top of page

నోరీగా నుంచి మదురో వరకు.. అమెరికా దుర్నీతి ఇదేగా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 5
  • 3 min read
  • కొన్ని దేశాల అధినేతల అరెస్టులు, హతం

  • స్వీయ ప్రయోజనాల కోసం అగ్రరాజ్యం అడ్డదారులు

  • తమకు నచ్చకపోతే అంతర్యుద్ధాలు, తిరుగుబాట్లకు ఊతం

  • పలు చిన్న దేశాలు బలవంతంగా హస్తగతం

  • ఆధిపత్య దాహానికి బలవుతున్న ప్రపంచం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఉరుము లేని పిడుగాలా చిన్నదేశమైన వెనిజువెలా(వెనిజులా)పై అగ్రరాజ్యం అమెరికా చీకటిమాటున విరుచుకుపడటం ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కనుసన్నల్లో ఆపరేషన్‌ సదరన్‌ స్పియర్‌ పేరుతో అమెరికా సైన్యం వెనిజులా రాజధాని కారకాస్‌పై దాడి చేయడమే కాకుండా.. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన సతీమణిని ఎత్తుకుపోయి న్యూయార్క్‌ జైల్లో పెట్టడం చూస్తే ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొనే అమెరికా చెప్పే సుద్దులన్నీ ఇతర దేశాలకేనని స్పష్టమవుతుంది. ట్రంప్‌ అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ శాంతికి ప్రయత్నిస్తున్నానని, తనకే నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేసినంత పనిచేస్తున్నారు. కానీ ఆయన చేతలు మాత్రం యుద్దోన్మాదాన్ని వ్యక్తీకరిస్తున్నాయి. దానికి తాజా ఉదాహరణే వెనిజువెలాపై ఆకస్మిక దాడి ఘటన. తన చర్యలను సమర్థించుకోవడానికి ట్రంప్‌ రకరకాల కారణాలు చెబుతున్నా అవన్నీ సాకులుగానే కనిపిస్తున్నాయి. డ్రగ్స్‌, నేరగాళ్లను వెనిజులా పాలకులు అమెరికాలోకి పంపిస్తున్నందునే వెనిజులాపై దాడి చేశామని ట్రంప్‌ చెబుతున్నారు. ఆ మాత్రం దానికి ఒక దేశాధ్యక్షుడినే అరెస్టు చేసి ఎత్తుకుపోవడం ఏమిటంటూ అనేక దేశాలు ఈ చర్యను ఖండిరచాయి. అయితే చరిత్ర లోతుల్లోకి వెళితే అమెరికా విధానమే ఆక్రమణ అని అర్థమవుతుంది. ప్రస్తుత ట్రంప్‌తోపాటు గతంలో చాలామంది అధ్యక్షులు కూడా అమెరికా మాట వినని, తమకు అవసరం ఉన్న దేశాలపై ఇదేవిధమైన చొరబాటు విధానాలను అనుసరించారు. కుదరకపోతే తనకు నచ్చని దేశాల్లో రాజకీయ, ఆర్థిక అస్థిరతలను సృష్టించి తమ ముందు మోకరిల్లేలా చేసుకోవడమే అమెరికా దుర్నీతి.

చమురు క్షేత్రాల కోసమే..

