నేరం నాది కాదు.. పోలీసులది!
- DV RAMANA

- Dec 26, 2025
- 3 min read
నిరాధారంగా 43 ఏళ్లు జైల్లో మగ్గిన భారతీయుడు
యువకుడిగా వెళ్లి.. వృద్ధుడిగా తిరిగిరాక
వచ్చిన వెంటనే మళ్లీ డ్రగ్స్ కేసులో అరెస్టు
మరోవైపు వెంటాడుతున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
యుక్త వయసులో జైలుకెళ్లిన అతను వృద్ధాప్యం ముప్పిరిగొన్న తర్వాతే తిరిగి బయట ప్రపంచాన్ని చూడగలిగాడు. మొత్తం 43 ఏళ్లు జైలు గోడల మధ్య మగ్గిపోయాడు. సుదీర్ఘ జైలుశిక్ష అనుభవించినందున ఆయనేదో కరడుగట్టిన నేరగాడో, హంతకుడో అనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే.. ఆయన ఎటువంటి నేరం చేయడలేదు. డ్రగ్స్ కేసులో యువకుడిగా ఉన్నప్పుడే అతనిపై కేసు పెట్టి జైల్లో పెట్టిన పోలీసులు దాన్ని న్యాయస్థానంలో నిరూపించలేకపోయారు. వారి వైఫల్యం కారణంగా నేరం చేయకపోయినా ఆ యువకుడు తన జీవితంలో విలువైన కాలాన్ని నష్టపోయాడు. ఆనందంగా గడపాల్సిన యవ్వనం జైలులోనే కరిగిపోయింది. జీవితం ఎవరిని ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించలేం. కొన్నిసార్లు విధి పగబట్టినట్లుగా కొన్ని జీవితాలను ఛిద్రం చేస్తుంది. ఆ కోవకు చెందిన అభాగ్యుడే సుబ్రహ్మణ్యం వేదం అలియాస్ సుబ్బు వేదం. చేయని నేరానికి దాదాపు జీవిత కాలం మొత్తం శిక్ష అనుభవించిన దురదృష్టవంతుడు. పెళ్లి చేసుకుని పిల్లలతో కుటుంబ బాధ్యతల్లో నిమగ్నం కావాల్సిన సమయం జైలు గోడల మధ్య నిస్సారంగా గడిచిపోయింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత జైలు నుంచి విడుదలైనా.. ఇప్పుడు నా అనేవారు లేక స్వదేశం వెళ్లలేక మళ్లీ న్యాయపోరాటం చేస్తున్న దీనుడి విషాద గాథ గుండెలను పిండేస్తుంది.
భారత సంతతికి చెందిన సుబ్రహ్మణ్యం వేదం అలియాస్ సుబ్బు వేదం అనే వ్యక్తి 64 ఏళ్ల వయసులో జైలు నుంచి విడుదలయ్యాడు. పెన్సుల్వేనియాలోని హంటింగ్డన్ పరివర్తన కేంద్రం నుంచి అక్టోబర్ 3న రిలీజ్ అయ్యాడు. మర్డర్ కేసులో ఆరోపణలతో 19 ఏళ్ల వయసులో జైలుకెళ్లిన సుబ్బు.. ఎలాంటి హత్య చేయలేదని, నేరం రుజువు కాలేదని నాలుగు దశాబ్దాలు.. అంటే 43 ఏళ్లు జైళ్లోనే గడిచిన తర్వాత రిలీజ్ చేశారు. అయితే రిలీజైన వెంటనే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం పెద్ద ట్విస్టుగా మారింది.
చేయని నేరానికి..
