top of page

నిన్న మూడు రాజధానులు.. నేడు మూడు ప్రాంతాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 1 day ago
  • 3 min read

‘ల్యాండ్ పూలింగ్ పేరిట వేలాది ఎకరాలు సేకరించి కొత్తగా మౌలిక వసతులు కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. దీనికితోడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఖర్చు పెట్టడం రాష్ట్ర ఆర్ధికానికి పెనుభారం. దీనికంటే.. మచిలీపట్నం`విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు.. అలాగే విజయవాడ`గుంటూరు మధ్య 40 కిలోమీటర్లు కలిపి మొత్తం 110 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారికి ఇరువైపులా క్యాపిటల్ కారిడార్ గ్రోత్ పేరిట అభివృద్ధి చేస్తే భారీగా ఖర్చు, సమయం కలిసివస్తాయి. అందుకే మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్ అనే అక్షరాలను తీసుకుని మావిగన్ పేరుతో కాపిటల్ కారిడార్‌ను ప్లాన్`బి రూపంలో ప్రతిపాదిస్తున్నాను’ అంటూ మూడురోజుల క్రితం మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్ మీడియా ముందు పెట్టారు. అమరావతికి చట్టబద్ధత పేరుతో పార్లమెంటులో బిల్లు ఆమోదించిన సమయాన్నే జగన్ తన ప్లాన్`బిని జనం ముందుకు తెచ్చేందుకు ఎంచుకోవడం విశేషం. ఊహించి నట్టుగానే పాలక కూటమి నాయకులు, శ్రేణులు ఈ ప్రతిపాదనను తీసిపారేస్తున్నారు. జగన్ ప్రస్తా వనలోని అంశాల జోలికి పోకుండా కొంత విచిత్రంగా ఉన్న మావిగన్ అనే పేరునే ఎగతాళి చేస్తూ ట్రోల్‌గన్స్ పేలుస్తున్నారు. మరోవైపు జగన్ పత్రికతోపాటు ఆ పార్టీ శ్రేణులు మావిగన్.. ఆహా ఓహÃ.. అంటూ ఆకాశానికెత్తడం ప్రారంభించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రకమైన పోటీ, ఆరోపణలు సహజమే. ఆ విషయాన్ని పక్కనపెడితే.. రాజధాని విషయంలో జగన్ మాటిమాటికీ తన స్టాండ్ మార్చుకుంటూ.. పిల్లిమొగ్గలు ఎందుకు వేస్తున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక అంశం మీద పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నాక కష్టమో.. నష్టమో.. దానికి కట్టుబడి ఉండాలి. లేదా తమ స్టాండ్ తప్పు అని తెలుసుకోగలిగితే.. తప్పుచేశామని అంగీకరించే విశాల దక్పథమే ఉంటే ఆ విషయాన్ని నేరుగా ప్రక టిస్తే అందరూ హర్షిస్తారు. కానీ ఒక పార్టీకి అధ్యక్షుడిగా, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రాజ ధానికి నోచుకోని విధంగా అన్యాయంగా విభజనకు గురైన రాష్ట్రానికి రాజధాని వంటి కీలక అంశంపై పూటకోమాట అన్నట్లు వ్యవహరించడం చర్చనీయాంశమైంది. 2014`19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబు ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ దీనిపై తమ పార్టీ వైఖరిని స్పష్టంగా ప్రకటించకుండా నాన్చారు. ఇక తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు ఏడాదిపాటు అమరావతి గురించి ప్రస్తావించని జగన్.. ఆ తర్వాత ఉన్న ఫళంగా పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తూ బిల్లును కూడా ప్రతిపాదించారు. దీనివల్ల ఖర్చులు భారీగా తగ్గుతాయని, రాష్ట్రంలో మూడు ప్రాంతాలు సమానంగా అభివద్ధి చెందే అవకాశం ఉంటుందని జగన్, ఆయన పార్టీ ప్రచారం చేశాయి. దీన్ని వ్యతిరేకిస్తూ అమరావతికి భూములిచ్చిన రైతుల పేరుతో ఆందోళనలు జరగడం, అనేక న్యాయ, రాజకీయ వివాదాల నేపథ్యంలో మూడు రాజధానులు ముందుకు కదల్లేదు. ఈలోగా మళ్లీ ఎన్నికలు జరిగి టీడీపీ కూటమి పగ్గాలు చేపట్టడంతో మూడు రాజధానులు తెరమరుగై మళ్లీ అమరా వతే ఏకైక రాజధాని అన్నది తెరపైకి వచ్చింది. పార్లమెంటులో చట్ట సవరణ వరకు వెళ్లింది. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదంటూనే లక్షల కోట్లు అంటూ చేస్తున్న అట్టహాసాన్ని, ఆ ముసుగులో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నామంటూనే జగన్ ప్లాన్ బి పేరుతో మావి‘గన’ను పేల్చారు. అయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, ఐదేళ్లు అధి కారంలో ఉన్నప్పుడు గానీ ఆయన ఈ ప్రతిపాదన తీసుకురాలేదు. పైగా మూడు రాజధానుల పాట పాడారు. అధికారం పోయి మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనూ మావిగన్ అనే ప్లాన్`బి ఊసెత్తలేదు. కొత్తగా ఈ ప్రతిపాదన చేశారంటే మూడు రాజధానుల అంశాన్ని అటకెక్కించేసినట్లేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అమరావతికి వ్యతిరేకం కాదంటూనే మావిగన్‌ను పేల్చారంటే.. అమరా వతిపై ఇంకా అయిష్టత పోలేదనే కదా అర్థం! తన మదిలో పుట్టిందో లేక సలహాదారులే పుట్టించారో తెలియని మావిగన్‌ను ఇంతకుముందే ప్రజల ముందుకు తెచ్చి ఉంటే.. దాని గురించి విస్తత చర్చ జరిగేది. నిపుణులు దానిలోని సాధ్యాసాధ్యాలను విశ్లేషించేవారు. కానీ సమయం మించిపోయిన తర్వాత మళ్లీ సరికొత్త ఆలోచన అంటూ ఏవేవో ప్రతిపాదనలు చేయడం సమర్థనీయం కాదు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ రాజధానిపై రాద్దాంతం జరుగుతూనే ఉంది. అమరా వతే ఏకైక రాజధాని అంటున్న పాలక కూటమి శాశ్వత నిర్మాణాలపై దష్టి సారించకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడూ, ఇప్పుడూ కూడా ఆర్భాటాలు, హడావుడికే ప్రాధాన్యమిస్తున్నది. మళ్లీ ల్యాండ్ పూలింగ్ అంటోంది. దాదాపు లక్ష ఎకరాల రాజధాని, ప్రపంచస్థాయి నగరం అంటూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నది. ఇంతా చేస్తే.. ఇప్పటి వరకు అక్కడ రూ.8వేల కోట్లకు మించి ఖర్చుపెట్టలేదు. నాలుగైదు తాత్కాలిక భవన సముదాయాలకు మించి నిర్మాణాలూ లేవు. ఆ లెక్కన లక్షల కోట్లతో భారీ ఆకాశ హార్మ్యాలతో కూడి నగరం ఎప్పుడు నిర్మితమవుతుందో.. అసలు లక్షల కోట్ల నిధులు ఎక్కడి నుంచి తెస్తారు.. వాటిని ఎలా తీరుస్తారో.. పాలకులకే ఎరుక. ఈ పరిస్థితుల్లో ఇంతకాలం ప్రవచించిన మూడు రాజధానుల సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసి.. మూడు ప్రాంతాల గ్రోత్ ఇంజిన్ గురించి జగన్ వల్లె వేస్తున్నారు. దీన్నే గనుక ఆమోదిస్తే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లే. ఇలా తోచినప్పుడల్లా మార్చు కుంటూ పోతే రాజధాని ఎప్పటికి సమకూరుతుందో ఆలోచించాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం, తిరుమల లడ్డూ విషయంలో విషప్రచారం వికటించినా దాన్ని అందిపుచ్చులేకని జగన్ రాజధాని విషయంలో తప్పటడుగులు వేయడం విచారకరం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page