సిరియాలో అంతర్యుద్ధానికి, ఇరాన్‌లో అధికార మార్పిడితోపాటు ఇంకా అనేక దేశాలపై పెత్తనం చెలాయించడానికి అమెరికా కుటిలత్వమే కారణం. ప్రస్తుత సైనికచర్య విషయానికొస్తే.. వెనిజులా ఓ స్వతంత్ర దేశం. దీని అధికారిక పేరు రిపబ్లిక్‌ ఆఫ్‌ వెనిజులా. ఇది దక్షిణ అమెరికా ఖండానికి ఉత్తర భాగంలో ఉంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం వల్ల లక్షలాది ప్రజలు అమెరికాతో సహా ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దీన్నే డ్రగ్స్‌ వ్యాపారులను, నేరగాళ్లను తమ దేశంలోకి అక్రమంగా పంపుతున్నారన్న కలరింగ్‌ ఇచ్చి వెనిజులాపై అమెరికా దాడికి పాల్పడిరది. నార్కో టెర్రరిజం అభియోగాలతో మదురో ఆయన సతీమణిపై విచారణ జరుపుతున్నారు. మదురోను ప్రపంచంలో అతిపెద్ద డ్రగ్‌ ట్రాఫికర్లలో ఒకడిగా అమెరికా అభివర్ణించింది. ఆయన్ను పట్టుకున్న వారికి గతంలోనే 50 మిలియన్‌ డాలర్ల రివార్డు కూడా ప్రకటించింది. కాగా దక్షణ సరిహద్దు ద్వారా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిలో వెనిజులా పౌరులు అధికంగా ఉంటున్నారని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మదురో తన దేశంలోని జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఖైదీలను విడిచిపెట్టి, వారిని కావాలనే అమెరికా సరిహద్దుల వైపు పంపిస్తున్నారని, ఇది అమెరికా అంతర్గత భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపిస్తున్నారు. కానీ వెనిజులా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్నాయి. వాటిని హస్తగతం చేసుకునేందుకే చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న ఆమెరికా చివరికి ఈ దాడులకు పాల్పడిరదని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్‌ పద్రినో లోపెజ్‌ ఆరోపించారు. రష్యా, చైనాలతో స్నేహం లాటిన్‌ అమెరికాలో రష్యా, చైనాల ప్రభావం పెరగకుండా చూడటం కూడా అమెరికా చర్యల వెనుక లక్ష్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. వెనిజులానే కాకుండా గతంలో అనేక దేశాలు, దీవులను అమెరికా ఆక్రమించుకుంది. వీటిలో కొన్ని శాశ్వత అమెరికా భూభాగాలుగా మారిపోగా, మరికొన్ని సైనిక అవసరాల కోసం తాత్కాలికంగా అగ్రరాజ్యం ఆక్రమణలో ఉన్నాయి. అలాంటి ఉదంతాలను పరిశీలిద్దాం.

సైనిక తిరుగుబాట్లకు ప్రోత్సాహం
  • 1953లో ఇరాన్‌లో జరిగిన తిరుగుబాటు వెనుక అమెరికాయే కారణం. అప్పటి ఇరాన్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ మొసాదేగ్‌ తమ దేశంలోని చమురు క్షేత్రాలన్నింటినీ జాతీయం చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పాశ్చాత్య దేశాలకు మింగుడు పడలేదు. దాంతో అమెరికా సీఐఏ మద్దతుతో మొసాదేగ్‌పై తిరుగుబాటు లేవదీసి పదవీచ్యుతుడిన్న చేశారు. అనంతరం షా మహమ్మద్‌ పహ్లావికి సర్వాధికారులు కట్టబెట్టారు.

  • 1954లో గ్వాటెమాలలో జాకోబ్‌ అర్బెంజ్‌ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసింది. ఆయన చేపట్టిన భూసంస్కరణలు అమెరికాకు చెందిన అతిపెద్ద యునైటెడ్‌ ఫ్రూట్‌ కంపెనీ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండటంతో ఇక్కడ కూడా సీఐఏ సైనిక తిరుగుబాటును ప్రోత్సహించింది.

  • 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగో ప్రధానిగా ఎన్నికైన లుముంబా సోవియట్‌ యూనియన్‌ సహాయం కోరడాన్ని అమెరికా, బెల్జియంలు వ్యతిరేకించాయి. అతన్ని పదవి నుంచి దించి, అత్యంత క్రూరంగా హత్య చేయించాయి. అనంతరం అమెరికా మద్దతుతో జోసెఫ్‌ మొబుటు అధికారంలోకి వచ్చారు.

  • 1964లో బ్రెజిల్‌ ప్రభుత్వ నేత జోవో గౌలార్ట్‌ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు సోషలిజానికి దగ్గరగా ఉన్నాయని అమెరికా భయపడిరది. సీఐఏను రంగంలోకి దించి సైనిక తిరుగుబాటు ద్వారా గౌలార్ట్‌ను పదవీచ్యుతుడిని చేశారు. అక్కడి నుంచి 21 ఏళ్ల పాటు ఆ దేశంలో సైనికపాలన సాగింది.

