top of page

నిశ్శబ్దంగా పాతుకుపోతున్న ‘అవినీతి మహమ్మారి’

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 days ago
  • 2 min read

అవినీతికి ఒక విచిత్రమైన స్వభావం ఉంటుంది. అది ఒక్క పెద్ద కుంభకోణంతో అర్ధరాత్రి వేళ ముసుగు తీసి తన రాకను సగర్వంగా ప్రకటించదు.. నిశ్శబ్దంగా, నెమ్మదిగా ప్రజల దైనందిన జీవితాల్లోకి చొరబడుతుంది. ఒక ప్రశ్నాపత్రం లీకేజీ, కూలిపోయే వంతెన, కూలిపోయిన రోడ్డు, సందేహాస్పదమైన ప్రభుత్వ ఒప్పందం, అధికార యంత్రాంగం డిమాండ్ చేసే లంచం... ఇలా ఒక్కో చిన్న పరిణామం రూపంలో సమాజంలోకి ప్రవేశిస్తుంది. మనం మేల్కొనేలోపే అది మన జీవితంలోని ప్రతి రంగంలో, ప్రతి క్షణంలో లోతుగా పాతుకుపోతుంది. నేడు సరిగ్గా ఇటువంటి క్లిష్టమైన, ప్రమాదకరమైన పరిస్థితినే మనం ఎదుర్కొంటున్నాం.

2014 సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి యూపీఏ పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ ప్రకంపనాన్ని సృష్టించాయి. ఆ అంశాన్ని రాజకీయంగా సద్వినియోగం చేసుకుంటూ బీజేపీ-ఆరఎసఎస్ కూటమి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజల ముందుకు వచ్చింది. కానీ పన్నెండేళ్ల తర్వాత చిత్రం మారింది. వరుస పరీక్షా పత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డెక్కడం, ఇథనాల్ మిశ్రమ విధానంలో ప్రజాప్రయోజనాలను పక్కన పెట్టడం, అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణపై వచ్చిన విమర్శలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్న నిశ్శబ్దం, ఉదాసీనత అనేక ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

2011 నుంచి 2026 మధ్య భారతంలో అవినీతి ప్రాథమిక స్వరూపమే పూర్తిగా మారిపోయింది. గతంలో అవినీతి అంటే.. రాజకీయ నాయకులు ఇచ్చిన కాంట్రాక్టులు, లైసెన్స్‌ల ద్వారా సొమ్ములు సంపాదించుకోవడం. ఇచ్చినందుకు ఇంత, పుచ్చుకున్నందుకు ఇంత అని బేరం పెట్టుకోవడం. ఇప్ప్పుడా దశ మారిపోయింది. అన్నిచోట్లా క్విడ్ ప్రో కో కనిపిస్తుంది. తమ కళ్ల ముందే రాజకీయ నాయకులు, బడా వ్యాపారవేత్తలు ధనవంతులుగా మారిపోవడం చూసి చిల్లర స్థాయిలోనూ అవినీతి పెరిగిపోయింది. రేషన్ కార్డులు, భూ రికార్డులు, లైసెన్సుల కోసం ఇచ్చే చిన్నపాటి లంచాలు ఇందుకు ఉదాహరణ. పెద్ద స్థాయిలో జరిగే ప్రకృతి వనరుల కేటాయింపులు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో జరిగే వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చిన్నవారికి ప్రేరణగా మారిపోయాయి.

నేడు నిరంతరం లీకవుతున్న పరీక్షా పత్రాలు, వరుసగా కూలిపోతున్న బ్రిడ్జిలు, రోడ్లు, చివరికి జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) వంటి ఉన్నతాధికారులే కోట్ల రూపాయల లంచం కేసుల్లో సీబీఐకి చిక్కడం వంటి సంఘటనలు చిన్న-పెద్ద అవినీతి మధ్య ఉన్న గీతను చెరిపివేశాయి. అవినీతి వ్యవస్థ ప్రాథమిక పునాదులనే పుచ్చిపోయేలా చేసే ప్రమాదకర విషంగా మారింది. ఉదాహరణకు, ఒక విద్యార్థి నేడు పరీక్షకు హాజరవుతున్నప్పుడు ‘నేను బాగా చదివానా?’ అని కాకుండా, ‘ఈ వ్యవస్థ నాకు న్యాయం చేస్తుందా?’ అనే భయంతో జీవించాల్సి రావడం ఈ నైతిక పతనానికి పరాకాష్ట. అయితే, అవినీతి ఇంత స్పష్టంగా దైనందిన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నప్పటికీ, 2011 నాటి అన్నా హజారే ఉద్యమం వంటి దేశవ్యాప్త ప్రజా పోరాటం నేడు ఎందుకు సాధ్యపడటం లేదు?

ప్రజా ఉద్యమానికి అవసరమైన స్తంభాల్లో ఒకటైన మీడియా ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. లేకపోతే ప్రభుత్వాలే బలవంతంగా మార్చాయి. దీంతో అవన్నీ మౌనాన్ని ఆశ్రయించాయి.

నైతిక ఆధిక్యత కలిగిన ప్రతిపక్షం ఇప్ప్పుడు లేదు. అప్పట్లో యÖపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుస్పష్టమైన నైతిక బలం ఉన్న ప్రత్యామ్నాయం (బీజేపీ/అన్నా బృందం) కనిపించింది. నేటి ప్రతిపక్షాలపై అనేక ఆరోపణలు ఉండటంతో, వారిలో నైతిక ఆధిక్యత లోపించింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ బలహీన నాయకుడిగా ముద్రపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత నిజాయితీపై ప్రజల్లో బలమైన నమ్మకం ఉండటంతో ప్రతికూల చర్చలు చల్లారుతున్నాయి.

చివరగా, నాయకత్వంపై ఉన్న వ్యక్తిగత విశ్వాసం ఒక వైపు రక్షణగా నిలుస్తున్నప్పటికీ, నిరంతర అవినీతి ఆరోపణలపై లభిస్తున్న అసాధారణ మౌనం వ్యవస్థకు శ్రేయస్కరం కాదు. ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది, కానీ నిరసనలతో ఏ మార్పూ రాదనే నిరాశ వారిని అలముకుంది. అవినీతిని మన జీవితంలో తప్పనిసరి, సహజమైన భాగంగా అంగీకరించడం ప్రారంభించామా? రాజకీయ నిశ్శబ్దం మన ప్రజాస్వామ్య ప్రాథమిక విలువలను దెబ్బతీస్తోందా? అనేది ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన ప్రశ్న.

 
 
 

1 Comment


Madina Sylani khajasha
Madina Sylani khajasha
3 days ago

Point is to stop corruption or talk against currpption both will lead to huge backlash due to one non biological persons puja people scared to voice against government s as governments are ready to listen they attack back again due to no of blind devotees support them what ever they do 15 year small girl forcely said sorry by tv . Its foolishness still we support our leader because he is the survivor of our dharma .

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page