సుబ్బు వేదం ఉన్నతస్థాయి భారత సంతతి కుటుంబానికి చెందినవాడు. ఆయన తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాలో సెటిల్ అయ్యారు. తండ్రి ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేసేవారు. 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల కేసులో అక్కడి పోలీసులు సుబ్బును అరెస్టు చేసి జైల్లో పెట్టారు. సుబ్బు క్లాస్‌మేట్ కిన్సేర్ కాలేజీలో కాల్పులకు గురై చనిపోయాడు. హత్యకు ముందు చివరిసారిగా కిన్సేర్‌తో ఉన్నది సుబ్బు వేదం మాత్రమేనని గుర్తించిన పోలీసులు అతనే హంతకుడన్న ఆరోపణతో అరెస్టు చేశారు. తాను తప్పు చేయలేదని సుబ్బు వాదించినా పట్టించుకోలేదు. 1983లో ఒకసారి.. 1988లో మరోసారి హత్యారోపణల కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటినుంచి పెరోల్ అవకాశం కూడా లేకుండా దాదాపు జీవితమంతా జైళ్లోనే గడపాల్సి వచ్చింది. అప్పటినుంచీ కొనసాగుతున్న ఈ కేసు విచారణలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో సెంటర్ కోర్టు జడ్జి జొనాథన్ గ్రైన్ కుట్ర పూరితంగా ఈ కేసులో సుబ్బును ఇరికించినట్లు గుర్తించారు. ఎఫ్‌బీఐ(ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) రిపోర్టు ప్రకారం 0.25 క్యాలిబర్ గన్‌తో కిన్సేర్ తలలో కాల్చారని, అయితే దానికి సంబంధించిన ఆ ఎవిడెన్స్ అప్పట్లో దొరికిందా, సుబ్బు కాల్చినట్లు ఆధారాలు ఉన్నాయా అని ప్రాసిక్యూషన్‌ను ప్రశ్నించారు. కేసును అనవసరంగా కొనసాగిస్తున్నారని పేర్కొంటూ సుబ్బును విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో 43 ఏళ్ల జైలు జీవితం నుంచి సబ్బుకు విముక్తి లభించింది.
బయటకొచ్చినా అదే చీకటి
జైలు నుంచి విడుదలయ్యేవారు సాధారణంగా గంపెడాశలతో బయటకు వస్తారు. కానీ సుబ్బుకు ఆ ఆశలు కూడా మిగల్లేదు. తను జైల్లో ఉండగానే తల్లిదండ్రులు చనిపోయారు. తల్లి ప్రతి వారం జైలుకు వెళ్లి కొడుకును చూసి వచ్చేది. అలా 34 ఏళ్ల తర్వాత 2016లో ఆమె చనిపోయారు. అంతకుముందే 2009 సెప్టెంబర్‌లో తండ్రి కన్నుమూశారు. ఫలితంగా తనకు అక్కడ జైలు చీకటి జ్ఞాపకాలు తప్ప మరేమీ మిగల్లేదు. చివరి రోజులు ప్రశాంతంగా గడుపుదామనుకుంటే అది కూడా లేకుండా అక్కడి అధికారులు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ కేసులో తనను అమెరికా నుంచి పంపించేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. డిపోర్టేషన్ ద్వారా తనను భారతదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా సబ్బు తరఫున న్యాయవాదులు మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అతను అమెరికాలోనే ఆశ్రయం పొందేందుకు వీలుగా ఇమిగ్రేషన్ రూల్స్ సడలించాలని చట్టపరంగా పోరాడుతున్నారు.
విద్యార్థిగా.. గురువుగా..
దశాబ్దాలపాటు జైలులో మగ్గిపోయినా.. ఆ జీవితం పట్ల సుబ్బు వేదం ఎప్పుడూ కుంగిపోలేదు. అక్కడినుంచే ఎన్నో విజయాలు సాధించినట్లు అతని సోదరి సరస్వతి వేదం తెలిపారు. జైల్లో ఎంతోమందికి విద్య నేర్పించాడు. చాలామంది డిప్లొమా పూర్తి చేసేలా శిక్షణ ఇచ్చాడు. జైల్లో ఉంటూనే మూడు డిగ్రీలు పూర్తి చేశాడు. ఎంబీఏ పట్టా అందుకున్నాడు. 150 ఏళ్ల పెన్సిల్వేనియా జైలు చరిత్రలో జైల్లో ఉండి డిగ్రీ పూర్తి చేసిన ఏకైక ఖైదీగా చరిత్ర సృష్టించాడు. అయితే జైలు నుంచి విడుదలైన వెంటనే పోలీసులు మరో కేసు పేరుతో మళ్లీ అరెస్టు చేయడం ఆందోళనకు గురిచేసిందని సోదరి చెప్పారు. 1980లో వేదం డ్రగ్స్ తీసుకున్నాడని, సరఫరా చేశాడనే మరో అభియోగంతో అరెస్టు చేయడం విస్మయానికి గురి చేసిందని అంటున్నారు. ఇప్పటికే చేయని నేరానికి నాలుగు దశాబ్దాలు జైలులో గడిపిన అతను కోల్పోయిన విలువైన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు.










Comments