నువ్వు మునిగావ్.. ఆయన్నూ ముంచేశావ్!
- NVS PRASAD

- Aug 25, 2025
- 3 min read
సౌమ్య ఆరోపణల కంటే దువ్వాడ స్టేట్‌మెంటే డ్యామేజీ
కాళింగులకు పెద్దన్న కావాలనే ఆరాటం
ధర్మాన సోదరులపై మళ్లీ పాతపాటే
కూన రవిపైన సానుభూతిని చెరిపేసిన శ్రీను


(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీ గెలిచింది.. బెంగళూరులో నిర్వహించిన విజయోత్సవ సభలో తొక్కిసలాట జరిగి పదిమందికి పైగా క్రికెట్ అభిమానులు మరణించారు. ఫైనల్స్‌లో రొమారియో షెప్పర్డ్ వేసిన బంతి శ్రేయాస్ అయ్యర్ బ్యాట్‌కు వెంట్రుకవాసి పైగా వెళ్లివుంటే ఆరు పరుగుల తేడాతో బెంగళూరు గెలిచేదికాదు. సెలబ్రేషన్స్ ఉండేవికావు. పదిమంది ప్రాణాలు రక్షింపబడేవి. ఒక చిన్న సంఘటన వల్ల మనిషి జీవితంలో లేదా ప్రపంచ చరిత్రలో మార్పు వస్తే దాన్నే బట్టర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్టే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను రూపంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు తగిలింది. పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య తనను రవికుమార్ మానసికంగా, శారీరకంగా వేధించారన్న ఆరోపణలపై జిల్లాలో అధిక శాతం మంది రవికుమార్‌కు నోటిదురుసు ఉందికాబట్టి నాలుగు మాటలు అనుంటారు తప్ప, శారీరకంగా వేధించారంటే నమ్మలేదు. ఇందులో ఎవరు కరెక్టు, ఎవరు కాదు? అన్న ప్రస్తావనకు పోవడంలేదు. అయితే రవికుమార్‌కు మంత్రి పదవి రాబోతుంది కాబట్టి వెలమ సామాజికవర్గానికి చెందిన నేతలు ఆయన మీద కుట్ర చేసి ఇలా ఇరికించారంటూ సామాజికమాధ్యమాల్లో కాళింగులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో దీన్ని తనకు అనుకూలంగా మలచుకోవడం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను రంగప్రవేశం చేసి, కూన రవికుమార్ మీద అప్పటి వరకు ఉన్న సాఫ్ట్‌కార్నర్‌ను చెరిపేశారు. అప్పటికే సౌమ్య వర్సెస్ కూన రవికుమార్ గొడవ కాస్త కాళింగ వర్సెస్ వెలమ కింద మారిపోయిన తర్వాత దువ్వాడ శ్రీను కాళింగులకు తాను మాత్రమే ప్రతినిధినైనట్లు అచ్చెన్నాయుడుతో పాటు ధర్మాన సోదరులు ఓ పథకం మేరకు కూన రవికుమార్‌కు మంత్రి పదవి రాకుండా చేస్తున్నారన్న కోణంలో ప్రెస్‌మీట్ ఇచ్చారు. వాస్తవానికి దువ్వాడ రంగప్రవేశం చేయనంత వరకు కూన రవికుమార్‌కు కులాలకు అతీతంగా మద్దతు లభించింది. ఆయన నియోజకవర్గంలో వెలమలు కూడా సోషల్‌మీడియాలో వచ్చిన ట్రోల్స్‌కు దూరంగా ఉన్నారు. కానీ దువ్వాడ శ్రీను ఇది కేవలం కాళింగులు, వెలమల సమస్యగానే చిత్రీకరించడంతో పాటు కూన రవికుమార్‌ను దువ్వాడ శ్రీను సర్టిఫై చేయడం వల్ల కూనకు అంతవరకు ప్రజల్లో ఉన్న సానుభూతి తగ్గిపోయింది. దివ్వెల మాధురితో నిత్యం రీల్స్, యూట్యూబ్ స్టూడియోలో ముద్దూముచ్చట్లు పెట్టుకునే దువ్వాడ శ్రీను వకాల్తా పుచ్చుకోవడంపై స్వయంగా కాళింగ సామాజికవర్గం నుంచే అంతవరకు మద్దతు తెలిపినవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాజకీయంగా తన ప్రాబల్యం కులంలో తగ్గిపోతుందని భావించిన దువ్వాడ శ్రీను ఈ వ్యవహారంలో కాళింగులకు పెద్దన్నగా మారాలని చూశారు. కానీ అది తెలియకుండానే రవికి నష్టం చేకూర్చింది. వాస్తవానికి రవికి, దువ్వాడ శ్రీనుకు మధ్య అనుబంధం లేదు. ఆ మాటకొస్తే ఆ నియోజకవర్గంలో సీతారామ్‌తో దువ్వాడకు సత్సంబంధాలుండేవి. ఈ కథలో వెలమలను తెర మీదకు తేవడం కంటే ధర్మాన సోదరులను మరోసారి బహిరంగంగా తిట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేకే దువ్వాడ ప్రెస్‌మీట్ పెట్టినట్టు కనిపిస్తుంది. కూన రవికి మంత్రి పదవి రాకుండా ధర్మాన ప్రసాదరావు అడ్డుకున్నారన్న ఆయన వాదనలో ఏమాత్రం పస కనిపించలేదు. అందుకు ఆయన ఆధారాలూ చూపించలేదు. దువ్వాడ లెక్క మేరకు తన సామాజికవర్గానికే చెందిన అచ్చెన్నాయుడు పదవిలో ఉండటమే ధర్మానకు ఇష్టమని ప్రజలకు చెప్పాలని చూశారు. కానీ ఎర్రన్నాయుడు 2012లో మరణించక ముందు నుంచే కింజరాపు కుటుంబంతో