నితీష్ రూటే సెపరేటు!
- DV RAMANA

- Oct 7
- 3 min read
20 ఏళ్లకుపైగా బీహార్ ముఖ్యమంత్రి
సీఎం అయ్యాక ఒక్కసారి కూడా అసెంబ్లీకి ఎన్నికవ్వలేదు
ప్రతిసారీ ఎమ్మెల్సీగానే ఆ ఉన్నత పీఠం చేరుకున్న నేత
1985లోఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తొలి రెండుసార్లు ఓటమి

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రజాక్షేత్రంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుని, ప్రజాఓటు బలంతో చట్టసభలకు ఎన్నికైన వారు ఆయా పార్టీల పార్లమెంటరీ, లెజిస్టేచర్ విభాగాల అధ్యక్షులుగా ఎన్నికై.. ఆనక ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి వంటి రాజ్యాంగ పదవులను అధిష్టించడం సహజం. అలాగే శాసనమండలి సభ్యులు ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు ప్రధాన మంత్రి పదవిని చేపట్టే అవకాశం కూడా ఉంది. ఇది భారత రాజ్యాంగం నిర్దేశించిన పద్ధతి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో చట్టసభల్లో సభ్యులు కాకుండానే ప్రధాని, ముఖ్యమంత్రి పదవులు చేపట్టే అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. అయితే దీనికి కొన్ని పరిమితులు విధించింది. ఉన్నత పదవులు చేపట్టిన ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ఆరు నెలలు ముగిసిన మరుక్షణమే వారి పదవులు రద్దయిపోతాయి. ఈ వెసులుబాట్లు ఎలా ఉన్నా.. ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వారు తాత్కాలికంగా ప్రజలతో ప్రమేయం లేని పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యసభకు ఎంపీగా, శాసనమండలికి ఎమ్మెల్సీగా వెళ్లినా.. ఆ తర్వాత ఎన్నికల్లో మాత్రం ఓటర్లలో తమ బలాన్ని నిరూపించుకుని రాజమార్గంలో ఉన్నత పదవులు చేపట్టేందుకే మొగ్గు చూపుతుంటారు. కానీ ఆయన మాత్రం ప్రత్యక్ష ఎన్నికలంటే ఎందుకో దూరంగా ఉండిపోతున్నారు. ఆయనేం సామాన్యుడు కాదు. ఒక పెద్ద రాష్ట్రానికి 20 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిత్వం వహిస్తున్న, అర్థ శతాబ్దికిపైగా రాజకీయ అనుభవం కలిగిన ప్రముఖ సోషలిస్టు నేత. ఆయన మరెవరో కాదు.. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అగ్రనేత నితీష్‌కుమార్. వచ్చే నెలలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సారధిగా, సిటింగ్ సీఎం హోదాలో తన కూటమిని ఎన్నికల యుద్ధంలో ముందుకు నడపాల్సిన నితీష్ ఈసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారా? లేదా? అన్నది చర్చనీయాంశం.
సోషలిస్టు నాయకుడిగా రాజకీయం
వెనుకబడిన తరగతులకు చెందిన నితీష్‌కుమార్ 1972లో క్రియాశీల రాజకీయాల్లో చేరారు. రామ్‌మనోహర్‌లోహియా, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, కర్పూరీ ఠాకూర్, వీ.పీ.సింగ్ వంటి నాయకులకు అనుబంధంగా పని చేశారు. 1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో చేరారు. జనతాపార్టీలో చేరారు. జనతా పతనం తర్వాత సమతా పార్టీ, అనంతరం జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) వ్యవస్థాపకుల్లో ఒకరిగా కీలకపాత్ర పోషించారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన తొలి ప్రయత్నం ఫలించలేదు. 1977లో జనతా పార్టీ తరఫున హర్నౌత్ నియోజకవర్గం నుంచి అపెంబ్లీకి పోటీ చేసిన నితీష్ ఓటమి పాలయ్యారు. 1980లో అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసినా ఓటమే ఎదురైంది. చివరికి 1985 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్‌దళ్ పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇరవయ్యేళ్లకుపైగా సీఎం కుర్చీలో కూర్చున్నప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. దానికి బదులు పరోక్ష మార్గమైన ఎమ్మెల్సీగానే ముఖ్యమంత్రి స్థానాన్ని చేరుకునేందుకే మొగ్గు చూపారు. దాన్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీహార్ రాజకీయాల్లో ఈ అంశంపైనే తీవ్ర తర్జనభర్జనలు జరుగుతుంటాయి. తాజాగా ఎన్నికల ముహూర్తం ఖరారైన పరిస్థితుల్లోనూ ఇదే చర్చ మొదలైంది.
