నిర్లక్ష్యమే కాటేసింది!
- NVS PRASAD

- Feb 24
- 2 min read
నగరంలో డయేరియాతో ముగ్గురి మతి?
అస్వస్థతతో 62 మంది ఆస్పత్రులపాలు
పైపులైన్, మురుగు కాలువ నీరు మిలాఖత్
మున్సిపల్ సిబ్బంది నిర్లిప్తతే దీనికి కారణం
సమాచారం లేదన్న వైద్య ఆరోగ్య అధికారులు
వారి తీరుపై కలెక్టర్ ఆగ్రహం.. అక్కడే ఉండి పర్యవేక్షణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలోని గోల్కొండ రేవు, మొండేటి వీధి, మంగువారి తోట ప్రాంతాల్లో మోణింగి సంతోష్ (41), మడ్డు లక్ష్మణ (61), మండల సురేష్ (42) అనే ముగ్గురు వ్యక్తులు సోమవారం తెల్లవారుజాము నుంచి మంగళవారం ఉదయం మధ్య ఆకస్మికంగా మరణించారు. వీరికి ఒక్కొక్కరికి ఒక్కో అనారోగ్యపరమైన నేపథ్యం ఉండొచ్చు. కానీ ముగ్గురూ చనిపోయిందీ వాంతులు, విరేచనాలతోనే. వీరిలో ఆస్పత్రికి వెళ్లేవరకు సమయం ఇవ్వనివారు ఇద్దరైతే.. మరొకరు చికిత్స జరుగుతుండగానే మరణించారు. వీటిని డయేరియా మరణాలుగా పరిగణిస్తారో లేక సహజ మరణాలంటారో ప్రభుత్వం ఇష్టం. కానీ వారి కుటుంబసభ్యులు చెబుతున్న లక్షణాలు మాత్రం వాంతులు, విరేచనాలే. అధికారులు మాత్రం ఇంతవరకు ఒక్కరే మరణించారని ప్రకటించింది. మరో 62 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మోణింగి సంతోష్‌కు 41 ఏళ్లు వచ్చినా మానసిక పరిణితి లేకపోవడంతో ఇంటివద్దే ఉంటాడు. అలా అని మరో ఆరోగ్య సమస్య లేదు. తన పనులు తాను చేసుకోవడానికి, మార్కెట్‌కు వెళ్లి సామాన్లు తెచ్చుకోవడానికి వైకల్యం ఆయనకెప్ప్పుడూ అడ్డు రాలేదు. కానీ సోమవారం వేకువజామున వరుసగా నాలుగుసార్లు వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఇంటి మెట్ల మీద కుప్పకూలిపోయాడు. మిగిలిన ఇద్దరు మతుల్లో కూడా అవే లక్షణాలు కనిపించాయి. అయితే ఇవన్నీ బయటపడిన తర్వాత లివర్ సమస్యలు ఉన్నాయని, బీపీ, షుగర్ ఉన్నాయని ప్రభుత్వం ప్రకటిస్తే తప్ప్పు పట్టాల్సిన అవసరం లేదోమో!

