top of page

ఫేక్ ఎండార్స్‌మెంట్లు.. అసలు రిజిస్ట్రేషన్లు

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 6 hours ago
  • 3 min read
  • సంతకాలన్నీ ఫోర్జరీ.. ఒక్కటీ అసలు కాదు

  • భూమి మీది.. పత్రం మాదే

  • శ్రీకాకుళంలో చెలరేగిపోతున్న భూబకాసురులు

  • విశాఖ-ఎ కాలనీలో నుంచి ఎస్‌బీఐ కాలనీ రిజర్వ్ సైట్ వరకు నకిలీల హల్‌చల్

  • బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి అధికారులు

  • విచారణలతో బయటపడుతున్న అక్రమాలు

     

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

  • నగరంలోని బలగలో సర్వే నంబర్ 254/1లో 2,800 చదరపు అడుగుల నగరపాలక సంస్థకు చెందిన రిజర్వు సైట్‌ను వజ్జ రాములమ్మ అనే మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఫేక్ ఎండార్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వ రిజర్వు స్థలాన్ని సొంతం చేసుకున్నట్లు గుర్తించారు. రెవెన్యూ అధికారులు బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసి సదరు సర్వే నంబర్‌లో లావాదేవీలు చేపట్టకుండా ఫ్రీజ్ చేయాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి లేఖ రాశారు.

  • బలగలోని సర్వే నంబర్ 255/5లో 30 సెంట్ల భూమిని వాస్తవ హక్కుదారుడికి తెలియకుండా సాధు శివనారాయణ అనే వ్యక్తి తహసీల్దార్ జారీ చేసినట్లు ఒక ఫేక్ ఎండార్స్‌మెంట్‌ను తయారు చేయించి శ్రీకాకుళం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు బాధితుడు యతిరాజులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో నకిలీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఫేక్ ఎండార్స్‌మెంట్‌గా నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

  • నగరంలోని గుజరాతీపేటలోని సర్వే నంబర్ 154/3లో ఉన్న స్థలాన్ని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన నక్క రామకృష్ణ ఎండార్స్‌మెంట్ తయారు చేసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ ఎండార్స్‌మెంట్‌ను తహసీల్దార్ జారీ చేశారా లేదా అన్న విషయాన్ని తెలియజేయాలని రెవెన్యూ అధికారులను కోరగా, అది ఫేక్ అని తహసీల్దార్ కార్యాలయ అధికారులు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • 80 అడుగుల రోడ్డులో నగరంలో అత్యంత విలువైన టౌన్ సర్వే నంబర్ 408 (ఆర్.ఎస్ నంబర్ 493)లోని భూమిని సాధు మోహనరావు అనే వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం జారీ చేసినట్లు ఒక ఎండార్స్‌మెంట్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు వాస్తవ హక్కుదారుడు పోలినాయుడు ఫిర్యాదు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి విచారణ జరపగా అది ఫేక్ అని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

