నన్ను కదిలించేదెవరు?!
- BAGADI NARAYANARAO

- 7 days ago
- 3 min read
రివర్షన్ ఉత్తర్వులు వచ్చినా అమలుకాలేదు
డీబీసీడబ్ల్యూవోను రాజకీయంగా కాపాడుతున్నారన్న ఆరోపణలు
గత నాలుగేళ్లలో ఎన్నో ఫిర్యాదులు.. అన్నీ బుట్టదాఖలు
యథాస్థానంలో కొనసాగేందుకు తెరవెనుక యత్నాలు
ఆగని అక్రమ కార్యకలాపాలు.. పాత తేదీలతో స్కావెంజర్ల ఫైలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధను అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి స్థాయికి రివర్ట్ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాకుండా కొందరు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. వారు ఎవరన్నదే ఇప్ప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వైకాపా హయాంలో వచ్చిన అధికారులు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో కూడా అదే హోదాలో కొనసాగుతుండటం ఒక విశేషమైతే.. ఇచ్చిన పనిష్మెంట్‌ను కూడా కూటమి నేతలు తొక్కిపెట్టి ఆమెను ఇక్కడే కొనసాగించడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఆ శాఖ ఉద్యోగులే తప్ప్పుపడుతున్నారు. ఏసీబీ నమోదు చేసిన ఓ పాత కేసులో ఈమె ప్రమేయాన్ని విచారణ కమిటీ ఎస్టాబ్లిష్ చేయడంతో డీబీసీడబ్ల్యూవోను ఏబీసీడబ్ల్యూవోగా వెనక్కు పంపుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 25న జారీ అయిన ఈ ఉత్తర్వులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ వద్దే తొక్కిపెట్టి బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. మరోవైపు డీబీసీడబ్ల్యూవోగా నాలుగేళ్లుగా కొనసాగుతున్న అనురాధ తమ శాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల నిలుపుదలకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈలోగా ఆమెను రిలీవ్ చేయకుండా జిల్లా రాజకీయం కాపాడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక్కడే ఉండేందుకు నానాపాట్లు
మరోవైపు జిల్లాలోని బీసీ వసతి గృహాల వార్డెన్లను కలెక్టర్ వద్దకు పంపించి తననే కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వాలని అనురాధ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే వార్డెన్లు ఆమె సూచనలను తిరస్కరించడంతో కుల సంఘాల నాయకులను ఆశ్రయించినట్టు తెలిసింది. వారు కూడా ఆమె విన్నపాన్ని లెక్క చేయలేదని సమాచారం. దీంతో కంచిలి మండలం ఎంఎస్ పల్లి వార్డెన్ ఉపేంద్రను పురమాయించి ఆ ప్రాంతానికి చెందిన కొందరు పెయిడ్ ఆర్టిస్టులను శ్రీకాకుళం తీసుకువచ్చి అనురాధకు అనుకూలంగా వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆ శాఖలోనే చెప్ప్పుకొంటున్నారు. మరోవైపు టీడీపీ ప్రజాప్రతినిధి వ్యక్తిగత కార్యదర్శి ద్వారా అమరావతి స్థాయిలో బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ తతంగం ఒక కొలిక్కి వచ్చేవరకు ఆమెను వెనక్కు పంపవద్దని కలెక్టర్ మీద కూడా ఒత్తిడి ఉన్నట్లు ఆ శాఖలో చెప్ప్పుకొంటున్నారు. సంబంధిత శాఖ డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేశామన్న సాకుతో కాలయాపన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది. అసలు కోర్టుకు వెళ్లేవరకు వెసులుబాటు ఎందుకు ఇస్తున్నారో తెలియడంలేదని స్వయంగా వార్డెన్లే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిఫలం లేనిదే పనిచేయరు
