నియోజకవర్గాల పునర్విభజన మరింత ఆలస్యం
- DV RAMANA

- Dec 20, 2025
- 2 min read

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఆశలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లోగా ఈ రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనను పూర్తి చేసి.. కొత్త నియోజకవర్గాల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో కేంద్రం ప్రకటించింది. కానీ తాజా పరిణామాలను గమనిస్తే ఆ ఎన్నికల్లోగా ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం కనిపించడంలేదు. జాతీయ జనాభా లెక్కల సేకరణతో ఈ అంశాన్ని ముడిపెట్టడమే ఈ పరిస్థితికి కారణం. నియోజకవర్గాలు పెరిగితే ఎక్కువ మంది అభ్యర్థులకు అవకాశం కల్పించవచ్చని పార్టీలు, తమకూ పోటీ చేసే అవకాశం లభిస్తుందని ఆశపడిన ఔత్సాహిక అభ్యర్థులకు తాజా పరిస్థితి మింగుడుపడనిదిగా మారింది. ఏపీ పునర్విభజన చట్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో 50, తెలంగాణలో 25 అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. అయితే కేంద్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, తాజా నిర్ణయాల వేళ నియోజకవర్గాల పునర్విభజనకు, వాటితో ఎన్నికలకు వెళ్లడానికి మరికొంతకాలం ఎదురుచూడక తప్పేలాలేదు. దీనిపై స్పష్టమైన సంకేతాలు రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు కొంత అసంతృప్తికి గురైనా.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను కొత్త రాష్ట్రం చేసేందుకు పార్లమెంట్ ఆమోదించిన ఏపీ పునర్విభజన చట్టంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఆ మేరకు స్థూలంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంది. ఆ ప్రకారం రాష్ట్ర పునర్విభజన చట్టం(2014)లోని సెక్షన్ 26(1) ప్రకారం తెలంగాణలో విభజన నాటికి ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153కు, ఏపీలో 175 సీట్లు ఉండగా 225కి పెంచే వెసులుబాటు కల్పించారు. అయితే సంప్రదింపుల అనంతరం తెలంగాణలో 25, ఆంధ్రలో 50 సీట్ల పెంపునకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికల నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేసి కొత్త నియోజకవర్గాలను అందుబాటులోకి తీసుకొస్తారని ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ ప్రక్రియకు జనగణనతో ముడిపెట్టడమే దీనికి కారణం. జనాభా లెక్కల సేకరణ అనంతరం కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. కానీ ఆ కార్యక్రమం ఆలస్యమవుతూ వచ్చింది. పదేళ్లకోసారి జరగాల్సిన జనగణన 2011 తర్వాత ఇంతవరకు జరగలేదు. వాస్తవంగా 2021లో జరగాల్సి ఉన్నా కరోనా సంక్షోభ పరిస్థితుల వల్ల కేంద్రం దాన్ని నిరవధికంగా వాయిదా వేసింది. ఆవిధంగా సుమారు 15 ఏళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. కానీ రాజకీయ కారణాలతో జమ్మూకశ్మీర్‌లో మాత్రం నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పిస్తూ 2022లో కేంద్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అలాంటప్పుడు చట్టంలో హామీ ఇచ్చిన మేరకు ఏపీ, తెలంగాణల్లో కూడా అసెంబ్లీ నియోజవర్గాల పునర్విభజన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌పై మొన్న ఏప్రిల్లో విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్‌లతో కూడి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన 2026 చివరి నాటికి పూర్తి అవుతుందని, ఆ వెంటనే ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్ ద్వారా న్యాయస్థానానికి వెల్లడిరచింది. ఆ సెన్సెస్ ప్రక్రియే ఇప్పుడు మరోసారి పునర్విభజనకు అడ్డంకిగా మారింది. జనాభా లెక్కల సేకరణకు ఆదేశిస్తూ ఈ ఏడాది జూన్‌లో కేంద్ర హోంశాఖ పరిధిలోని సెన్సెస్ రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈ కార్యక్రమానికి రూ.11,718 కోట్లు కేటాయిస్తూ కొద్దిరోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం జనగణన రెండు దశల్లో జరుగుతుంది. వచ్చే ఏడాది నిర్వహించే మొదట దశ కార్యక్రమంలో గృహాల ఎన్యూమరేషన్ చేపడతారు. తర్వాత 2027లో రెండో దశగా జనాభా లెక్కలు సేకరిస్తారు. జనగణన ప్రారంభమై ముసాయిదా జాబితా తయారీ చేయడం, దానిపై అభ్యంతరాలు స్వీకరించి మళ్లీ మార్పులు చేర్పులు చేసి తుది జాబితా రూపొందించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెండేళ్లకుపైనే సమయం తీసుకుంటుంది. ఆ నోటిఫికేషన్ ఆధారంగానూ నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. కేంద్రం డీ లిమిటేషన్ కమిషన్ నియమించాలి. ఆ కమిషన్ దేశంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు, పార్టీ, ఇతర వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించాక వాటిని క్రోడీకరించి నియోజకవర్గాల విభజన చేయాల్సి ఉంటుంది. ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తి కావడానికి ఎలా లేదన్నా ఏడాదిన్నర పడుతుంది. ఈ లెక్కన అంచనా వేసుకుంటే.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొత్తం 2023 నాటికి గానీ పూర్తి కాకపోవచ్చు. కానీ సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం దానికి ఏడాది ముందు 2029 ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సి ఉంది. అంటే పాత నియోజకవర్గాలతోనే ఆ ఎన్నికలను నిర్వహించక తప్పని పరిస్థితి. అలాకాకుండా నియోజకవర్గాల పునర్విభజన వరకు ఆగి.. అప్పుడే ఎన్నికలు నిర్వహించాలంటే 2029 జూన్ నాటికి ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకునే ప్రస్తుత లోక్‌సభతోపాటు ఏపీ, తెలంగాణ సహా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును కూడా పొడిగించాల్సి ఉంటుంది. అదంతా రాజ్యాంగపరంగా చిక్కులతో కూడిన ప్రక్రియ. దానికి బదులు పాత నియోజకవర్గాలతో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని భావించవచ్చు.










Comments