దేశవిదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీన్ని మరింత కళాత్మకంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం, హస్తకళలు అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాంను బుడితిలో అక్టోబర్ 29న వర్క్‌షాపు ప్రారంభించారు. సాంకేతికతను వినియోగించి నూతన నమూనాలు రూపకల్పన చేసి నాణ్యతతో ఆకర్షణీయమైన కంచు, ఇత్తడి వస్తువులు తయారుచేసి లేపాక్షి సంస్థ ద్వారా మార్కెటింగ్‌కు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రెండు నెలల పాటు ఇవ్వనున్న వర్క్‌షాపును బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటీరియల్ క్రాఫ్ట్ ప్రతినిధి అద్దాల రామకృష్ణ నిర్వహిస్తున్నారు. ఈ వర్క్ షాపులో 27 మందికి శిక్షణ ఇస్తున్నారు. దీనికి ముందు గురుశిష్య పరంపర అనే శిక్షణా కార్యక్రమం రెండు నెలల పాటు నిర్వహించారు. దానికి కొనసాగింపుగా దీన్ని చేపట్టారు. శిక్షణా కేంద్రాన్ని రామకృష్ణ ఇంటి ముందు ఉన్న పాకలోనే నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణలో పాల్గొనే వారందరికీ రోజుకు రూ.300 స్టైఫండ్‌ను చెల్లిస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చే అద్దాల రామకృష్ణ, ఆయన భార్యకు మాత్రం ఇన్‌స్ట్రక్టర్లుగా నెలకు చెరో రూ.25వేలు చెల్లిస్తున్నారని తెలిసింది. శిక్షణ ప్రారంభమైన మొదటి 10 రోజులు పూర్తిస్థాయిలో అందరూ హాజరయ్యారు. ఆతర్వాత ఒకరిద్దరు తప్పా అందరూ వచ్చివెలుతున్నారని తెలుస్తుంది. లేపాక్షి సంస్థ నుంచి ప్రతినిధులు వస్తారని సమాచారం వస్తే అందుబాటులో ఉన్నవారిని వర్క్‌షాపుకి తీసుకువచ్చి షో చేసి పంపించాల్సిన పరిస్థితి. బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ ఫర్మాన్ అహ్మాద్ ఖాన్‌తో పాటు లేపాక్షి సంస్థ ప్రతినిధులు శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. ఉన్నతాధికారులు శిక్షణా కేంద్రాన్ని సందర్శిస్తారని ముందస్తు సమాచారం ఉండడంతో అందుబాటులో ఉన్నవారిని వర్క్‌షాపునకు తీసుకువచ్చి శిక్షణలో ఉన్నట్టు చూపించినట్టు చర్చ సాగుతుంది. ఈ నెల 28తో శిక్షణ పూర్తి కానుంది. అందులో శిక్షణ పొందుతున్నట్టు చూపిస్తున్న వారిలో బుడితి బెల్ అండ్ బ్రాస్ మెటీరియల్ క్రాఫ్ట్ ప్రతినిధి, వర్క్ షాపు ఇన్‌స్ట్రక్టర్ అద్దాల రామకృష్ణ కుటుంబ సభ్యులే ఉన్నారనే ఆరోపణలూ లేకపోలేదు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో పాటు సమీప బంధువులందరినీ శిక్షణ తీసుకుంటున్నవారి జాబితాలో చేర్చారని విమర్శలు ఉన్నాయి. అక్క, చెల్లెలు పిల్లలను శిక్షణ తీసుకుంటున్నవారి జాబితాలో చేర్చినట్టు ప్రచారం సాగుతుంది. ఈ జాబితాలో ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉండడం విశేషం. ఈయనకు శిక్షణ ఇస్తున్నట్టు జాబితాలో చేర్చారు. శిక్షణ పొందుతున్న వారి జాబితాలో ఉన్న ఒకరు తన కుటుంబంతో కలిసి 15 రోజులు పాటు హైదరాబాద్ వెళ్లి తిరిగి వచ్చారు. జాబితాలో ఉన్న 27 మందిలో కేవలం ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా రామకృష్ణ సొంత మనుషులేనని చెబుతున్నారు. నైపుణ్య శిక్షణకు వచ్చే వారికి ఇచ్చే గౌరవ వేతనం రూ.300 వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నట్టు లేపాక్షి ప్రతినిధులు చెబుతున్నారు. శిక్షణకు వచ్చేవారు విధిగా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. అందుబాటులో లేకపోయినా, శిక్షణకు హాజరు కాకపోయినా బయోమెట్రిక్‌ను మిగిలిన అనేక అటెండెన్స్‌ల మాదిరిగానే మేనేజ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిన్నాయి. రామకృష్ణ బయట నుంచి వచ్చే ఆర్డర్లను చీడిపూడిలోని నైపుణ్య కలిగిన కళాకారులకు అప్పగించి కమీషన్ తీసుకుంటారని బుడితిలో ప్రచారం ఉంది. ఒడిశాలోని బరంపురం, రాజమండ్రి నుంచి కొన్ని వస్తువులను దిగుమతి చేసుకొని వాటిని ఇక్కడ తయారు చేసినట్టు చూపించి లేపాక్షికి పంపిస్తుంటారని కూడా విమర్శలు ఉన్నాయి. బుడితిలో ఎంతోమంది నైపుణ్యం కలిగిన హస్తకళాకారులు ఉన్నా రామకృష్ణతో వర్క్‌షాపు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు ఉన్నాయి. కూటమి పార్టీలకు చెందిన నాయకుల సహకారంతో రామకృష్ణ వర్క్‌షాపు నిర్వహిస్తూ శిక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.










Comments