నీళ్ల రసం.. ఉడికీ ఉడకని అన్నం
- Prasad Satyam
- Oct 27, 2025
- 1 min read
ఆదిత్యా.. నీ ప్రసాదం ఇంత అధ్వానమా?
ప్రత్యక్ష నారాయణుడి సన్నిధిలోనే అపచారం
ఫిర్యాదు చేస్తే.. సిబ్బంది కొరత సాకు చూపిన ఈవో

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మనకు ముక్కోటి దేవతలున్నారు. కానీ మనం చేసే పాపపుణ్యాలను వారు నేరుగా చూసే అవకాశం లేదు. కానీ సూర్యనారాయణ స్వామి ఒక్కరే ప్రత్యక్ష దైవం. నిత్యం లోకాలకు వెలుగునిస్తూ భక్తులను ఆశీర్వదిస్తుంటాడు. అటువంటి ప్రత్యక్ష నారాయణుడిని.. అందులోనూ ఆయన సన్నిధిలోనే మాయ చేసేస్తున్నారు. స్వామి సేవకులం.. అని చెప్పుకొంటున్నవారే శఠగోపం పెట్టేస్తున్నారు. అరసవల్లి దేవస్థానంలో నిత్యం జరిగే అన్నదానాన్ని భక్తులు అన్నప్రసాదంగా.. అక్కడ ఒక్క ముద్దయినా తినడాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. అయితే కొందరు ఆ మహాక్రతువును కూడా స్వాహాకార్యంగా మార్చేస్తున్నారు. నిత్యాన్నదానం చేస్తున్నామని ఘనంగా ప్రచారం చేసుకుంటున్నా.. సగటున ఎంతమంది భక్తులు రావచ్చు.. ఎంత పరిమాణంలో అన్నప్రసాదాలు తయారు చేయాలన్న ఆంచనా లేకుండా చాలీచాలని రీతిలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. తీరా భక్తుల సంఖ్య అధికంగా ఉంటే రసంలో నీరు కలగలపడం, అప్పటికప్పుడు అన్నం ఎసరు పెట్టి ఉడికీఉడక్కుండానే భక్తులకు వడ్డిస్తున్నారు. నాసిరకంగా ఉన్న ఈ ఆహారాన్ని తినలేక.. దేవుడి ప్రసాదం కనుక పారబోయలేక.. చివరికి ‘ఆదిత్యా.. ఏమిటీ పరీక్ష’ అంటూ ఆ అరసవల్లి స్వామినే ప్రశ్నించే పరిస్థితి నెలకొంటోంది. చివరికి ప్రశాంతంగా అన్నప్రసాదం స్వీకరించే ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు అందులోనూ విఫలమవుతున్నారు. ఈ దుస్థితిని కొందరు భక్తులు నేరుగా అన్నప్రసాదాన్ని దేవస్థానం ఈవో వద్దకు తీసుకెళ్లి చూపించగా.. లోపాలు నిజమే అని ఒప్పుకున్న ఆయనగారు.. వాటికి సిబ్బంది కొరతే కారణమని సరిపెట్టేయడంతో సూర్యదేవా.. నీవైనా కల్పించుకోవా? అని ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు.










Comments