బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
- NVS PRASAD

- Dec 3, 2025
- 3 min read
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ
జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్‌లో స్టాఫ్‌వే మూడొంతులు
ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన్నదే భారీ వాహనాల కోసమని ఉదాశీనంగా కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ డ్రైవ్‌లు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే.. రాబోయేది సంక్రాంతి సీజన్. సహజంగానే నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దీనికి తోడు ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం కల్పించడం వల్ల ఈసారి సంక్రాంతికి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున షాపింగ్ కోసం మహిళలు నగరానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని జీటీ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతాలను ఇప్పట్నుంచే క్లియర్ చేసుకోవాలని ప్రజలు సూచిస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు వైకాపాలో మంత్రిగా ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు పెద్దమార్కెట్ చుట్టూ సీసీ రోడ్లు నిర్మించారు. అయితే ఇది ప్రయాణీకులకు పనికిరాకుండాపోయిందని ప్రజలకు అర్థం కావడానికి ఎన్నో రోజులు పట్టలేదు. నగరంలో తోపుడుబళ్ల వ్యాపారం చేస్తున్నవారంతా ఈ సీసీ రోడ్డును పూర్తిగా ఆక్రమించేసి బజారుకు ఉన్న నాలుగు ద్వారాల్లో మూడిరటి నుంచి అడుగు పెట్టడం దుర్భేధ్యం అన్నట్టు మార్చేశారు. ట్రాఫిక్ ఎస్‌ఐ మెట్ట సుధాకర్ ఆమధ్య స్థానిక పందుంపుల్లల జంక్షన్ నుంచి మార్కెట్ చుట్టూ ఉన్న వీధులపై ఉన్న ఆక్రమణలను తొలగించారు. అయితే కుక్కతోక వంకర చందాన మళ్లీ కథ మొదటికే వచ్చింది.

