నమ్ముకున్న ‘బోయిన’కే రాజమకుటం
- NVS PRASAD

- Nov 28, 2025
- 2 min read
నమ్మకం నిలిచింది.. పట్టుదల గెలిచింది!
ఆయనకే కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి
పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు దక్కిన గుర్తింపు
మంత్రి అచ్చెన్నాయుడు పట్టుదలకు నిదర్శనం
వేరే ఆలోచనలు చేసినా.. గోవిందరాజులు వైపే అందరి మొగ్గు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పార్టీని నమ్ముకుంటే ఏ రోజుకైనా పదవులు వస్తాయనడానికి ఇదొక నిదర్శనం. నిబద్ధత కలిగిన నాయకుడు నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతవరకైనా వెళ్లి యుద్ధం చేస్తారనడానికి కూడా ఇదే నిదర్శనం. ఒకరి నిరీక్షణ.. మరొకరి పోరాటం ఫలించి రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్‌గా బోయిన గోవిందరాజులు నియమితులయ్యారు. అయితే అంత సులువుగా జరగలేదు. ఈ పదవికి మొదట గోవిందరాజులు పేరునే పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వయసు రీత్యా ఆయన పెద్దవారైపోయారు కాబట్టి యువతకు అవకాశం ఇవ్వాలన్న కోణంలో రకరకాల ఆలోచనలతో తర్జనభర్జనలు పడిరది. రాష్ట్రంలో పార్టీ పెట్టిన దగ్గర్నుంచీ కార్యకర్తగా, సర్పంచ్‌గా పని చేసి, కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, నిమ్మాడ, టెక్కలి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి ఆధిపత్యం కట్టబెడుతున్న బోయిన గోవిందరాజులుకు కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ చేయాలని పార్టీ ప్రతిపాదించినా, రాష్ట్రవ్యాప్తంగా యువతకు అవకాశం కల్పించాలన్న పార్టీ పాలసీ ప్రకారం ఆయన అభ్యర్థిత్వాన్ని పునరాలోచించాలని ప్రభుత్వం భావించింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బోయిన గోవిందరాజులుకే ఆ కార్పొరేషన్ పదవి దక్కాలన్న పట్టుదలతో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడి తేవడంతో.. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సై అనాల్సివచ్చింది. రాష్ట్రంలో కళింగకోమటి సామాజికవర్గం నుంచి టీడీపీలో ఇంతకు మించిన నాయకుడు దొరకడని అచ్చెన్నాయుడు అటు చంద్రబాబు, ఇటు లోకేష్‌ను ఒప్పించడంతో గోవిందరాజులు ఆ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో రాబిన్‌శర్మ టీమ్ జరిపిన సర్వేలో గానీ, తెలుగుదేశం అగ్రనేతలు ఆ పార్టీలో పట్టున్న మిగిలిన నాయకులతో మాట్లాడినప్పుడు గానీ గోవిందరాజులు వైపే మొగ్గు కనిపించడంతో కాస్త ఆలస్యమైనా ఆయన ఎంపిక అర్ధవంతంగా జరిగింది. అంతకుముందు యువత కోటాలో కొందరి పేర్లు సూచించాలని టీడీపీ అధిష్టానం కోరినప్పుడు అచ్చెన్నాయుడు స్వర్గీయ వరం కుటుంబ సభ్యులను పిలిచి గోవిందరాజులుకు వారి మద్దతు ఉందో లేదో అడిగి తెలుసుకున్నారు. వారు కూడా ఆయన్ను మించిన అభ్యర్థి దొరకడని అమరావతి వెళ్లి మరీ చెప్పడంతో ముందుగా ఆ కార్పొరేషన్‌కు డైరెక్టర్లను నియమించిన తర్వాత చైర్మన్‌గా బోయిన గోవిందరాజులు నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. సరిగ్గా ఈ రెండిరటికీ మధ్యలోనే ‘తల లేని మొండెం’ పేరుతో కొద్ది రోజుల క్రితం ‘సత్యం’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్ కావడంతో మిగిలిన కుల కార్పొరేషన్లతో సంబంధం లేకుండా కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్‌ను నియమిస్తూ జీవో విడుదలైంది.
అర్ధశతాబ్ద రాజకీయ ప్రయాణం
అర్ధశతాబ్ది క్రితం.. 1975లో క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన బోయిన గోవిందరాజులు 1981లో కో ఆపరేటివ్ సంఘం ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1988లో కోటబొమ్మాళి మేజర్ పంచాయతీ సర్పంచ్ అయ్యారు. ఆ పదవిలో ఏకబిగిన పద్నాలుగేళ్లు కొనసాగారు. అనంతరం ఆయన భార్య బోయిన శారదమ్మ కూడా ఈ పంచాయతీలో మూడు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది అప్పట్లో రికార్డు సృష్టించారు. తర్వాత కాలంలో కోటబొమ్మాళి పంచాయతీ బీసీలకు రిజర్వ్ కావడంతో పార్టీ ఎవరిని నిలబెట్టినా వారిని బోయిన కుటుంబం గెలిపించడం ద్వారా సత్తా చాటుకుంది. గోవిందరాజులు జిల్లా సర్పంచ్‌ల సంఘం ప్రధాన కార్యదర్శిగా, మేజర్ పంచాయతీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. విశాఖ ఉక్కు ` ఆంధ్రుల హక్కు పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు జిల్లాలో ఆ ఉద్యమానికి సంఫీుభావంగా జరిగిన రాస్తారోకోలు, బంద్‌లు వంటి ఆందోళన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో యువకుడిగా ఉన్న ఆయన జిల్లాలో యువజనులను ముందుండి నడిపించారు. 2014లో పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి తెలుగుదేశం జనరల్ సెక్రటరీగా నియమితులై 2019 వరకు పదవిలో ఉన్నారు. అలాగే కళింగకోమటి సాధికార కమిటీకి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం కళింగకోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బోయిన గోవిందరాజులును కళింగకోమటి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. టెక్కలి నియోజకవర్గంలో కింజరాపు కుటుంబంతో, తెలుగుదేశం పార్టీతో బోయినకు విడదీయలేని అనుబంధం ఉంది. పాత హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో గానీ, ప్రస్తుత టెక్కలి నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో వెలమ, కాళింగ, మత్స్యకార, యాదవుల ఓట్లను పార్టీలవారీగా సర్దుకుంటారు. కానీ కోటబొమ్మాళి మండలంలో మాత్రం కోమట్లు బోయిన గోవిందరాజులు మాట మేరకు మొదట్నుంచి టీడీపీకి మద్దతిస్తున్నారు. ప్రతిసారీ కింజరాపు కుటుంబం గెలుపులో వీరి ఓట్లు కీలకంగా మారుతున్నాయి. అందుకే కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి వంటి పదవులు కోటబొమ్మాళికి ఉన్నప్పటికీ మరో రాష్ట్ర కార్పొరేషన్ పదవిని అచ్చెన్నాయుడు పట్టుబట్టి మరీ తెచ్చుకున్నారు. అంతేకాకుండా గోవిందరాజులు సోదరుడు బోయిన రమేష్ ప్రస్తుతం మండల టీడీపీ అధ్యక్షుడిగా, రైస్‌మిల్లర్స్ సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. గోవిందరాజులు తనయుడు శ్రీనివాస్ కోటబొమ్మాళి మండల తెలుగు యువత ప్రెసిడెంట్‌గా భవిష్యత్ రాజకీయాలకు పునాదులు వేసుకుంటున్నారు.










Comments