top of page

‘నానొ’చ్చేసినా కదా..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Aug 2, 2025
  • 3 min read
  • డ్రోన్‌ పిచికారీపై అవగాహన కల్పించని వ్యవసాయ శాఖ

  • లిక్విడ్‌ ఎరువుల వాడకం రాదంటున్న రైతులు

  • 80 శాతం సబ్సిడీ ఇస్తాం.. డ్రోన్లు కొనుక్కోమంటున్న ప్రభుత్వం

  • మూతబడుతున్న రైతుసేవా కేంద్రాలు

  • వ్యవసాయమంత్రి జిల్లాలో ప్రైవేటు వ్యాపారులదే హవా

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

కెమికల్‌ ఫెర్టిలైజర్స్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించి నానో ఫెర్టిలైజర్స్‌ను ప్రోత్సహించాలన్న ప్రణాళిలో భాగంగా డ్రోన్స్‌తో ఎరువుల పిచికారీని ఈ ఏడాది నుంచి ప్రభుత్వం విస్తృతం చేసింది. అయితే రైతులను మాత్రం అందుకు అనుగుణంగా సన్నద్ధం చేయడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి.

యూరియా కొరత రోజురోజుకు అధికమవుతుంది. కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కెమికల్‌ ఫెర్టిలైజర్స్‌ను తగ్గించి లిక్విడ్‌ (నానో) ఫెర్టిలైజర్స్‌కు ప్రోత్సహించడం వల్ల ఎరువుల దిగుమతి తగ్గిపోయింది. దీనికి తోడు కేంద్రం ఎరువులపై ఇస్తున్న సబ్సిడీని ఏ ఏడాదికా ఏడాది తగ్గిస్తూ నానో ఫెర్టిలైజర్స్‌ వినియోగానికి ఊతం ఇస్తుంది. ఇందులో భాగంగా నానో ఫెర్టిలైజర్స్‌ వినియోగాన్ని గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి, మార్క్‌ఫెడ్‌కు కేంద్రం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. దీనికి అనుగుణంగా కేంద్రం ఎరువుల కేటాయింపులు గణనీయంగా రాష్ట్రానికి తగ్గించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ అధికారులు కెమికల్‌ ఎరువుల వినియోగం తగ్గించడంపై రైతులకు అవగాహన కలిగించిన దాఖలాలు లేవు. నానో ఫెర్టిలైజర్‌ను అతి తక్కువ ధరకే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని డ్రోన్‌ సహాయంతోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది. చిన్న డబ్బాలో స్ప్రే మాదిరిగా వచ్చే లిక్విడ్‌ను డ్రోన్‌కు అమర్చి పిచికారీ చేస్తే తప్ప దీన్ని రైతులు స్ప్రే చేయలేరు. మార్కెట్‌లో నానో ఫెర్టిలైజర్స్‌ అందుబాటులో ఉన్నా రైతులు పిచికారీ చేయలేరు. అలాగని డ్రోన్స్‌ను వినియోగించడం రాదు.

డ్రోన్లతో పిచికారీ..

జిల్లాలో కొన్ని మండలాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకొని గ్రామాల్లో డ్రోన్‌ ద్వారా లిక్విడ్‌ ఎరువును పిచికారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలతో పిచికారీ నిలిచిపోతుందని రైతులు చెబుతున్నారు. లిక్విడ్‌ ఎరువులు వినియోగాన్ని పూర్తిస్థాయిలో పెంచితే డ్రోన్లు వేల సంఖ్యలో అవసరమవుతాయి. డ్రోన్లను సమకూర్చుకొనే అవకాశం అందరు రైతులకు ఉండదు. ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో డ్రోన్లు సమకూరుస్తున్నా చిన్న చిన్న కమతాలున్న రైతులకు ఇవి అనవసర పెట్టుబడే. గ్రామం యూనిట్‌గా డ్రోన్లు సరఫరా చేయాలి. ఇందుకోసం వ్యవసాయాధికారులు, సాంకేతిక సిబ్బంది అవగాహన కల్పించాలి. అలా కాకుండా కెమికల్‌ ఎరువులు లేవు కాబట్టి నానో వాడండని అంటే.. దాన్ని పొలంలో చల్లే విధానం గుళికల రూపంలో ఉండదు కాబట్టి, పిచికారీకి డ్రోన్లే అవసరముంటుంది.