బీసీ వసతిగృహల్లో గత నాలుగేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ‘సత్యం’తో పాటు అనేక పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఎన్నోసార్లు తెర వెనుక విచారణలు కూడా జరిగాయి. ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయని తేలినా డీబీసీడబ్ల్యూవోపై చర్యలు తీసుకోకుండా కొనసాగించడమే విడ్డూరం. ఇప్ప్పుడు స్వయంగా ఆ శాఖే ఆమెను వెనక్కు తీసుకుంటున్నా జిల్లాలో మాత్రం ఆమెను రిలీవ్ చేయడానికి ఇష్టపడటంలేదంటే తెర వెనుక బలమైన రాజకీయ శక్తే ఉండి ఉంటుంది. పదోన్నతులు, బదిలీలు, డిప్యూటేషన్లు, కారుణ్య నియామకాలు, వసతిగృహలకు ఇన్‌చార్జీల నియామకం, గ్రేడ్`1 వార్డెన్ల ప్రమోషన్లు, మెస్ బిల్లుల చెల్లింపులు, ఇంక్రిమెంట్లు, పింఛన్ క్లియరెన్స్, సెలవుల మంజూరు, వసతి గృహల మరమ్మతులు తదితర అంశాల్లో అవినీతికి పాల్పడినట్టు అనురాధపై ఆరోపణలున్నాయి. వీటిలో కొన్నింటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి బీసీ సంక్షేమ శాఖతో సంబంధం లేని వ్యక్తికి కారుణ్య కోటాలో నియామక ఉత్తర్వులు ఇచ్చిన ఉదంతంలో ఆమెపై బాధితులు గ్రీవెన్స్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినా రాజకీయ జోక్యంతో చర్యలను తొక్కపెట్టేశారు. వార్డెన్లుగా ప్రమోషన్లు పొందడానికి ఏడుగురు ఉద్యోగులు సమర్పించిన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను జెన్యూనిటీ పరిశీలనకు పంపకుండా మేనేజ్ చేసి రూ.లక్షల్లో దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ దివ్యాంగ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోకుండా వారి నుంచి బంగారు అభరణాలను బహుమతిగా పొందినట్టు ఆరోపణలున్నాయి. చివరకు రిపబ్లిక్ డే, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే ప్రశంసా పత్రాలకు ఎంపిక చేయడానికి కూడా రూ.20వేలు చొప్పున వసూలు చేసిన ఘనత ఆ శాఖ అధికారిదేనన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు పోస్టింగ్ ఇవ్వడానికి రూ.10వేలు లంచం తీసుకున్నారని డీబీసీడబ్ల్యూవోపై ఒక అటెండర్ గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా మందలింపుతో సరిపెట్టేశారు.
రివర్ట్ అయ్యాక కూడా..
ఏబీసీగా రివర్ట్ చేస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా జిల్లాలో ఏడు స్కావెంజర్ పోస్టుల భర్తీకి పాత తేదీలతో ఫైల్ సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపినట్లు తెలిసింది. ఆ ఏడుగురికి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఆమదాలవలస బాయ్స్ కాలేజీ హాస్టల్ వార్డెన్ భర్త భాస్కరరావు మధ్యవర్తిత్వం వహించినట్టు సమాచారం. అందుకోసం ఒక్కొక్కరి తరఫున రూ.1.50 లక్షలు చొప్పున ఇవ్వడానికి అంగీకారం కుదిరినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ మేరకు కలెక్టర్ వద్ద ఫైల్ పెట్టి ఓకే చేయించుకోవడానికి కలెక్టరేట్‌లోని కొందరు అధికారులతో మంతనాలు చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ఫైల్ కలెక్టరేట్‌కు చేరినట్టు సమాచారం. డీబీసీడబ్ల్యూవో అనురాధ ఇక్కడి నుంచి కదలకుండా ఆర్డర్ తెచ్చుకుంటారు. దానికి కోర్టు స్టేలు వాడుకుంటారో లేక తనను బదిలీ చేసిన డైరెక్టరేట్‌నే వాడుకుంటారో తెలియదు. ఏబీసీడబ్ల్యూవోగా వెళ్లక తప్పదనుకుంటే జిల్లాలో అన్ని కలెక్షన్లు తీసుకునే వెళ్లిపోతారు. అంతవరకు ఆమెను ఇక్కడి నుంచి పంపించే మొనగాడు కనిపించడంలేదు.






Comments