top of page

నిర్లక్ష్యపు ముంపు.. మేలుకోకుంటే ముప్పు!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Sep 3, 2025
  • 4 min read

  • ఎమ్మెల్యేనే కలవరపెడుతున్న దీర్ఘకాల సమస్య

  • బట్టీలపై యథేచ్ఛగా ఆక్రమణలు, నిర్మాణాలు

  • శివారు కాలనీల్లో ప్రణాళికారహిత నిర్మాణాలు

  • పూడికలతో పిల్లకాలువల్లా మారిన గెడ్డలు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పుండు మీద కారం చల్లినట్లు దానికి ఐదు రోజుల తేడాలోనే మరో అల్పపీడనం ఏర్పడుతుందని.. అది కూడా ఉత్తరాంధ్రపైనే ప్రభావం చూపుతుందని ప్రకటించింది. ఈ ప్రకటన చూసి మొదట హతాశుడయ్యింది శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకరే. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే నగరంలోని అనేక కాలనీలు ముంపులోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నీటిని తోడటానికి దగ్గరుండి ఏర్పాట్లు చేయడం, కాలనీల్లో పర్యటించడం చేస్తుండగానే మళ్లీ అల్పపీడనం, వర్షాలు అనడంతో గొండు శంకర్‌ తల పట్టుకుంటున్నారు. ఇటీవల ముంపు కాలనీలను పరిశీలించిన గొండు శంకర్‌ దీనికి పరిష్కారమేమిటని అడిగితే.. అసలు ఆ ప్రశ్నే అర్థరహితమన్నట్టు ఇంజినీరింగ్‌ అధికారులు సమాధానమివ్వడంతో ఏం చేయాలో పాలుపోక వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు. గొండు శంకర్‌ ఎమ్మెల్యే అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్న ఆశతో ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన కూడా గెలిచిన దగ్గర్నుంచీ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తిరుగుతున్నారు. అందులో భాగంగానే సమాధానం లేని ఈ ప్రశ్నకు, పరిష్కారం కాని ఈ సమస్యకు ముగింపు పలకడానికి ఎడతెగని మంతనాలు జరుపుతున్నారు.

నాలుగు దశాబ్దాల నిర్లక్ష్యం

అక్రమాలు, ఆక్రమణలపై నాలుగు దశాబ్దాలుగా అధికార యంత్రాంగం, పాలకులు కళ్లు మూసుకోవడం వల్లే ముంపు సమస్య దాపురించింది. కనీసం గొండు శంకరైనా రాజకీయాలకు అతీతంగా భవన నిర్మాణాలు, కాలువల్లో ఆక్రమణల తొలగింపు వంటి వాటిపై దృష్టి పెడితే గానీ ఈ సమస్యకు కొంతమేరకైనా పరిష్కారం దొరకదు. అలా కాకుండా ఇప్పటికిప్పుడు శ్రీకాకుళం నగరాన్ని ముంపు నుంచి బయట పడేయాలంటే రాజధాని అమరావతి నిర్మాణంలో సగం నిధులు ఇక్కడికి మళ్లించాలి. ఇది జరిగే పని కాదు కాబట్టి ఆక్రమణల మీదే దృష్టి సారించాలి. ఇదే కోణంలో ‘మిర్తిబట్టీ.. నీకో దండం పెట్టి!’ శీర్షికన గత నెల 29న ‘సత్యం’ సమగ్ర కథనం ప్రచురించింది. దీనిపై ఎమ్మెల్యే శంకర్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని కోరారు. అయితే ఆర్థికపరమైన అంశం కాబట్టి ప్రస్తుతానికి ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు.