  • 1965లో ఇండోనేషియా నాయకుడు సుకర్ణో కమ్యూనిస్టుల వైపు మొగ్గు చూపుతున్నారని భావించిన అమెరికా అక్కడి సైనిక జనరల్‌ సుహార్తోకు పరోక్ష మద్దతు ఇచ్చి తిరుగుబాటుకు ప్రోత్సహించింది. ఫలితంగా జరిగిన రక్తపాతంలో లక్షలాది మంది మరణించగా సుకర్ణో అధికారం కోల్పోయారు. సుహార్తో నియంతృత్వం మొదలైంది.

  • 1973లో చిలీలో అధికారంలో ఉన్న మార్క్సిస్ట్‌, సోషలిస్టు నాయకుడు సాల్వడార్‌ అలెండే ప్రభుత్వం అమెరికాకు నచ్చలేదు. ఫలితంగా సీఐఏ మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటులో అలెండే మరణించారు. ఆయన స్థానాన్ని క్రూరుడిగా పేరొందిన నియంత ఆగస్టో పినోచెట్‌ అధికారం చేపట్టారు.

  • 1983లో ద్వీప దేశమైన గ్రెనడాలో కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం ఏర్పడటంతో అమెరికా నేరుగా సైన్యాన్ని పంపి దాడి చేసింది. కొద్ది రోజుల్లోనే ఆ ప్రభుత్వాన్ని కూలదోసి, తమకు అనుకూలమైన పాలనను ఏర్పాటు చేసింది.

  • 1989లో పనామా అధిపతి మాన్యుయల్‌ నోరీగా మాదకద్రవ్యాల రవాణాను ప్రోత్సహించడం, అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వంటి ఆరోపణలతో అమెరికా నేరుగా సైనిక దాడి చేసి నోరీగాను బంధించి జైలుకు పంపింది.

  • 2003లో ఇరాక్‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే ఆరోపణతో (తర్వాత అవి లేవని తేలింది) అమెరికా యుద్ధం ప్రకటించి సద్దాం హుస్సేన్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. 2006లో ఆయనకు ఉరిశిక్ష విధించింది.

  • 2011లో లిబియా అధ్యక్షుడు ముఅమ్మర్‌ గడ్డాఫీని హతం చేసింది. అరబ్‌ స్ప్రింగ్‌ సమయంలో పౌరులపై అణిచివేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా నేతృత్వంలోని నాటో దళాల సాయంతో తిరుగుబాటుదారులు గడ్డాఫీని గద్దె దించి హతమార్చారు.

చిన్న దేశాల ఆక్రమణ

మరోవైపు పలు దేశాలను ఆక్రమించిన చరిత్ర కూడా అమెరికాకు ఉంది.

  • 1898లో స్పానిష్‌-అమెరికన్‌ యుద్ధం తర్వాత స్పెయిన్‌ నుంచి ప్యూర్టోరికో దీవిని అమెరికా స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది గువా య్‌ ద్వీపాన్ని కూడా స్పెయిన్‌ నుంచి లాక్కుంది. పసిఫిక్‌ మహాసముద్రంలో ఇది అమెరికాకు అత్యంత కీలకమైన సైనిక స్థావరం.

  • 1899లో బ్రిటన్‌, జర్మనీలతో కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికన్‌ సమోవా అమెరికా వశమైంది.

  • 1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో డెన్మార్క్‌ నుంచి 25 మిలియన్‌ డాలర్లకు వర్జిన్‌ ఐలెండ్స్‌ను సొంతం చేసుకుంది.

  • రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఉత్తర మరియానా దీవులు అమెరికా రక్షణలోకి వచ్చాయి.

  • 1898లో స్పెయిన్‌ నుంచి పిలిప్ఫిన్స్‌ను తీసుకుంది. 1946 వరకు ఇది అమెరికా వలసరాజ్యంగా ఉండి తర్వాత స్వతంత్ర దేశంగా మారింది.

  • రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జపాన్‌ 1945 నుంచి 1952 వరకు అమెరికా సైనిక పాలనలో ఉంది. జపాన్‌ రాజ్యాంగాన్ని మార్చడంలో అమెరికాయే కీలకపాత్ర పోషించింది.

  • 1903 నుంచి 1999 వరకు పనామా కాలువ ప్రాంతం అమెరికా నియంత్రణలో ఉండేది. షిప్పింగ్‌ వ్యాపారం, భద్రత దృష్ట్యా దీనిని తన ఆధీనంలో ఉంచుకుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page