నడిరోడ్డు మీద అరాచకం
- Prasad Satyam
- Dec 16, 2025
- 2 min read
పట్టపగలే ప్రాణాలు పోయేటట్టు కొట్టారు
ఒడిశా నుంచి బిర్యానీ సెంటర్ పేరుతో వచ్చి రౌడీయిజం
రిమ్స్ జనరల్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు బాధితులు
స్థానికంగా కుట్లు వేయించుకుని ఫిర్యాదుకు దూరంగా ఉన్న మరో బాధితుడు
పరారీలో నిందితులు
కిన్నెర జంక్షన్ వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
బతుకుతెరువు కోసం ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి శ్రీకాకుళం వచ్చి ఇక్కడ రెండు బిర్యానీ పాయింట్లు ఏడాది క్రితం ప్రారంభించి రెండు చేతులా సంపాదించడం మొదలైన తర్వాత స్వయంగా తమ వ్యాపారానికి సహకరిస్తున్న కస్టమర్లపైనే విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన 24 గంటల తర్వాత వెలుగులోకి వచ్చింది. స్థానిక కిన్నెర థియేటర్ ఎదురుగా ఉన్న వైన్‌షాప్ పక్కన నజీరా బిర్యానీ సెంటర్‌లో బిర్యానీ మాస్టర్‌గా పని చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎదురుగా ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి సోయాసాస్ తీసుకున్నాడు. వీరి దగ్గర కిరాణా వర్తకులు బిర్యానీ కొనడం, కిరాణా షాపులో సాస్, నూనె ప్యాకెట్లు కొనడం కొద్ది రోజులుగా జరుగుతోంది. అందులో భాగంగానే సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సోయాసాస్ కోసం వెళ్లిన బిర్యానీ మాస్టర్ హిందీలో కిరాణా షాపులో ఉన్నవారిని బూతులు తిట్టడం ప్రారంభించాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న షాపులో ఉన్న వ్యక్తి తన తల్లిని ఎందుకు తిడుతున్నావంటూ చెంపదెబ్బ కొట్టడంతో ఆయన్ను బలంగా చితక్కొట్టేశాడు. దీంతో గోల్కొండరేవు రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ వద్దకు వెళ్లి తలకు కుట్లు వేయించుకొని వెళ్లిపోయాడు. తన కొడుకును కిరాణా కొట్టులో ఉంటుండగానే దాడి చేస్తే ఎందుకు ఊరుకున్నారంటూ షాపు యజమాని లాడి సాయి వద్దకు వచ్చి బాధితుడి తల్లి నిలదీయడంతో ఇద్దరూ కలిసి ఎదురుగా ఉన్న బిర్యానీ పాయింట్ వద్దకు వెళ్లి ఇది పద్ధతి కాదని నిలదీశారు. ముందుగా తన చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి కచ్చితంగా తమ మీదకు దాడికి వస్తాడని భావించి నజీరా బిర్యానీ పాయింట్ యజమాని స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ వద్ద ఉన్న తన మరో బ్రాంచి సిబ్బందిని కూడా రప్పించాడు. కిన్నెర థియేటర్ ఎదురుగా ఉన్న సిబ్బంది, వీరితో పాటు నగరంలోకి వచ్చిన నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులు బలమైన కురిపీలు, బిర్యానీ కలిపే అట్లకాడలతో కిరాణా షాపు యజమాని లాడి సాయి మీద విచక్షణారహితంగా దాడి చేశారు. ఈలోగా సాయి సోదరుడు లాడి ముత్యాలు అక్కడికి వచ్చి వారించాలని చూస్తే, ఆయనపైనా మరింత బలంగా దాడి చేశారు. దీంతో ఈ దాడిలో గాయపడినవారి సంఖ్య మూడుకు చేరింది. ఇందులో లాడి సాయి, లాడి ముత్యాలు అన్నదమ్ములు కాగా, వీరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముత్యాలుకు కాలు ఫ్రాక్చర్ కాగా, తలపై మూడుచోట్ల చిట్లిపోయింది. సాయికి కూడా చిటికెనవేలుతో పాటు తలపై మూడుచోట్ల బలమైన గాయాలు ఉన్నాయి. ఘటన జరిగిన వెంటనే వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేసరికే నజీరా బిర్యానీ పాయింట్ యాజమాన్యం పరారైపోయింది. ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన ఈ నాలుగు కుటుంబాలు కూడా ఇప్పుడు పరారీలోనే ఉన్నాయి. వీరి పేర్లు ఎవరికీ తెలియదు. పోలీసులు దాడి జరిగిందని కేసు నమోదు చేసి, ఎవరు చేశారన్న దానిపై పేర్లు సేకరించే పనిలో ఉన్నారు. బిర్యానీ పాయింట్ నేమ్‌బోర్డు మీద ఉన్న నెంబరు ప్రకారం ట్రూకాలర్‌లో చెక్ చేస్తే సబిర్‌ఖాన్‌గా చెబుతోంది. అయితే ఇది ఎంతమేరకు వాస్తవమో తెలియదు. ఎందుకంటే స్థానికంగా విచారిస్తే ఇక్కడ బిర్యానీ పాయింట్ నడుపుతున్నది ఆబీద్, జహంగీర్ అని చెబుతున్నారు. వీరిద్దరే మంగువారితోటకు చెందిన ముత్యాలు, సాయిలను ప్రాణం పోయేటట్టు కొట్టారని పరిసర ప్రాంతవాసులు చెబుతున్నారు. మంగువారితోటకు చెందిన లాడి సాయి, లాడి ముత్యాలు సాయంత్రంపూట పకోడీ బండి వేసుకొని కుటుంబాన్ని నెట్టుకుంటూవచ్చారు. కొన్నాళ్ల క్రితమే కిన్నెర థియేటర్ దగ్గర కిరాణా షాపును ప్రారంభించారు.










Comments