top of page

నెహ్రూ అలీన విధానం..ఆగిన నేపాల్‌ విలీనం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 13, 2025
  • 3 min read
  • భారత్‌లో కలపాలని 1950లోనే రాజు త్రిభువన్‌ ప్రతిపాదన

  • చైనా నుంచి ఒత్తిడి భయంతో తిరస్కరించిన నాటి ప్రధాని

  • ఇందిర హయాంలో వచ్చినా.. అడ్డుకున్న ఆ దేశంలోని అస్థిరత

  • తన ఆటో బయోగ్రపీలో వెల్లడిరచిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌

  • ఆనాటి తప్పిదాల కారణంగానే నేడు ఎన్నో సరిహద్దు సవాళ్లు

అందివచ్చిన అవకాశాన్ని వదులుకోరాదంటారు పెద్దలు.. కానీ స్వతంత్ర భారత మొదటి ప్రధాన మంత్రి నెహ్రూ అటువంటి ఒక మహత్తర అవకాశాన్ని కాలదన్నేశారట! అదీ ఆయన సొంత విషయాల్లో కాదండోయ్‌.. మన దేశానికి సంబంధించిన కీలకమైన అంశంలేనేనట. హిమాలయ దేశంగా పేరొందిన నేపాల్‌ ఒకప్పుడు భారత్‌లో విలీనం కావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అయితే నాటి భారత ప్రధాని, నవభారత నిర్మాతగా పేరుగాంచిన జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించి పెద్ద తప్పే చేశారు. ఇక స్వాతంత్య్రానికి ముందు దేశ విభజనకు అనుకూలంగా కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకునేలా చేసిన నెహ్రూ.. ప్రధానమంత్రి అయ్యాక నేపాల్‌ విషయంలో అటువంటి పొరపాటే చేశారు. ఈ విషయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ఆటోబయోగ్రఫీ అయిన ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ పుస్తకంలో నాటి వ్యవహారాలను వివరించారు. ప్రస్తుతం నేపాల్‌లో యువతరం తిరుగుబాటు నేపథ్యంలో నాటి విషయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నాడు నేపాల్‌ను విలీనం చేసుకుని ఉంటే అది మనదేశంలో ఒక రాష్ట్రంగా ఉండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

బ్రిటిష్‌ వలస పాలన నుంచి విముక్తి పొందే సమయంలో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ దేశ విభజనకు అంగీకరించింది. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండుకు, బ్రిటీషర్ల ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్‌ ప్రత్యేక దేశంగా ఏర్పడటానికి కారణమైంది. ఆ పాకిస్తానే ఇప్పుడు మనకు శత్రువై కూర్చుంది. అదేవిధంగా భారత్‌లో విలీనమవుతామని.. తమ ప్రాంతాన్ని ఒక ప్రావిన్సులా చూడాలని బతిమాలిన నేపాల్‌ను అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదు పొమ్మంది. నెహ్రూ ఆధ్వర్యంలో తీసుకున్న ఈ రెండు నిర్ణయాల పర్యవసానాలతో 80 ఏళ్ల తర్వాత కూడా భారతదేశం ఇబ్బంది పడుతూనే ఉంది. ప్రణబ్‌ ముఖర్జీ తన ఆటో బయోగ్రఫీలో పేర్కొన్న అంశాల ప్రకారం.. నేపాల్‌లో రాణా ప్రాబల్యాన్ని అంతం చేసిన తర్వాత ఆ దేశ రాజు త్రిభువన్‌ బీర్‌ బిక్రమ్‌ షా తమ దేశాన్ని భారత్‌తో విలీనం చేస్తామని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ఆమోదించి ఉంటే నేపాల్‌ను భారత ప్రావిన్స్‌గా మార్చడం ద్వారా హిమాలయ ప్రాంతంలో దేశ భద్రత మరింత బలోపేతమయ్యేది. అయితే అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

జరిగిందేమిటంటే..

