top of page

నకిలీ దివ్యాంగులకు ఝలక్

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jul 31
  • 2 min read
  • నోటీసులు అందినా హాజరు కాని లబ్ధిదారులు

  • తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు సెర్ప్‌ ఎస్‌ఎంఎస్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

సదరం సర్టిఫికెట్‌ పొంది దివ్యాంగుల పింఛన్‌ తీసుకుంటున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రaలక్‌ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్లలో అక్రమాలను వెలికితీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి సదరం ధ్రువీకరణ పత్రాలు వెరిఫికేషన్‌ను ప్రారంభించారు. ఇంతవరకు ఉన్న సదరం సర్టిఫికెట్‌ను మరోసారి ధ్రువీకరించుకోవాలని, అందుకోసం ప్రభుత్వ ఆసుపత్రులకు సదరం పత్రాలు తీసుకొని రావాలని దివ్యాంగులందరికీ నోటీసులు పంపించారు. నోటీసులో ఎక్కడికి, ఎప్పడు హాజరు కావాలి అన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. నోటీసులు పట్టుకొని ప్రభుత్వ ఆసుపత్రులకు హాజరైన వారికి సదరం పరీక్షలు నిర్వహించి అర్హతను నిర్ధారించారు. ఇంకొందరిని రిమ్స్‌కు రిఫర్‌ చేసి సదరం పూర్తి చేసుకోవాలని వైద్యులు సూచించారు. జిల్లాలో సదరంతో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నవారు 31,330 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 25 వేల మందిని మాత్రమే వెరిఫికేషన్‌ పూర్తి చేశారు. కొంతమంది నోటీసులు అందుకున్నా హాజరు కాలేదు. అలాంటి వారందరికీ పంచాయతీ కార్యాదర్శి ద్వారా పలుమార్లు నోటీసులు అందించి సదరం ప్రత్యేక క్యాంపునకు హాజరై రీవెరిఫికేషన్‌ చేసుకోవాలని సూచించారు. అయితే పదే పదే నోటీసులు అందుకున్నా సదరం రీవెరిఫికేషన్‌కు హాజరుకాని లబ్ధిదారులకు ఆగస్టు ఒకటి నుంచి పింఛన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు సెర్ప్‌ నుంచి లబ్ధిదారుల ఫోన్‌కు సందేశం పంపిస్తున్నారు. రీవెరిఫికేషన్‌ పూర్తిచేసుకున్న తర్వాత మాత్రమే పింఛన్‌ను పునరుద్ధరించనున్నట్టు ఫోన్‌లో పంపిన సందేశంలో సెర్ప్‌ పేర్కొంది. జిల్లాలో ఇప్పటి వరకు 6వేల మంది సదరం రీవెరిఫికేషన్‌ చేసుకోవాలి. వీరికి సెప్టంబర్‌ వరకు గడువు ఉంది. అయితే వీరిలో 50శాతం మంది మాత్రం నోటీసులు అందుకున్నా రీవెరిఫికేషన్‌కు హాజరు కాలేదని అధికారులు చెబుతున్నారు. గురువారం రిమ్స్‌లో నిర్వహించిన సదరం రీవెరిఫికేషన్‌కు 150 మంది దివ్యాంగులు హాజరయ్యారు. వీరికి వైద్యులు భౌతిక పరీక్షలు నిర్వహించి రీవెరిఫికేషన్‌ చేస్తున్నారు. వీరంతా పింఛన్‌ నిలిచిపోతుందని ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మాత్రం ఎన్ని పింఛన్లను తాత్కాళికంగా నిలిపేస్తుందన్నది ఇప్పటికీ స్పష్టం చేయలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. శుక్రవారం ఆగస్టు నెలకు సంబంధించిన పింఛన్లు పంపిణీ కానుండడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు.

20 టీమ్‌లు పరిశీలన

నకిలీ సదరం సర్టిఫికెట్లతో చాలామంది వికలాంగుల పింఛన్లు పొందుతున్నారంటూ ప్రజాగ్రీవెన్స్‌లో అనేకసార్లు ఫిర్యాదులు అందాయి. ఆ మేరకు చూసుకుంటే వేలకొలదీ గత ప్రభుత్వ హయాంలో నకిలీ వికలాంగులు పింఛన్లు పొందుతున్నారు. మరికొందరైతే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఈ సర్టిఫికెట్ల మీదే చేస్తున్నారు. మరోవైపు కొత్తగా వికలాంగ పింఛన్లకు దరఖాస్తు చేసుకోడానికి ప్రతీ గురువారం రిమ్స్‌తో పాటు ప్రభుత్వం నిర్దేశించిన పీహెచ్‌సీల్లో వికలాంగులు బారులుతీరుతున్నారు. ఇందులో పింఛనుకు పూర్తిస్థాయి అర్హత ఉన్నవారు చాలామంది ఉన్నారు. నకిలీ పింఛన్లు తొలగిస్తే గాని, కొత్తవి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొనడంతో సెర్ప్‌ తాజాగా 20 టీమ్‌లు పరిశీలించి ఇచ్చిన నివేదిక మేరకు వారి మొబైల్‌ ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌ పంపింది. వీరిలో అధిక శాతం మంది స్థానిక రాజకీయ నాయకులను ఆశ్రయించి ఇన్నాళ్లూ రక్షణ పొందుతూవచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ సర్టిఫికెట్‌ పునరుద్ధరించుకోకపోతే పింఛను తీసేస్తామని పేర్కొనడంతో ఆసుపత్రుల వద్ద బారులుతీరిన క్యూలైన్లు కనిపిస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page