లోక్‌సభ ఎన్నికల్లో విజయ పరంపర
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపని నితీష్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం గణనీయమైన విజయాలు సాధించి పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. జనతాదళ్, యూపీఏ తదితర ప్రభుత్వాల్లో కేబినెట్ మంత్రిగానూ పని చేశారు. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీహార్‌లోని బార్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. ఈ విజయం ఆయన జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత వరుసగా 1991, 1996, 1998, 1999 పార్లమెంటు ఎన్నికల్లోనూ పోటీ చేసి నితీష్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానాలు.. బార్, నలందల నుంచి పోటీ చేశారు. అయితే ఎప్పుడూ గెలిచే బార్‌లో ఓటమి చెందగా నలందలో విజయం దక్కింది. 2004 తర్వాత నితీష్‌కుమార్ ఏ ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. శాసనమండలి (ఎమ్మెల్సీ) ద్వారానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నితీష్‌కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో తొమ్మిది ప్రత్యక్ష ఎన్నికల్లో (అసెంబ్లీ, లోక్‌సభ కలిపి) పోటీ చేశారు. వీటిలో ఆరుసార్లు విజయం సాధించి, మూడు సార్లు ఓటమి చవిచూశారు.
ఆ ఓటములే వెనక్కి లాగాయా?
అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పోటీ చేసిన నితీష్ ఒక్కసారే విజయం సాధించారు. 1977, 1980లలో అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు చేసిన తొలి రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 1985లో మూడో ప్రయత్నంలో విజయం సాధించగలిగినా.. తొలి ఓటములే ఆయన్ను అసెంబ్లీ ఎన్నికలపై నిరాసక్తత కలిగించాయని అంటుంటారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతున్నారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. అసెంబ్లీని కాకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి శాసనమండలి మార్గాన్ని ఎంచుకోవడం నితీష్ రాజకీయ చతురతకు నిదర్శనమని ఆయన సన్నిహితులు వాదిస్తుంటారు. ముఖ్యమంత్రి అంటే ఒక రాష్ట్రానికి బాస్. అటువంటి కీలక పదవికి నేరుగా కాకుండా పరోక్షంగా పలుమార్లు ఎన్నికవ్వడం, రెండు దశాబ్దాల సుదీర్ఘకాలం పాటు ఆ పదవిలో కొనసాగడం కూడా ఒక రకమైన చరిత్రే. 2000 మార్చి మూడో తేదీన మొదటిసారి బీహార్ ముఖ్యమంత్రి పదవిని నితీష్ స్వీకరించారు. అయితే అసెంబ్లీలో మెజారిటీ లేక వారం రోజుల్లోనే అంటే 2000 మార్చి పదో తేదీన పదవిని వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత 2005 నవంబర్ 24వ తేదీ నుంచి 2014 మే 20 వరకు సుమారు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. అనంతరం ఏడు నెలల విరామం తర్వాత 2015 ఫిబ్రవరి 22న ఎన్డీయే కూటమిని ఎన్నికల్లో గెలిపించి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 2020 ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమి నెగ్గడంతో మరోమారు సీఎం అయ్యి ఇప్పటివరకు కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో యూపీఏ కూటమిని ఆ తర్వాత ఎన్డీయే కూటమిని వరుసగా గెలిపిస్తూ వస్తున్న నితీష్ తాను మాత్రం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగకపోవడం విస్మయం కలిగిస్తుంది. ఇక బీహార్ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటంతో వచ్చే నెలలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లోనైనా నితీష్‌కుమార్ పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారా.. లేదా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.










Comments