ధర్మానకు సంబంధాలు తెగిపోయాయి. కాకపోతే అచ్చెన్నాయుడి సోదరుడు హరివరప్రసాద్‌తో ధర్మానకు కొన్ని లింకులున్న మాట వాస్తవం. తాజాగా ధర్మాన మేనత్త ఇంటి నుంచి కింజరాపు ఇంటికి పిల్లనిచ్చిన మాటా వాస్తవం. అచ్చెన్నాయుడు, కూన రవిల్లో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని అడిగితే కూన రవికే ధర్మాన మొగ్గు చూపుతారనేవారూ లేకపోలేదు. శత్రువుకు శత్రువుకు మనకు మిత్రుడన్న యుద్ధనీతి ధర్మాన ప్రసాదరావుకు తెలిసినంతగా ఈ జిల్లాలో మరొకరికి తెలియదు. ఒకే పార్టీలో ఉన్న తమ్మినేని సీతారామ్‌కు చెక్ పెట్టాలంటే ఆ నియోజకవర్గంలో కూన రవికుమార్‌కు బలం పెరగాల్సిన అవసరం ఉందని ధర్మాన భావించొచ్చు. రెండో కోణంలో తాను మంత్రి కానప్పుడు తన పక్క పార్టీలో ఎవరు మంత్రి అయినా, కాకపోయిన తనకొరిగేదేమీ లేదన్న భావనతో అందులో తలదూర్చే అవకాశం లేకపోలేదు. కానీ ఇందులోకి ధర్మాన సోదరులను తీసుకువచ్చి దువ్వాడ కాళింగులకు నాయకుడన్న పేరు తెచ్చుకోవాలని చూశారు. అదే నిజమైతే తన రాజకీయ జీవితం ప్రారంభించిన దగ్గర్నుంచి అనేక పార్టీల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన దువ్వాడ శ్రీను తన సామాజికవర్గ ఓటర్లే ఎక్కువగా ఉన్న టెక్కలి నియోజకవర్గంలో ఎందుకు ఓడిపోతున్నారు? ఇక తాను మరోసారి రాష్ట్రమంత్రి అయినా, తనకు ఇన్నాళ్లూ ప్రత్యర్థిగా వ్యవహరించిన దువ్వాడ శ్రీను మీద అచ్చెన్నాయుడు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అగ్రెసివ్‌గా వ్యవహరించిన వైకాపా నేతలందర్నీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కటకటాల వెనక్కి నెడుతోంది. కానీ దువ్వాడ శ్రీను మాత్రం స్వేచ్ఛగానే రీల్స్ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఆయన్ను అరెస్ట్ చేసి నియోజకవర్గంలో కాళింగులకు ఆయన్ను నాయకుడ్ని చేయడం అచ్చెన్నకు ఇష్టంలేదు. దీన్నే అచ్చెన్న, దువ్వాడ టైఅప్ అయ్యారన్నవారూ లేకపోలేదు. జిల్లాపరిషత్ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ టెక్కలిలో దువ్వాడ శ్రీను ఇంటికి వెళ్లి మరీ భార్యభర్తలను తీసుకువచ్చి నామినేషన్ వేయించారు. ఇప్పుడు కృష్ణదాస్ ముసలినక్క అంటూ దువ్వాడ శ్రీను వ్యాఖ్యానించారు. వైకాపాలో జగన్మోహన్‌రెడ్డి శ్రీనుకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసిన కృష్ణదాస్ గడిచిన వైకాపా పాలన మొత్తం శ్రీనును ముద్దుగానే చూసుకున్నారు. కానీ ఇప్పుడు కులానికి నాయకుడు కావాలన్న కోణంలో ఆయన ఎప్పటి మాదిరిగానే ధర్మాన సోదరుల మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. వాస్తవానికి సౌమ్య, కూన రవికుమార్ ఎపిసోడ్‌లో కులం కోణం లేదు. ఒకవేళ ఉందీ అంటే.. అది రవికుమార్ సొంత సామాజికవర్గానికి చెందిన ఏపీసీ శశిభూషణ్ తప్పిదం ఒక్కటే. రవికుమార్ ఇండియాలో లేని సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్న కథనాలు రావడంతో అమెరికాలో ఉన్న కూన రవికి ఏపీసీ ఇక్కడ జరగనివన్నీ జరిగినట్లు చెప్పడంతో అప్పటికే ముఖ్యమంత్రి ఆగ్రహించారన్న ఫ్రస్టేషన్‌లో ఉన్న కూన రవి విశాఖ ఎయిర్‌పోర్టులో దిగీ దిగగానే ఏపీసీ చెప్పిన మాటలు వీడియా ముందు వల్లెవేశారు. ఇక్కడే ఆయన తప్పటడుగు పడిరది. దువ్వాడ శ్రీను దీనిని వెలమలకు, కాళింగులకు ముడిపెడితే, కూన సామాజికవర్గానికే చెందిన చింతాడ రవి కూన రవికుమార్ పరాయి మహిళల భుజంపై చెయ్యి వేసి ఫొటో తీసుకున్నారంటూ మరో అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. దీనికి కౌంటర్‌గా తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు వచ్చిన మహిళలందరూ తనతో తీయించుకున్న మహిళలందరి ఫొటోలను కూన రవికుమార్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. దువ్వాడ శ్రీను మరో మహిళతో సహజీవనం చేసిన పుణ్యానికి ఇప్పుడు కూన రవి తనతో ఫొటోలో ఉన్నవారంతా అక్కాచెల్లెళ్లని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
``










Comments