ఎందుకంటే.. రాజమండ్రిలో కల్తీపాలు తాగి ఐదుగురు మరణించిన విషాదం రచ్చగా మారిన తరుణంలో ‘ఊరంతా డయేరియా’ పేరిట సంచలన సాయంకాల పత్రిక ‘సత్యం’ సోమవారం సాయంత్రం ఫొటోలతో సహా కథనం ప్రచురించడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. అప్పటినుంచీ కలెక్టర్ దినకర్ పుండ్కర్ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్త్తున్నారు. పత్రిక ప్రజల్లోకి రాకముందే వెబ్‌సైట్ (https://www.satyamdaily.net/)లో పోస్ట్ చేసిన ఆ కథనాన్ని చూసిన కలెక్టర్ వెంటనే స్పందించారు. గోల్కొండ రేవు రోడ్డులో ఉన్న వండాన శిమ్మన్న ఆస్పత్రికి వెళ్లి బాధితులతో మాట్లాడి వెంటనే వారందరినీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మేదరవీధి వద్ద పైప్‌లైన్, మురికికాలువ కలిసిపోయి కలుషిత నీరు సరఫరా అవుతున్నదని తెలుసుకున్న కలెక్టర్ మున్సిపల్ అధికారులను వాయించేశారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆరా తీయగా ఇప్పటి వరకు తమ వద్ద సమాచారం లేదని చెప్పడంతో సాయంకాల పత్రిక ‘సత్యం’లో కథనం వచ్చిన తర్వాత కూడా సమాచారం లేదనడం బాధ్యతారాహిత్యం కాకుండా మరేమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కార్పొరేషన్ సరఫరా చేసే నీటిని వినియోగించవద్దని ప్రజలకు సమాచారం అందించారా? అని మున్సిపల్ అధికారులను ప్రశ్నించినప్పుడు కూడా సమాధానం కరువైంది. దీంతో శిమ్మన్న ఆస్పత్రి వేదికగానే కలెక్టర్ దినకర్ ఆ ఐదు డివిజన్ల ప్రజలు మున్సిపల్ నీరు తాగొద్దని, ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని, లేకపోతే బయట కొనుక్కున్నా ఫర్వాలేదని వీడియో స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో అటు సోషల్‌మీడియా ఇటు మిగిలిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా దీన్ని సర్క్యులేట్ చేయడంతో పాతశ్రీకాకుళం ప్రజలు అలర్ట్ అయ్యారు.

వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇప్పటికీ కలెక్టర్‌ను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారు. డయేరియా లక్షణాలతో ముగ్గురు చనిపోయారంటే అధికార యంత్రాంగం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్ప్పుకోదు. ‘సత్యం’లో కథనం రావడం, కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం ఒకవైపు జరిగితే, మరోవైపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం రాత్రి వరకు పరిస్థితిని పర్యవేక్షించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అమరావతి నుంచే నగర నాయకులను రంగంలోకి దించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సోమవారం అర్థరాత్రి వరకు కలెక్టర్ ఈ ఐదు డివిజన్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తునే ఉన్నారు. ప్రతి డివిజన్‌లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్‌ను రాత్రికి రాత్రి రంగంలోకి దించారు. ఏమాత్రం లక్షణాలు కనిపించినా విడిచిపెట్టకుండా చికిత్స అందించాలని సూచించడంతో పాటు, అది జరుగుతున్నదీ లేనిదీ పరిశీలించారు. ‘సత్యం’లో కథనం వచ్చిన దగ్గర్నుంచీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 డివిజన్ల శానిటేషన్ సిబ్బంది ఈ ఐదు డివిజన్లలో మోహరించి యుద్ధ ప్రాతిపదికన రోడ్లు, కాలువలు శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లారు. మరోవైపు వాటర్ వర్క్స్ ఏఈ సత్యనారాయణ నేతత్వంలో మురుగు కాలువ పక్క నుంచి వెళ్తున్న పైప్‌లైన్లను తవ్వితీసి మరమ్మతులు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా వచ్చే నీరు నిల్వ ఉంటే పారబోయాలని, మంగళవారం మధ్యాహ్నం నాటికి ఓవర్ హెడ్ ట్యాంకులన్నీ కడిగేసి నీటిని సరఫరా చేస్తామని, దాన్ని కూడా వదిలేసిన తర్వాత బుధవారం నుంచి నీటిని పట్టుకోవాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో ఉన్న వాటర్ పైప్‌లైన్లలో క్లోరినేషన్ పర్సంటేజ్ ఎంత ఉందనేది ఏఈ సత్యనారాయణ పరిశీలిస్తున్నారు. సాధారణంగా పైప్‌లైన్ శివారుకు వచ్చేసరికి క్లోరిన్ రెండు శాతం ఉండాలి. అలా లేదంటే.. మధ్యలో ఎక్కడో వాటర్ పైప్‌లైన్‌లో మురుగు చేరినట్టు లెక్క. ఎప్ప్పుడైతే నగరంలో సగం ప్రాంతాల్లో డయేరియా ఉందని తేలిందో.. ఆర్‌వో ప్లాంట్ల వద్ద క్యాన్లు పట్టుకొని స్థానికులు బారులుతీరారు.







Comments