రాచరికంలో ఉన్న నేపాల్‌లో రాణా కుటుంబం శతాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించింది. 1940 దశకం చివరి వరకు అది కొనసాగింది. ఆ దేశ అసలు రాజు త్రిభువన్‌ షా భారత్‌లో ప్రవాసంలో ఉంటూనే రాణాల ఆధిపత్యాన్ని అంతమొందించి 1950లో తిరిగి అధికారాన్ని పొందారు. అదే సమయంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం తలెత్తి ఆ పార్టీ శకం మొదలైంది. ఆ వెంటనే టిబెట్‌ను చైనా ఆక్రమించింది. చైనా దుడుకు వైఖరితో ఎదురవుతున్న సవాళ్లు తమ దేశ భద్రతను, స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేస్తాయని భావించిన రాజు త్రిభువన్‌ చైనా నుంచి తన నేపాల్‌ను రక్షించాలంటే భారత్‌లో కలిసిపోవడమే మార్గమన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఢల్లీికి వచ్చి ప్రధానమంత్రి నెహ్రూను కలిసి తన ప్రతిపాదనను ముందు పెట్టారు. నేపాల్‌ను భారత్‌లో ప్రావిన్స్‌గా విలీనం చేయాలని కోరారు. 1950 నాటి ఇండో-నేపాల్‌ శాంతి, స్నేహ ఒప్పంద సమయంలో ఇది జరిగిందని ప్రణబ్‌ ముఖర్జీ తన పుస్తకంలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక, భద్రతా సహకారానికి బాటలు వేసినప్పటికీ.. నేపాల్‌ విలీన ప్రతిపాదనకు నెహ్రూ అంగీకరించకపోవడం వల్ల ఆ దేశం మన అంతర్భాగమయ్యే అవకాశాన్ని కోల్పోయాం.

చైనా భయమే కారణం?

నేపాల్‌ స్వతంత్ర దేశంగానే ఉండాలని.. అది భారత్‌లో కలపకూడదని నెహ్రూ స్పష్టం చేశారు. విలీన ప్రతిపాదనను ఆయన తిరస్కరించడానికి తగిన కారణాలు ఉన్నాయంటున్నారు. నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నాన్‌`అలైన్‌మెంట్‌ అంటే అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అందులో భాగంగానే చైనాతో సంబంధాలు మెరుగుపరచాలని, హిమాలయ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని భావించారు. నేపాల్‌ ను విలీనం చేసుకుంటే చైనా ఎక్కడ ఆగ్రహించి భారత్‌పై ఒత్తిడి పెంచుతుందేమోనని భయపడ్డారని అంటున్నారు. పాకిస్తాన్‌ విడిపోయిన తర్వాత భారత్‌లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుండగా అదే సమయంలో వచ్చిన నేపాల్‌ విలీన ప్రతిపాదన జాతీయవాదుల మద్దతు పొందినా కాంగ్రెస్‌లోని సెక్యులర్‌ వర్గాలు వ్యతిరేకించాయి. ఇది బ్రిటిష్‌, అమెరికన్‌ జోక్యాన్ని ప్రేరేపిస్తుందని ఆ వర్గాలు భయపడటమే దీనికి కారణమంటున్నారు. కాగా నెహ్రూ స్థానంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉంటే ఈ సువర్ణావకాశాన్ని ఆమె కచ్చితంగా వినియోగించుకునేవారని తన పుస్తకంలో ప్రణబ్‌ వ్యాఖ్యానించారు. 1975 ఇందిర హయాంలోనే జరిగిన సిక్కిం విలీనాన్ని ఆయన ప్రస్తావించారు. సిక్కిం చోగ్యాల్‌ రాజు చక్రీ తోబ్దెన్‌ ప్రతిపాదన, అక్కడి జనాభిప్రాయం ఆధారంగా ఆ దేశంలో భారత్‌లో 22వ రాష్ట్రంగా విలీనమైంది. ఇందిర హయాంలో నేపాల్‌లో కూడా విలీన ప్రతిపాదన మళ్లీ వచ్చినా ఆ సమయంలో ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా అది అమలుకు నోచుకోలేదని ముఖర్జీ పేర్కొన్నారు. విలీనం అమలు కాకపోవడంతో నేపాల్‌లో చైనా ప్రభావం పెరిగిపోయింది. ఇది భారత్‌కు హిమాలయ ప్రాంత రక్షణలో ఇబ్బందికరంగా మారింది. నేపాల్‌ ప్రపంచంలోనే ఏకైక అధికారిక హిందూ రాజ్యం. భారత్‌లో 80 శాతం హిందువులే ఉన్నప్పటికీ.. దాని సెక్యులర్‌ రాజ్యంగం (1976 సవరణ) హిందూ దేశ విలీనాన్ని సున్నితమైన రాజకీయ సమస్యగా మార్చేస్తుందన్నది సెక్యూలరిస్టుల వాదన. నెహ్రూ నిర్ణయం ఈ సెక్యులర్‌ లైన్‌ను కాపాడిరదన్న వాదనలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page