  • మొన్నటికి మొన్న స్థానిక ASN కాలనీకి ఆనుకొని ఉన్న ఎస్‌బీఐ కాలనీలో రిజర్వ్ సైట్‌ను కొందరు ప్రబుద్ధులు వేరే వ్యక్తికి అమ్మేశారు. కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూత్రధారులను పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఓ డాబా ఇంటికి ఇప్పటి వరకు యజమానులమంటూ పదిమంది అమ్మకానికి పెట్టారు. ఇందులో కొందరైతే ఏకంగా తహసీల్దార్ తమకు ఎండార్స్‌మెంట్ ఇచ్చారంటూ పొట్నూరు వెంకటగణేష్ అనే వ్యక్తికి ఓ కాగితాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. కాదు కాదు ఈ స్థలం తమదేనంటూ కొందరు రాజకీయ నాయకులు కూడా అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి డాక్యుమెంట్ ప్రకారం ఈ భవనం సీహెచ్ వెంకటేశ్వర పట్నాయిక్‌దని తెలుసుకున్నారు. అయితే ఈయన ఎవరు? ఎక్కడుంటారు? వారసులెవరు? అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కాకపోతే విశాఖ`ఎ కాలనీ ప్రారంభంలో ఉన్న ఈ ఆస్తి విలువ ఎలా కాదుకున్నా రూ.1.50 కోట్లు పైబడి ఉంటుంది. సుదీర్ఘ కాలంగా యజమానులు కనిపించకపోవడంతో సీహెచ్ వెంకటేష్ పట్నాయిక్ అనే ఒక బినామీని తెర మీదకు తెచ్చారు. కాకపోతే ఒరిజినల్ ఓనర్ పేరు చౌదరి వెంకటేశ్వర పట్నాయిక్ కాగా, ఇక్కడ తెరమీదకు తెచ్చిన బినామీ పేరు చింతనిప్ప్పుల వెంకటేష్ పట్నాయిక్. వయసు 58 ఏళ్లు. కాకపోతే ఒరిజినల్ ఓనర్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజర్ కాగా, బినామీ చింతనిప్ప్పుల వెంకటేష్ పట్నాయిక్ నిసాని. కూడబలుక్కుని పేరు మాత్రం రాయగలడు. చౌదరి వెంకటేశ్వర పట్నాయిక్‌కు సర్వే నెంబరు 10లో 3219/2006 డాక్యుమెంట్ ద్వారా ఈ ఆస్తి దఖలుపడింది. కానీ మన బినామీ అడ్రస్ మాత్రం నానుబాలవీధి డోర్ నెంబరు 4`47లో చింతనిప్ప్పుల కామేశ్వరరావు పట్నాయిక్ (లేటు) కుమారుడుగా చూపిస్తున్నారు. ఆయన అమ్మితే పొట్నూరు వెంకట గున్నరాజు కొనుక్కున్నారట. ఒరిజినల్ ఓనర్ ముంబయిలో ఉండటం వల్ల ఈ ఆస్తికి పదిమంది బినామీలు పుట్టుకొచ్చారు. ఇందులో స్వయంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్‌లు చేస్తున్న ఓ కాంట్రాక్టర్ కమ్ తెలుగుదేశం నాయకుల బంధువు కూడా ఉండటం గమనార్హం. ఇది తమదంటే తమదని, బిల్డింగ్‌ను కూలదోసి స్థలాన్ని అమ్మేయడానికి ప్రయత్నాలు జరుగుతుండటంతో ప్రస్తుతం మిగిలిన సగం భవనమే ఇక్కడ కనిపిస్తుంది. ఈలోగా ముంబయిలో ఉన్న యజమానికి ఉప్పందడంతో ఆయన తహసీల్దార్ కార్యాలయానికి ఎండార్స్‌మెంట్లపై ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులు ఆగితే ఈ కేసులో కూడా అరెస్టులు చూడొచ్చు.

నకిలీ ఎండార్స్‌మెంట్‌లతో రిజిస్ట్రేషన్లు చేయడం ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో ఎక్కువైంది. తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ చేసినట్లు ఎండార్స్‌మెంట్‌ను సృష్టించి పక్కవారి స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు నగరంలో జోరుగా సాగుతున్నాయి. గతంలో నకిలీ ఎండార్స్‌మెంట్‌లపై ఫిర్యాదులు రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని అధికారులు ఎండార్స్‌మెంట్‌లను తహసీల్దార్ కార్యాలయానికి పంపించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. ఆ తర్వాత నేరుగా ఎండార్స్‌మెంట్‌ను తహసీల్దార్ కార్యాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన ఈమెయిల్‌లో పోస్ట్ చేయించేవారు. ఆ తర్వాత కాలంలో దీన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు గాలికొదిలేశారు.

ఇటీవల ఆమదాలవలస వైకాపా నాయకుని కుటుంబం ఫేక్ ధ్రువీకరణ పత్రాలతో నగరంలోని వరం కాలనీలో విలువైన స్థలాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేశారని ఆరోపణలు రావడం, పోలీసులు కేసులు నమోదు చేయడంతో నగరంలోని భూ యజమానులు ఉలిక్కిపడ్డారు. దీంతో నగరంలో ఫేక్ ఎండార్స్‌మెంట్‌తో కొందరు వ్యక్తులు ఇతరులకు చెందిన స్థలాలను కాజేశారు. ఫేక్ ఎండార్స్‌మెంట్‌లపై పోలీసులకు, తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిసింది.

నకిలీ ఎండార్స్‌మెంట్‌లను తయారు చేసే వ్యక్తులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందితో చనువుగా ఉంటూ వ్యవహారం నడుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలను తయారు చేసిన వ్యక్తులే దగ్గరుండి అధికారులకు చెప్పి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని చర్చ నడుస్తోంది. తహసీల్దార్ జారీ చేసినట్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చిన సుమారు 10 ఎండార్స్‌మెంట్‌లు 2025లోనే జారీ చేసినట్లు చూపించడం విడ్డూరం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page