top of page

నిన్న బంగ్లాదేశ్‌.. నేడు బెంగాల్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 31, 2024
  • 2 min read

కొన్ని ఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి. ఎటువంటి సంబంధం లేకపోయినా, కారణాలు ఒకటి కాకపోయినా రెండు ప్రాంతాల్లో లేదా రెండు సందర్భాల్లో దాదాపు ఒకేలాంటి పరిణామాలు సంభవిస్తుంటాయి. గత కొద్దిరోజులుగా పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న అల్లర్లు, ఇతర ఘటనలు పరిశీలిస్తే.. దానికి నెలా రెండు నెలల ముందు మన పొరుగు దేశం.. ఇంకా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్‌కు అనుకునే ఉన్న బంగ్లాదేశ్‌లోనూ దాదాపు ఇటువంటి దురదృష్టకర సంఘటనలే చోటుచేసుకున్నాయి. ఈ రెండుచోట్ల సంభవించిన పరిణామా లకు కారణాలు మాత్రం పూర్తిగా భిన్నమైనవి కావడం విశేషం. ఇంకా విచిత్రం ఏమిటంటే బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ ఒకప్పుడు వంగదేశం పేరుతో కలిసే ఉండేవి. అఖండ భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో వంగ దేశం కీలకమైనది. బెంగాలీ మాతృభాష కలిగినవారు అధిక సంఖ్యలో ఉండటం వల్ల దాన్ని బంగ లేదా వంగ దేశం అనేవారు. కాలక్రమంలో అది బెంగాల్‌గా మారింది. దేశ విభజన సమయంలో తూర్పు బెంగాల్‌ పాకిస్థాన్‌లో కలిసిపోగా మిగిలిన వంగ దేశం పశ్చిమ బెంగాల్‌ పేరుతో భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా కొనసాగుతోంది. తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల్లో కీలక రాష్ట్రంగా ఉంది. తర్వాత కాలంలో తూర్పు బెంగాల్‌ ప్రాంతీయుల భారత సైన్యం సహాయంతో పాకిస్థాన్‌పై పోరాటం చేసి ప్రత్యేక దేశం సాధించుకు న్నారు. అదే బంగ్లాదేశ్‌. బంగ్లాదేశ్‌ ప్రత్యేక దేశంగా అవతరించినా, పశ్చిమ బెంగాల్‌ భారత్‌లో ఒక రాష్ట్రంగా ఉన్నా.. ఈ రెండిరటిలో నివసించే ప్రజల సామాజిక, సాంస్కృతిక విధానాలు ఒకేలా ఉంటాయి. రెండిరటి మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా ఎక్కువే. అటువంటి ఈ రెండూ ఒకదాని తర్వాత ఒకటిగా అల్లర్లతోనూ, రాజకీయ ఉద్యమాలతోనూ అట్టుడుకుతూ పాలకులపై తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్లడం యాదృచ్ఛికమే. బంగ్లాదేశ్‌లో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ ప్రభుత్వంపై విద్యార్థులు లేవనెత్తిన తిరుగుబాటు చివరికి ఆమె పదవీచ్యుతికి, దేశం విడిచి పారిపోవడానికి దారితీశాయి. కాగా గత పాతిక రోజులుగా ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లోనూ విద్యార్థులే ఉద్యమించి రాష్ట్రాన్ని రణరంగంగా మార్చారు. ఇప్పుడు వారు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పదవికి రాజీనామా చేసి.. రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేస్తుండటం విశేషం. బంగ్లాదేశ్‌లో బంగ్లాదేశ్‌ ఛాత్ర పరిషత్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరగ్గా.. ఇక్కడ బెంగాల్‌లో పశ్చిమ బంగ ఛాత్ర సమాజ్‌ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే రెండు ప్రాంతాల్లో జరిగిన, జరుగుతున్న ఉద్యమాలకు కారణాలు మాత్రం ఏమాత్రం సంబంధం లేనివి. 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటంలో పాల్గొన్న యోధుల కుటుంబాల పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున రిజ ర్వేషన్లు కల్పిస్తూ షేక్‌ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర వర్గాల్లో అసంతృప్తికి, ఆగ్రహానికి కారణ మైంది. ఆ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు దేశవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి హర్తాళ్లు, బంద్‌లు నిర్వహించారు. దీని వెనుక ప్రతిపక్ష బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ ప్రమేయం కూడా ఉండటంతో ఉద్యమం రాజకీయ రూపు దాల్చి అదుపుతప్పింది. దాడులు, హింస, విధ్వంసం ప్రజ్వరిల్లాయి. వాటిని అదుపు చేయడంలో పోలీసులు విఫలం కావడంతో సైన్యం దేశాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. అయినా శాంతించని ఉద్యమకారులు ప్రధాని రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ఆమె అధికారిక నివాసంపై దాడి చేసి విధ్వంసం సృష్టించడంతో ఆమె పదవిని త్యజించి కుటుంబంతో సహా ఉన్న ఫళంగా దేశం విడిచి వెళ్లిపోయారు. అక్కడికి కొద్దిరోజుల వ్యవధిలోనే బంగ్లాదేశ్‌కు దాయాదిగా చెప్పే పశ్చిమ బెంగాల్‌లోనూ విద్యార్థి ఉద్యమమే చెలరేగి ఆ రాష్ట్రాన్ని అట్టుడికిస్తోంది. కోల్‌కతాలోని ఆర్జీ కర్‌ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో ఈ నెల ఎనిమిదో తేదీ అర్ధరాత్రి విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య ఘటన బెంగాల్‌తో పాటు యావత్తు దేశాన్ని కుదిపివేసింది. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన విషయంలో బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారు స్పందించిన తీరు ఆమె ప్రభుత్వ పాత్ర, నిబద్ధతపై అనుమానాలు రేపింది. ఈ ఘటనను మొదట ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరగడం అన్ని వర్గాల్లోనూ ఆగ్రహావేశాలు రగిలించింది. ఈ దారుణ ఘటనలో పాత్ర ఉందని అరోపణలు ఎదుర్కొంటున్న వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌పై చర్యల పేరుతో మమత సర్కారు ప్రిన్సిపల్‌ పదవి నుంచి తప్పించినట్లే తప్పించి వెంటనే వేరే వైద్య కళాశాలకు పోస్టింగ్‌ ఇవ్వడం, సంఘటనపై దాదాపు ఒకరోజు తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం వంటి అంశాలు మమత సర్కారును సమాజం ముందు దోషిగా నిలబెట్టాయి. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టడం, కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించినప్పటికీ ఇప్పటికీ పెద్దగా పురోగతి కనిపించ డంలేదు. దాంతో ఆ రాష్ట్రంలోని విద్యార్థిలోకం తీవ్రంగా స్పందించింది. ఛాత్ర సమాజ్‌ పిలుపుమేరకు కోల్‌ కతా, హౌరా సహా అనేక ప్రధాన నగరాలు, పట్టణాల్లో లక్షలాది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, తక్షణమే రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లిపోవాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ ఆందోళనలను భగ్నం చేసేందుకు పోలీసులు చాలా ప్రాంతాల్లో విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర బంద్‌ నిర్వహించడంతో రాజ కీయ కార్యకర్తలు కూడా విద్యార్థుల ముసుగులో రెచ్చిపోయారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో షేక్‌హసీనా మాదిరిగానే మమత సర్కారు కూడా కూలిపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page