top of page

నేతల తప్పులు.. కాంగ్రెస్‌కు తిప్పలు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 30, 2025
  • 2 min read

గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ.. మన దేశంలో అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్‌. రెండు శతాబ్దాలకుపైగా చరిత్ర కలిగిన ఆ పార్టీ దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన ఘనతను కూడా సొంతం చేసుకుంది. వందలు, వేల సంఖ్యలో నాయకులను తయారుచేసి.. పదవుల అందలాలు ఎక్కించిన ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువేనని అంటారు. అందుకే నాయకులు పార్టీ లైన్‌ను పట్టించుకోకుండా.. క్రమశిక్షణ కట్టుబాట్లను ఖాతరు చేయకుండా తరచూ వ్యక్తిగత అజెండాలతోనో.. ఆవేశంతోనో నోరుజారి వివాదాలు సృష్టిస్తుంటారు. చిత్రమేమిటంటే.. నాయకులు చేసే తప్పులు, వివాదాస్పద వ్యాఖ్యలను వారి వ్యక్తిగతమైనవిగా కాకుండా కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదించేయడం కామన్‌ అయిపోయింది. ఆ పాపభారాన్ని మోయలేక అసలే శతాధిక వృద్ధురాలైనా కాంగ్రెస్‌ పార్టీ ఆపోసోపాలు పడుతుంటుంది. పరిస్థితి ఎలా తయారైందంటే తప్పులన్నీ కాంగ్రెస్‌వి, దాని అధినాయకత్వానివి.. ఒప్పులన్నీ ఆయా నాయకులవి అన్నట్లుగా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్‌ (పీసీసీ) అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలనూ పూర్తిగా కాంగ్రెస్‌కు అంటగట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిధుల వినియోగానికి సంబంధించి ముందూవెనుకా చూడకుండా షర్మిల చేసిన విమర్శలను కాంగ్రెస్‌ అధినాయకత్వానికి అంటగట్టేసి మెజారిటీ ప్రజలను ముఖ్యంగా దళితులను ఆ పార్టీకి దూరం చేసేందుకు బీజేపీ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో దళితవాడల్లో ఐదువేల ఆలయాలు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇటీవల షర్మిల తీవ్ర వాఖ్యలు చేశారు. గుడులు కడితే వాటిలో పూజరులుగా దళితులనే నియమిస్తారా? అని ప్రశ్నించడంతోపాటు సీఎం చంద్రబాబు ఆర్‌ఎస్‌ఎస్‌వాదిగా మారిపోయారని ఘాటుగా విమర్శించారు. ఇలాంటి దుందుడుకు వ్యాఖ్యలను ఆమె ఎందుకు చేశారో ఎవరికీ తెలియదు. వీటితో కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి ఎటువంటి సంబంధంలేదని, వారి అనుమతితో ఆమె ఈ వ్యాఖ్యలు చేయలేదన్నదీ వాస్తవం. కానీ కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేయడమే ఆ పార్టీ కొంప ముంచే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అసలు కాంగ్రెస్‌ లెఫ్టిస్టా, రైటిస్టా అన్న కోణంలో టీవీ ఛానళ్లు డిబేట్లతో ఊదరగొడుతున్నాయి. కానీ చరిత్ర లోతుల్లోకి వెళితే వామపక్ష భావాలు కలిగని సెంటరిస్ట్‌ పార్టీ అని అర్థమవుతుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు మినహా మిగతా కాంగ్రెసేతర పార్టీలు కాసేపు లెఫ్ట్‌.. కాసేపు రైట్‌ అంటూ.. వంకర్లు తిరిగినవేనన్నది వాస్తవం. కానీ ఈ విషయాన్ని ప్రజలకు వివరించే విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం విఫలమైంది. జాతీయ స్థాయిలో ఉత్పన్నమయ్యే పరిణామాలు, పార్టీ నేతల తీరుపై పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు మేథోమథనం జరిపి నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం, వారు పార్టీ లైన్‌ తప్పకుండా అదుపులో ఉంచడం వంటి చర్యలు లేకపోవడంతో దిగువస్థాయిలో నాయకులు ఇష్టానుసారం మాట్లాడేస్తున్నారు. వారు చెప్పిందే కాంగ్రెస్‌ విధానం అన్నట్లుగా విపక్షాలు తమ సొంత భాష్యం ఇచ్చేసి విమర్శలు కురిపిస్తున్నాయి. అంతిమంగా ఇది కాంగ్రెస్‌ పార్టీని డ్యామేజ్‌ చేస్తోంది. ప్రజల్లో పార్టీ పట్ల తప్పుడు భావాలన ప్రోది చేస్తోంది. కీలకాంశాలపై చర్చించి, దిశానిర్దేశం చేయాల్సిన కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ ఎన్నడూ లేనంత బలహీనంగా తయారైంది. దశాబ్దానికిపైగా అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఇప్పటికీ కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. మనదేశంలో రాముడికి గుడి లేని గ్రామం లేనట్లే.. కాంగ్రెస్‌కు కనీసం పది ఓట్లయినా లేని గ్రామం కూడా ఉండదనడం అతిశయోక్తి కాదు. కానీ బీజేపీకి ఓట్లు లేని గ్రామాలు ఉన్నాయి. అటువంటి బీజేపీ అజెండా మతమే అయినప్పుడు.. సున్నితమైన మత వ్యవహారాల్లో షర్మిలతో సహా నేతలందరూ ఆచితూచి మాట్లాడాలి. సోషల్‌ మీడియా యుగంలో ఏ చిన్న అంశమైనా క్షణాల్లో ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నందున మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్న విచక్షణను షర్మిల విస్మరించినట్లున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టే ముందు ఆమె కాంగ్రెస్‌ను అతి ఘోరంగా తూలనాడారు. చనిపోయిన కాంగ్రెస్‌ను రాజశేఖర్‌రెడ్డి జీవం పోసి బతికించారని, ఆయనే బతికి ఉంటే ఇప్పుడున్న కాంగ్రెస్‌ను కాండ్రిరచి ఉండేవారని తీవ్రంగా దూషించారు. అటువంటి షర్మిల తెలంగాణలో తన దుకాణాన్ని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసేసి.. ఎకాఎకిన ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలై కూర్చున్నారు. ఆ హోదాలో ఆమె పార్టీకి చేసిన మేలు ఏదీ లేకపోగా.. తన దుందుడుకు వ్యాఖ్యలతో మరింత చేటు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబకు సైద్ధాంతిక విధానాలు, విలువలు వంటి బాదరబందీలేవీ లేవు. అందువల్ల ఏదో సామెత చెప్పినట్టు ప్రస్తుత రాజకీయ మార్కెట్‌లో మతవిశ్వాసాలకే గిరాకీ ఉన్నందున దాన్ని వాడేసుకోవాలన్న ప్లాన్‌తో టీటీడీ ఆధ్వర్యంలో దళితవాడల్లో ఆలయాలు కట్టి బీజేపీని మించిపోవాలనో.. ఆ పార్టీ మెచ్చుకోలు కోసమో ప్రయత్నించి ఉండవచ్చు. దాన్ని కౌంటర్‌ చేయాలన్న ఆతృతతో సున్నిత అంశాలపై పార్టీ అంతర్గత వేదికల్లో చర్చించకుండా ప్రకటనలు చేస్తే అసలుకే మోసం వస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page