నియామకాల్లో నిబంధనలు ‘అవుట్’!
- BAGADI NARAYANARAO
- 5 days ago
- 2 min read
అరసవల్లిలో 46 అవుట్ సోర్సింగ్ పోస్టులకు టెండర్లు
జీరో కమీషన్ బిడ్లపై ఈవో ద్వంద్వ వైఖరి
ముందు చెల్లవని ప్రకటన.. ఆనక వాటికి అనుమతి
తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టే ఎత్తుగడ
స్థానిక యువత వేసిన టెండర్ తిరస్కరణ

(సత్యంన్యూస్,శ్రీకాకుళం)
అవుట్ సోర్సింగ్ సిబ్బంది నియామక ప్రక్రియలో అరసవల్లి దేవస్థానం అధికారులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. తమకు కావలసినవారికి ఆ పోస్టులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవస్థానానికి అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన 46 మందిని సమకూర్చే బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించేందుకు అధికారుల ఈ`టెండర్లు ఆహ్వానించారు. ఆ మేరకు ఆరు ఏజెన్సీల తరఫున టెండర్లు దాఖలు కాగా.. సోమవారం వాటిని తెరిచారు. దానికి ముందే జీరో పర్సంట్ కోట్ చేసిన టెండర్లు చెల్లవని ఆలయ ఈవో ప్రకటించారు. నిబంధనల ప్రకారం అవుట్ సోర్సింగ్ టెండర్లు వేసిన వారు కచ్చితంగా ఒకటి నుంచి 5 శాతం కమీషన్ కోట్ చేయాలి. అయితే టెండర్లు తెరిచిన అనంతరం జీరో పర్సంట్ కోట్ చేసిన వీఆర్‌ఎస్ చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహించిన గిరీశం టెక్నికల్ సర్వీసెస్‌కు చెందిన టెండర్‌ను కూడా ఈవో అనుమతించారు. దీనిపై ఆరసవల్లికి చెందిన ఎస్‌ఎస్ సెక్యూరిటీస్ ప్రతినిధులు అభ్యంతరం తెలిపినా ఈవో పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయినవారికి ధారాదత్తం చేసేలా..
స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో ఎస్‌ఎస్ సెక్యూరిటీ పేరుతో ఒక్క శాతం మాత్రమే కమీషన్ కోట్ చేస్తూ టెండర్ దాఖలు చేసినట్లు అరసవల్లికి చెందిన యువకులు చెబుతున్నారు. కానీ ఈవో ఏకపక్షంగా వ్యవహరించి విశాఖలోని మానసస్ ట్రస్టులో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ చంద్రరావును తీసుకువచ్చి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టెండర్లు తెరవకముందు ఒకలా.. తెరిచిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీరో కమీషన్‌తో వేసిన టెండర్లను అంగీకరించేది లేదని మొదట ప్రకటించిన ఈవో ఆ తర్వాత తనకు పరిచయమున్న వ్యక్తిని తీసుకువచ్చి టెండర్ కట్టబెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈవో ఏకపక్ష నిర్ణయం వల్ల స్థానికులమైన తమకు ఉపాధి దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్ నిబంధనలను ఈవో పాటించలేదని స్థానిక యువత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు రావడంతో ఈవో కొత్త పల్లవి అందుకున్నారు. బిడ్లు అన్నింటినీ దేవదాయశాఖ కమిషనర్‌కు పంపిస్తానని అంటున్నారు. నిబంధనల ప్రకారం కనీస రేట్ కోట్ చేసిన రెండు బిడ్లను మాత్రమే వెరిఫికేషన్ కోసం ఉన్నతాధికారులకు పంపించాలి. ఆలా కాకుండా అన్నింటినీ పంపిస్తానని చెప్పడం ద్వారా జీరో కమీషన్ కోట్ చేసిన వ్యక్తికి టెండరు కట్టబెట్టేందుకు ఈవో కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా స్థానిక యువతకు ఉపాధి లభించేలా ఒక్క శాతం కమీషన్‌తో దాఖలైన టెండర్‌ను ఖరారు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఈవోకు సూచించినట్టు తెలిసింది. అయితే దీనిపై ఈవో ఇప్పటివరకు స్పందించలేదని అంటున్నారు.
Comentários