గ్రామానికి ఒకటి రెండు డ్రోన్లు ఉన్నా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే సరిచేసే అవకాశం లేదు. దీంతో డ్రోన్ల కోసం ఎదురుచూస్తే మొదటికే మోసం వస్తుందని నానో ఎరువులు స్థానంలో యూరియా, డీఏపీ కోసం రైతు సేవా కేంద్రాలకు రైతులు ఎగబడుతున్నారు. అక్కడా అవసరానికి తగ్గట్టు ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లాకు కేటాయించిన ఎరువులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా అక్కరకు రావడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దమ్ములు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కురుస్తున్న ఒక మోస్తారు వర్షాలు కారణంగా వర్షాధార భూముల్లో నాట్లు వేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సమయంలో రైతులకు యూరియా అవసరం. దీన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కూపన్లు ఇచ్చి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినా డిమాండ్‌ మేరకు సరఫరా జరగలేదు. దీంతో ముమ్మురంగా దమ్ములు చేస్తున్న ప్రాంతాలకు ఎరువులు అందుబాటులో ఉన్న ఆర్‌ఎస్‌కేల నుంచి తరలించి పంపిణీ చేయాలని అధికారులు ఆదేశిస్తున్నా సాంకేతిక సమస్యలు కారణంగా సాధ్యం కావడంలేదు. గ్రామంలోని ఆర్‌ఎస్‌కే నుంచి ఇతర ప్రాంతాలకు అందుబాటులో ఉన్న ఎరువుల తరలింపును రైతులు అంగీకరించడం లేదు. దీంతో ప్రైవేట్‌ ఎరువుల డీలర్లు అవకాశంగా తీసుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

డిమాండ్‌ మేరకు సరఫరా లేదు

జిల్లాలో అన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉన్నా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం వర్షాధార భూములు ఉండడంతో ఎరువుల సమస్య అధికంగా ఉంది. నియోజకవర్గంలో ఖరీఫ్‌కు అందాల్సిన ఎరువులు కనీస స్థాయిలో కూడా సరఫరా చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇచ్ఛాపురం మండలం పరిధిలో 7,800 ఎకరాల్లో వరిపంటకు సుమారు 195 మెట్రిక్‌ టన్నుల యూరియా, 150 మెట్రిక్‌ టన్నులు డీఏపీ అవసరమైతే, కేవలం 100 మెట్రిక్‌ టన్నుల ఎరువులను మాత్రమే అందుబాటులో ఉంచారు. కంచిలిలో 8,500 ఎకరాలకు 200 మెట్రిక్‌ టన్నులు యూరియా, 120 మెట్రిక్‌ టన్నులు డీఏపీ అందుబాటులో ఉంచారు. సోంపేటలో 9వేల ఎకరాలకు 200 టన్నుల యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచారు. కవిటి మండలంలో 5,500 ఎకరాలకు 175 మెట్రిక్‌ టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచారు. గతంలో రైతు సేవా కేంద్రాలు పరిధిలో రైతులను మ్యాపింగ్‌ చేసి, ఖరీఫ్‌ పంటల విస్తీర్ణాన్ని అంచనావేసి ఎరువులు ఇండెంట్‌ను ఇచ్చేవారు. అందుకు అనుగుణంగా ఎరువులను రైతుసేవా కేంద్రాలకు సరఫరా చేసేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేదు. జిల్లాలో ఖరీఫ్‌ ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని రైతులో ఆందోళన వ్యక్తమవుతుంది. రైతుసేవా కేంద్ర పరిధిలో ఎంతమేర ఎరువులు అవసరం, ఎప్పుడు అవసరం అనే స్పష్టత లేదు. రైతుసేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుడు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. వీరిని పింఛన్లు పంపిణీతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అమలుకు వినియోగిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. పింఛన్ల పంపిణీ, పథకాలు ప్రచారంలో ఉండడం వల్ల రైతుసేవా కేంద్రాలకు తాళాలు వేయాల్సిన పరిస్థితి. రైతుసేవా కేంద్రాలకు సరఫరా అవుతున్న కొద్దిపాటి ఎరువుల పంపిణిలో స్థానిక నాయకులు ప్రమేయం అధికం కావడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతోందన్న విమర్శలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page