నేపాల్ యువతలో వివేచన లోపించిందా?
- Guest Writer
- Sep 11, 2025
- 2 min read

‘యువతరం శిరమెత్తితే.. లోకమే మారిపోదా’.. ఏదో పాటలో పేర్కొన్నట్లు యువత తలచుకుంటే సాధ్యం కానిదేదీ ఉండదు. దానికి తాజా తార్కాణం నేపాల్ ఉద్యమం. జెన్ జెడ్‌గా పేర్కొంటున్న అక్కడి యువత శిరమెత్తి కదంతొక్కడంతో శాంతికాముకమైన హిమాలయ రాజ్యం మొత్తం మంటల్లో చిక్కుకుంది. రాష్ట్రపతి, ప్రధాని పదవులు వీడాల్సి వచ్చింది. మొత్తం ప్రభుత్వమే కుప్పకూలింది. వ్యవస్థలను కదిలించగలిగే యువతరం పట్టుదల ప్రశంసనీయమే అయినా ఆ పట్టుదల.. ఆ ఉద్యమ స్ఫూర్తి ఒక మంచి కారణం కోసమైతే మరింత అభినందనీయం. కానీ నేపాల్‌లో యువత ఉద్యమ బావుటా ఎగురవేయడానికి కారణం.. సోషల్ మీడియాను అక్కడి ప్రభుత్వం నిషేధించడమే! ఒక్కసారి ఆలోచిస్తే.. సోషల్ మీడియా కోసమే ఇంత హింస, ప్రభుత్వాన్ని కూలదోయడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను అగ్నికి ఆహుతి చేయడమే సమర్థనీయం కాదేమో అన్న భావన కచ్చితంగా కలుగుతుంది. అయితే పైకి సోషల్ మీడియా కారణంగా కనిపిస్తున్నా.. కొన్నేళ్లుగా ప్రభుత్వాత వైఫల్యం, ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం వంటి అనేకానేక సామాజిక సమస్యలు కలిసి యువతను ఆగ్రహంతో కదంతొక్కేలా చేశాయన్న వాదన కూడా ఉంది. దానికి తగినట్లే గత మూడు దశాబ్దాలుగా రాజకీయ నాయకులు దోచుకున్న ఆస్తులపై విచారణ జరిపించాలని ఉద్యమ యువత తమ ప్రధాన డిమాండ్లలో ఒకటిగా పేర్కొంటోంది. రాజ్యాంగాన్ని తిరగరాసి పరిపాలన సంస్కరణలు తీసుకురావాలని యువత కోరుతోంది. అంతేకాకుండా.. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించాలని, వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించి రాష్ట్ర గౌరవం, గుర్తింపు ఇవ్వాలని, నిరుద్యోగం, వలస, సామాజిక అన్యాయంపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, కొత్త రాజకీయ వ్యవస్థ ఏర్పాటు కావాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ దానికోసం జెన్ జెడ్ ఎంచుకున్న మార్గం సరైనది కాదు. అంత సామాజిక స్పృహ ఉన్నవారు.. రాజ్యాంగాన్నే మార్చేయాలని డిమాండ్ చేస్తున్నవారు.. ఇప్పటి వరకు ఆ డిమాండ్లతో ఎందుకు బయటకు రాలేదు. సోషల్ మీడియాను బ్యాన్ చేసినప్పుడే ఎందుకు రోడ్లపైకి వచ్చారు. అప్పుడే వారికి ఇవన్నీ గుర్తుకొచ్చాయా? ఒకవేళ సోషల్ మీడియాను ప్రభుత్వం నిషేధించకపోతే.. ఇప్పుడు వెల్లివిరిసిన ఈ చైతన్యం వారి చేసే రీల్స్‌లోనూ, ఇన్‌స్టాలో పోస్టుల్లోనూ మగ్గిపోయేది కదా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాపై బ్యాన్ విధించడం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే కావచ్చు.. కానీ దీని కోసమే ఇంత హింసాత్మకంగా మారనక్కర్లేదు. శాంతియుతంగా ఉద్యమాలు చేసి.. నిర్బంధాన్ని, ఆంక్షలను ఎదుర్కోగలిగే మార్గాన్ని యువత ఎందుకు ఎన్నుకోలేదన్నదే ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానంగా ఈ హింసాత్మక ఉద్యమం వెనుక వేరే లక్ష్యాలు, శక్తులు ఉన్నాయన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆ విషయం ఇంకా నిర్ధారణ కానుందున దాని గురించి ఎక్కువ చర్చించే పరిస్థితి లేదు. నేపాల్‌లో రాజరికమో, నియంతృత్వ పాలనో లేదు. అక్కడ ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వమే. ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనను నేపాల్ యువత కోరుకుంటుండటం నిజంగా ఆశ్చర్యం కలిగించక మానదు. నేపాల్ రాజ్యాంగం దశలవారీగా అమల్లోకి వచ్చింది. 1948లో గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ యాక్ట్ ద్వారా తొలిసారి రాజ్యాంగం ఏర్పడిరది. 2007లో ఇంటరిమ్ కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ నేపాల్ ద్వారా రాచరిక వ్యవస్థను పూర్తిగా తొలగించారు. 2008లో ప్రజాస్వామ్య శకం ప్రారంభమైంది. 2015 సెప్టెంబర్ 20న పూర్తిస్థాయి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. తద్వారా ఆ దేశం ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్‌గా మారింది. కానీ పదేళ్లలోనే రాజ్యాంగంపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వాన్ని సైన్యం తన చేతుల్లోకి తీసుకున్నా అల్లర్లను నియంత్రించడం దానికి సాధ్యం కావడం లేదు. ఉద్రిక్తతలు ఉపశమించే వరకు ఓపిక పట్టడం ఒకటే మార్గం. అదీ కుదరకపోతే రాజ్యాంగాన్ని మార్చడంపై కసరత్తు జరగాలి. రాజ్యాంగ సవరణలకు అవకాశాలు ఉంటాయా గానీ.. ప్రజాస్వామ్య పద్ధతుల్లో పూర్తిగా మార్చడం అనుకున్నంత సులభం కాదు. పోనీ జెన్ జెడ్‌కే ఆ బాధ్యత అప్పగిస్తే ఇన్‌స్టాలో అత్యథిక ఫాలోవర్లు ఉన్నవారే ప్రధాని పదవికి అర్హులు అనే నిబంధనలు రాజ్యాంగంలో చేరవచ్చేమోనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద నేపాల్ యువత సరైన దారిలో వెళ్తున్నట్టు లేదని స్పష్టమవుతోంది. వారి ఉద్యమంలో ఆవేశం తప్ప వివేచన ఉన్నట్లు కనిపించడంలేదు.










Comments