నమ్మండి.. ఇది రోడ్డేనండి!
- BAGADI NARAYANARAO

- Sep 24, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
వంద వాక్యాల కంటే ఒక్క ఫొటో ఇచ్చే సందేశం ఇంపాక్ట్ వందింతలు ఎక్కువుంటుంది. అందుకు సాక్ష్యం ఈ ఫొటోనే. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు ఆనుకొని ఉన్న కొత్తపేటకు వెళ్లే రోడ్డు ఇది. దీని మీదుగా స్థానికులు ఎలా రాకపోకలు సాగిస్తున్నారో ఇప్పటికే మీ మస్తిస్కంలో ఒక ఆలోచన మొదలైవుంటుంది. రోడ్లు ఇలా ఉంటే.. స్థానిక ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారన్న అనుమానం వచ్చిందంటే మీ మెదడు సరిగా పని చేస్తున్నట్టే. అందుకే ఈ రోడ్డు పని చేయాలని వారూ అనుకున్నారు. కానీ వాటి నిధులకు మోక్షం రాలేదు. ఈలోగా ఎంతమందికి మోక్షం ప్రాప్తిస్తుందో తెలియదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లన్నీ నాబార్డు నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎచ్చెర్ల మండలం కొత్తపేట రోడ్డు నిర్మాణానికి రూ.3.5 కోట్లు అంచనా వ్యయంతో అధికారులు టెండర్ ప్రక్రియ నిర్వహించారు. టెండర్‌ను చిన్ననాయుడు అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ప్రక్రియ పూర్తిచేసి నాలుగు నెలలు పూర్తయింది. నేటికీ రోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. కారణం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం చేసింది. ఈ కారణంగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదని తెలిసింది. బకాయిలు చెల్లించకుండా కొత్తగా రోడ్డు నిర్మాణం చేస్తే బిల్లులు జాప్యమైతే నిండా మునిగిపోతానన్న ఆందోళన కాంట్రాక్టర్‌లో కనిపిస్తుంది. టెండరు పూర్తయిన తర్వాత అగ్రిమెంట్ చేసుకొని రోడ్డు నిర్మించాలి. బిల్లులు ఎప్పుడొస్తాయన్న దానికి ఎప్పట్నుంచో గ్యారెంటీ లేకుండాపోయింది. దానికి ఏ ప్రభుత్వాలూ అతీతం కాదు. బిల్లులు రావనే భయమున్నప్పుడు టెండరు వేయకూడదు.. వేసినాక అగ్రిమెంట్ మేరకు పూర్తిచేయాలి. ఈ విషయంలో ఆర్ అండ్ బి అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడం వల్లే ఈ అంశం తెర మీదకు రావడంలేదు.
కొత్తపేట రోడ్డు మీదుగా తోటపాలెం, సైలాడ్ పేట, ఏజీఎన్ పేట, అఖింఖాన్ పేట, దోమాం, కొత్తపేట, సెగిడిపేట, అంబేద్కర్‌నగర్, రుప్పపేట, కొయ్యవానిపేట, సంతసీతారాంపురం గ్రామాలకు చెందిన వందలాది మంది నిత్యం జిల్లా కేంద్రానికి ఆటోలు, ద్విచక్ర వాహనాలపైన, ఉద్యోగ, ఉపాధి కోసం నగరానికి ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగిస్తుంటారు. ఆమధ్య గంజాయి సేవిస్తూ దొరికినవారిని సమాజ సేవ పేరుతో అనాథశరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో ఎంగిళ్లు ఎత్తించాలనే నినాదం మొదలైంది. అలా కాకుండా ఈ కొత్తపేట రోడ్డు మీదుగా పది ట్రిప్పులు ఆటోలో తిరగాలని శిక్ష విధిస్తే మత్తు దిగిపోతుంది.










Comments