తాజాగా సీఐ రామారావు తోపుడుబళ్లు ఓ పద్ధతిలో ఉండకపోతే స్టేషన్‌కు పట్టుకుపోతామంటూ మంగళవారం బజారు పరిసర ప్రాంతాలకు వెళ్లి హెచ్చరించారు. దాని ఫలితమో, లేదూ అంటే తోపుడుబళ్ల వర్తకులు చెబుతున్నట్టు వారిలో వచ్చిన పరివర్తనో తెలియదుగానీ, బుధవారం మాత్రం మార్కెట్‌లోకి మనిషి అడుగుపెట్టే అవకాశం ఇచ్చారు. ఇది ఎన్నాళ్లు ఉంటుందనేది ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ మీద ఆధారపడి ఉంటుంది. తాజాగా బుధవారం సీఐ రామారావు పెద్దబరాటం వీధి డాక్టర్ గుంపా శివప్రసాద్ ఆసుపత్రి రోడ్డులో ఉన్న మెకానిక్ షెడ్లూ మొత్తం రాకపోకలకు అడ్డం కలిగిస్తున్నాయని తెలుసుకొని, అక్కడ నిలిపిన వాహనాలను టోవ్ వేహికల్ మీద తీసుకుపోయారు. ఒకవైపు గోపాల్ ఆటోమోటివ్స్ ఎదురుగా వాహనాలు పెట్టి రోడ్డు మీదే రిపేర్లు చేస్తుండగా, రోడ్డుకు అవతలవైపున ఒక మెకానిక్ షెడ్ ఏర్పాటుచేసి, వారు కూడా రోడ్డు మీదే బళ్లు సర్వీసింగ్ చేస్తున్నారు. 30 అడుగుల రోడ్డులో రెండువైపులా ఆక్రమణకు గురికావడంతో అక్కడ ఉన్న మెకానిక్‌లను, వ్యాపారులను సీఐ హెచ్చరించారు. గురువారం నాటికి రోడ్డు మీద ఉన్న వాహనాలన్నీ తీయకపోతే కేసులు రాస్తామన్నారు. ట్రాఫిక్ పోలీసులు బీట్‌పాయింట్‌కే పరిమితం కాకుండా నగరంలో పర్యటిస్తే సత్ఫలితాలొస్తాయనడానికి ఇది నిదర్శనం. ఎస్‌ఐ మెట్ట సుధాకర్ కూడా ఈ ప్రాంతవాసే కావడంతో నగరంలో ట్రాఫిక్ ప్రహసనం మీద ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాజకీయ ఒత్తిళ్లు ఎస్‌ఐ స్థాయి అధికారి కంటే సీఐ స్థాయి ఆఫీసర్‌కు తక్కువ ఉంటాయి కాబట్టి సీఐ చర్యలు తీసుకోవడం ప్రస్తుత వాతావరణానికి సరైనది. పనిలో పనిగా జీటీ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డుల పని పట్టాలని పౌర సమాజం కోరుతోంది. జీటీ రోడ్డులో వాహన చోదకుల కోసం ఏర్పాటుచేసిన సెంటర్ పార్కింగ్ కేవలం అక్కడ కమర్షియల్ షాపుల స్టాఫ్ వాహనాల పార్కింగ్‌కే సరిపోతుంది. దీనివల్ల నిలపరానిచోట వాహనాలు నిలిపి వినియోగదారుడు ట్రాఫిక్ చలాన్లు రాయించుకుంటున్నాడు. ఉదయం 10 గంటల లోపు షాపు తీసే సమయానికే స్టాఫ్ వచ్చి సెంటర్ పార్కింగ్‌ను తమ ద్విచక్ర వాహనాలను పెట్టేస్తున్నారు. మధ్యాహ్నం నాటికి సెంటర్ పార్కింగ్ నిండిపోతుంది. తాజాగా రెండోపూట జీటీ రోడ్డు ఎక్కినవారికి పార్కింగ్ కోసం స్థలమే దొరకడంలేదు. టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం పార్కింగ్ సదుపాయం లేకుండా సెల్లార్‌ను కమర్షియల్ పర్పస్‌కూ వాడుతున్నా చూస్తూ ఉండటం వల్ల అందరి వాహనాలకు సెంటర్ పార్కింగే దిక్కయింది. కొన్ని షాపింగ్‌మాల్‌లకు సెల్లార్‌లు ఉన్నా ఇందులో కేవలం కారులో వచ్చిన కస్టమర్‌కే అవకాశం కల్పిస్తున్నారు. సిబ్బంది సెంటర్ పార్కింగ్‌కు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. జీటీ రోడ్డు మొత్తం కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల సిబ్బంది, వారి వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి బలగ ప్రాంతం వరకు ట్రాఫిక్ కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మధ్యాహ్నం ఒడిశా వైపు వెళ్లే ప్రైవేటు బస్సులు, సాయంత్రం విజయవాడ వైపు వెళ్లే లగ్జరీ బస్సులకు నడిరోడ్డే అడ్డా. వేకువజామున తప్ప మరెప్పుడూ ఆ రోడ్డు మీద అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయాలు నగరంలో కాకుండా సింహద్వారం ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదన ఉన్నా పాసింజర్ సర్వీస్‌తో పాటు కార్గోను కూడా ఈ బస్సులు హ్యాండిల్ చేస్తుండటం వల్ల నగరాన్ని వీడి వెళ్లడంలేదు. హైదరాబాద్ వెళ్లాలంటే ఇక్కడ నాలుగు గంటలకే స్లీపల్ బస్సెక్కాలి. ఆ తర్వాత విజయవాడకు వెళ్లాలంటే రాత్రి 9 గంటల వరకు ప్రైవేటు బస్సులు ఇక్కడే నిలుపుతున్నారు. ప్రస్తుతానికి ట్రాఫిక్ స్టేషన్‌లో మంచి టీమ్ ఉంది. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు కచ్చితంగా విధులు నిర్వహించేవారే ఎక్కువ శాతం ఉన్నారు. ఇటువంటి సమయంలోనే నగరంలో ఒక బెంచ్‌మార్క్‌ను సృష్టించాలి. ఇదే భవిష్యత్తులో ఎవరు వచ్చినా అనుసరణీయం కావాలి.










Comments