ఇష్టారాజ్యంగా కాలనీల నిర్మాణం

శ్రీకాకుళం నగరానికి ఆనుకొని సుమారు 18 కాలనీలున్నాయి. ఇవన్నీ పంట పొలాలను లేఅవుట్లుగా మార్చడం వల్ల ఏర్పడినవే. ఎత్తుపల్లాలు చూడకుండా ఇష్టారాజ్యంగా ఈ కాలనీల్లో ఇళ్లు నిర్మించారు. ఇక్కడే చిక్కొచ్చిపడిరది. వాస్తవానికి ఈ కాలనీల నుంచి నీరు రామిగెడ్డలోకి ప్రవహించాలి. కానీ ఈ కాలనీల కంటే రామిగెడ్డ కాలువలు ఎత్తులో ఉన్నాయి. అందువల్ల కాలనీల్లో నీరు రామిగెడ్డలోకి వెళ్లడంలేదు. ఫ్లడ్‌ లెవెల్‌ కంటే ఇళ్లు ఎత్తులో ఉండాలి. కానీ దాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలు జరిపేశారు. తీరా ఇప్పుడు కాలనీలు మునిగిపోతున్నాయని గోల పెడుతున్నారు. ప్రతి ఏటా వర్షాలకు కాలనీలు మునిగిపోతున్నా ఆ ప్రాంతాలకు సరిపడే కాలువలు నిర్మించడం మినహా.. వాటిని మెయిన్‌ డ్రెయిన్‌కు అనుసంధానించే పనులు జరగలేదు. కారణం.. మురుగునీరు తీసుకెళ్లే గెడ్డలు ఎత్తులో ఉండటం, ఇళ్లు పల్లంలో ఉండటమే. దీనివల్ల రామిగెడ్డ, మిర్తిబట్టీల్లోకి నీరు పారడంలేదు. మరోవైపు నగరంలో మిగిలిన ప్రాంతాలకు చెందినవారు ఈ బట్టీలను ఆక్రమించి ఇళ్లు నిర్మించేశారు. వాస్తవానికి ఒక ఏరియాలో కాలువలను ఎంత వెడల్పు, ఎంత లోతుతో నిర్మించాలనేది సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖ అధ్యయనం చేసి నిర్ణయించాలి. అలా కాకుండా రోడ్డు వేసినప్పుడు ఆ పక్కన ఒక కాలువ నిర్మించడంతో మురుగు నీరు అదే కాలనీల్లో నిల్వ ఉండిపోతుంది. ప్రతి ప్రాంతంలోనూ వర్షం పడినప్పుడు వచ్చే నీరు, వాడుక నీరు ఎటువైపు వెళతాయనేది స్థానికులకు తెలుస్తుంది. ఉదాహరణకు చాపురం పంచాయతీలో కాలనీలు నిర్మించినప్పుడు అక్కడ గతంలో వర్షపు నీరు ఎటువైపు పారేదో అక్కడున్న రైతులనడిగుంటే చెప్పేవారు. కానీ అలా అభిప్రాయాలు సేకరించకుండానే ఇళ్లు నిర్మించేశారు. కాలువలు కట్టేశారు. దాంతో మురుగు నీరు, వర్షపు నీరు ఎక్కడికెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంజినీరింగ్‌ లెక్కల ప్రకారమైతే 20 శాతం రెయిన్‌ఫాల్‌ ఉంటుందని అంచనా వేసి వాడుకనీరు ఏమేరకు వస్తుందో లెక్క కట్టి, క్యాచ్‌మెంట్‌ ఏరియా ఎక్కడో గుర్తించి అటువైపే కాలువలకు కనెక్టివిటీ ఇవ్వాలి. అయితే ఒక్క శివారు కాలనీలోనూ అటువంటి ఏర్పాట్లు లేవు. మరి ఇప్పుడు నీరు బయటకు పోవాలంటే ఎలా?

కుచించుకుపోయిన ప్రధాన కాలువలు

బలగ నుంచి ఎస్వీడీ హోటల్‌ వరకు ప్రవహించే మిర్తిబట్టీపైనే ఎక్కువ కాలనీలు వెలిశాయి. కాలనీలకు వచ్చే మొత్తం వర్షపు నీరు, మురుగు నీటిని తీసుకువెళ్లే ప్రధాన డ్రైనేజీ ఇదేనన్న విషయం మర్చిపోయి సాధారణ సందులో ఉండే కాలువ కంటే చిన్నదిగా మార్చేశారు. ఈ కాలువ పైనుంచి రోడ్లు వేసేసి కాలనీల్లో స్థలాలకు రేట్లు పెంచేశారు. పది అడుగుల కాలువ మీదుగా రోడ్డు వేసేటప్పుడు కల్వర్టులు నిర్మించాలనే జ్ఞానం కూడా లేకుండా కేవలం ఒక సిమెంట్‌ పైపును నీటి ప్రవాహానికి వీలుగా పెట్టి సీసీ రోడ్లు వేసేశారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ సిమెంట్‌ పైపుల్లో పూడిక నిండిపోయింది. నర్సెస్‌ కాలనీకి వెళ్లే దారిలో తిలక్‌నగర్‌ దగ్గర మిర్తిబట్టీని చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ‘సత్యం’లో కథనం వచ్చాక.. ఎమ్మెల్యే పర్యటించిన తర్వాత కూడా కాలనీలు ఇంకా ముంపులోనే ఉన్నాయని మళ్లీ ‘సత్యం’ కథనం ప్రచురించిన తర్వాతే మున్సిపల్‌ యంత్రాంగం కదిలి రెండు రోజులుగా డ్యామేజ్‌ కంట్రోల్‌ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఎంపీడీవో కార్యాలయ రోడ్డులో కాలువ మీద నిర్మించిన రోడ్డును తవ్వి మోటారుతో నీటిని తోడారు. అలాగే బుధవారం ఎస్‌వీడీ హోటల్‌ పక్కనుంచి మిర్తిబట్టీలో ఉన్న పూడికలు తొలగిస్తున్నారు. జేసీబీతో రామలక్ష్మణ జంక్షన్‌ నుంచి కొంత దూరం వరకు లోతుగా పూడిక తీయించి, వాటిని వెంటనే వేరే చోటకు తరలిస్తున్నారు. ఇక్కడ పూడికతీత పూర్తయిన తర్వాత కాలువ కింద ఉన్న సిల్ట్‌ను తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది పూర్తయితే గానీ ఇందిరానగర్‌ కాలనీలో మిర్తిబట్టి పూడికల తొలగింపు చేపట్టలేరు.

ఇలా చేస్తే కొంత మేలు

అయితే నగరానికి ముంపు నుంచి విముక్తి లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుతం మిర్తిబట్టీ, రామిగెడ్డలపై ఉన్న నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించడం కుదరదు. ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు లైన్‌ క్లియర్‌ చేస్తే 40 శాతమైనా పరిష్కారమవుతుంది. నర్సెస్‌ కాలనీ, తిలక్‌నగర్‌ల వద్ద మిర్తిబట్టీలో పూర్తిస్థాయిలో పూడికలు తీసి మార్గాన్ని సుగమం చేస్తే ఫిషరీస్‌ కార్యాలయం మీదుగా మాధవ మోటార్స్‌ వరకు ఉన్న లోతట్టు ప్రాంతాల్లో నీరు బయటకు వస్తుంది. అక్కడి నుంచి కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి పాత కార్యాలయం వరకు కొంతమేరకు కాలువను పెద్దది చేస్తే సరిపోతుంది. ఆ కాలనీ నుంచి విశాఖ`బి కాలనీలో షిరిడీ సాయిబాబా మందిరం దగ్గరున్న ప్రధాన కాలువను శుభ్రం చేస్తే ఎస్వీడీ హోటల్‌ వరకు నీరు పారుతుంది. అక్కడెలాగూ మిర్తిబట్టీలో పూడికలు తీస్తున్నారు కాబట్టి నగరానికి ఆనుకొని ఉన్న సగం కాలనీల్లో వర్షపు నీరు బయటకు వస్తుంది. అంతకు మించి ప్రస్తుతానికి పరిష్కారం కనిపించడంలేదు.

భవిష్యత్తు కోసం ఏం చేయాలి?

40 నుంచి 50 ఏళ్ల క్రితం నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థే కార్పొరేషన్‌లో ఉంది. విలీన పంచాయతీలను కలిపితే ఇప్పుడివి దేనికీ సరిపోవు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న కాలనీలకు అదనంగా మరో 20 కాలనీలు చేరుతాయని భావించి సమగ్ర అధ్యయనం చేయాలి. ఇందుకోసం సోషియో`ఎకనామికల్‌`టెక్నికల్‌ స్టడీ అవసరం. అలా అని దారిన పోయే దానయ్యలకు ఈ పని అప్పజెప్పకుండా ఐఐటీ విద్యార్థులకో, ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఇటువంటి కోర్సు చదువుతున్నవారికో ఈ ప్రాజెక్టు అప్పగించాలి. గతంలో యూపీ గవర్నమెంట్‌ సిఫార్సు చేసిన టీయూవీ అనే సంస్థకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ స్టడీని ప్రభుత్వం కట్టబెట్టింది. ఇది కుదరదని తేలడంతో ఓపెన్‌ డ్రైనేజీ కోసం స్టడీ చేయించింది. అయితే ఇందులో నగరానికి ఆనుకొని ఉన్న పంచాయతీలను పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో ఈ అధ్యయనం ఎందుకూ పనికిరాకుండాపోయింది. శాస్త్రీయంగా అధ్యయనం జరిగితే గానీ ఈ సమస్య తీరదు. ప్రతి కాలనీ మురుగు వ్యవస్థను మిర్తిబట్టికో, రామిగెడ్డకో అనుసంధానం చేయడం ఇప్పుడు కుదరదు. ఆ కాలనీలకు గతంలో ఉన్న క్యాచ్‌మెంట్‌ ఏరియాను గుర్తించాలి. కాలువలన్నింటినీ అటువైపు మళ్లించేలా నిర్మాణాలు చేపట్టాలి. ప్రభుత్వం తగిన బడ్జెట్‌ కేటాయిస్తే తప్ప ఇవి జరగవు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page