top of page

నమ్మిన తుపాకీ తూటాకే..నేలకూలిన నంబాల

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 21, 2025
  • 3 min read


(మరన్ని ఫోటోలకు సత్యం పత్రికను చూడగలరు)

  • నారాయణపూర్‌ ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతి

  • సామాన్య కుటుంబం నుంచి విప్లవోద్యమ అగ్రనేత స్థాయికి

  • దశాబ్దాలుగా సాయుధ పోరాటమే ఊపిరిగా అజ్ఞాత జీవనం

  • స్వగ్రామం జియన్నపేటలో విషాదఛాయలు

  • ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్న గ్రామస్తులు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మావోయిస్టు ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా గత కొన్నాళ్లుగా దండకారణ్య ప్రాంతాన్ని జల్లెడ పడుతూ వందల సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టిన సాయుధ భద్రతా బలగాలు తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో 28 మావోయిస్టులను అంతమొందించాయి. ఈ ఎదురు కాల్పుల్లో సీపీఐఎంఎల్‌ మావోయిస్ట్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, అగ్రనేతల్లో ఒకరైన నంబాల కేశవరావు (70) అలియాస్‌ బసవరాజు అలియాస్‌ గంగన్న కూడా హతమయ్యారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేటకు చెందిన కేశవరావు తొలుత కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి.. అనంతరం విప్లవోద్యమం వైపు ఆకర్షితుడై జీవితాంతం ఆ ఉద్యమానికే అంకితమయ్యారు. దశాబ్దాల విప్లవోద్యమ జీవితంలో కిందిస్థాయి కార్యకర్త నుంచి అగ్రనేత వరకు ఎదిగారు. నాటి పీపుల్స్‌వార్‌ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు వాటి ఉద్యమాల నిర్మాణంలో, దాడుల్లో సూత్రధారిగా వ్యవహరించారు.

విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలం

కోటబొమ్మాళి మండలం జియన్నపేటలో సామాన్య కుటుంబంలో 1955లో కేశవరావు జన్మించారు. అయన తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. తల్లి వరలక్ష్మి, ఏకైక సోదరుడు ఢల్లీిరావు మంచి కబడ్డీ క్రీడాకారుడిగా పేరొందిన కేశవరావు విదార్థిగా ఉన్నప్పుడే వామపక్ష భావజాలాన్ని ఒంటబట్టించుకుని సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి చురుకైన పాత్ర పోషించారు. ప్రాథమిక విద్యాభాస్యం అనంతరం వరంగల్‌ వెళ్లి అక్కడి రీజనల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(ఆర్‌ఈసీ)లో బీటెక్‌ అనంతరం ఎంటెక్‌ చేస్తుండగా 1970లో విప్లవ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న కేశవరావు కుటుంబీకులెవరూ ప్రస్తుతం ఆ గ్రామంలో లేరు. తల్లిదండ్రులు మరణించగా, పోర్ట్‌ బ్లెయిర్‌ పోర్టు ఛైర్మన్‌గా పని చేసి రిటైరైన ఏకైక సోదరుడు ఢల్లీిరావు వేరే చోట ఉంటున్నారు. నక్సలిజంలోకి వెళ్లిన తర్వాత కేశవరావు స్వగ్రామానికి ఒక్కసారి కూడా రాలేదంటున్నారు. అయినా ఆయన మరణవార్త తెలియగానే గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మావోయిస్టు మిలటరీ వ్యవస్థాపకుడు

ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ప్రకారం కేశవరావు గెరిల్లా యుద్ధతంత్రంలోనూ, ఐఈడీ(ఇంప్రూవైజ్డ్‌ ఎక్స్‌ప్లాజివ్‌ డివైజెస్‌) వంటి పేలుడు పదార్థాల తయారీలోనూ నిపుణుడు. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. మొదట సీపీఐఎం పీపుల్స్‌వార్‌ గ్రూపు కేంద్ర కమిటీ సభ్యుడిగా కీలకపాత్ర పోషించిన ఆయన 2004లో పీపుల్‌వార్‌, మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ (ఎంసీసీ) విలీనం తర్వాత సీపీఐ మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్న ఆయన ఆ పార్టీలో అంతర్గతంగా సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి దాని అధ్యక్షుడిగా వ్యవహరించారు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ, మల్లోజుల వేణుగోపాల్‌, మల్లా రాజిరెడ్డిలతో కలిసి 1987లో బస్తర్‌ ఆడవుల్లో శ్రీలంక తమిళ తీవ్రవాద గ్రూపు అయిన ఎల్‌టీటీఈ నిపుణుల ద్వారా ఆకస్మిక దాడులు, పేలుడు పదార్థాల ప్రయోగంలో శిక్షణ పొందారు. ముప్పాళ్ల గణపతి అనంతరం 2018 నవంబరులో నంబాల కేశవరావు సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో ప్రధాన కార్యదర్శిగా, సుప్రీం కమాండర్‌గరా నియమితులయ్యారు.

అన్ని దాడుల్లోనూ ఆయన పాత్ర
  • ఛత్తీస్‌గఢ్‌, మహరాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో జరిగిన దాదాపు అన్ని నక్సలైట్‌ దాడుల వెనుక సూత్రధారిగానో, పాత్రధారిగానో నంబాల కేశవరావు పాత్ర ఉంది.

  • 2003లో తిరుపతిలోని అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జరిగిన క్లెమోర్‌ మైన్‌ దాడి సూత్రధారి కేశవరావే. ఆ దాడిలో చంద్రబాబు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

  • 2018లో విశాఖ జిల్ల అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమాలపై దాడి చేసి హతమార్చిన ఘటనలోనూ ఆయనే కీలకవ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు.

  • 2010లో దంతేవాడలో మావోయిస్టు దళాలు జరిపిన దాడిలో 76 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు.

  • అదే ఏడాది జీరామ్‌ ఘాటీలో జరిపిన దాడిలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర మాజీ మంత్రి మహేంద్ర కర్మ, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుడు నందకుమార్‌ సహా 27 మంది మృతి చెందారు.

తలపై కోటిన్నర రివార్డు

తొలుత పీపుల్స్‌వార్‌, ఆ తర్వాత సీపీఐ మావోయిస్టు పార్టీలో అత్యున్నత పదవులు చేపట్టి.. సాయుధ భద్రతా బలగాలపై అనేక దాడులు చేసిన కేశవరావు తన జీవితంలో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1980లో రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియర్‌(ఆర్‌ఎస్‌యూ), అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) సంఘాల మధ్య శ్రీకాకుళంలో ఘర్షణ జరిగినప్పుడు కేశవరావును పోలీసులు అరెస్టు చేశారు. అయితే విప్లవోద్యమంలోకి వెళ్లిన తర్వాత మాత్రం ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కలేదు. అందువల్లే ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న కేశవరావు తలకు ప్రభుత్వాలు వెలకట్టాయి. మొదటి రూ.10 లక్షలతో మొదలై క్రమంగా పెరుగుతూ ఆ రివార్డు ప్రస్తుత రూ.కోటిన్నరకు చేరింది. చివరికి ఎదురు కాల్పుల్లో సాయుధ బలగాల తూటాలకు బలై కేశవరావు నేలకూలారు.

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. 28 మంది మావోయిస్టుల మృతి

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. నారాయణపూర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 28 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. మరి కొంత మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. మాధ్‌ ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో బీజాపూర్‌, నారాయణపూర్‌, దంతెవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. బుధవారం ఉదయం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

మృతుల్లో మావోయిస్టు అగ్రనేత!

అబుజ్మడ్‌లోని బటైల్‌ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్ర నాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు సమాచారం. అతడిపై రూ.కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. బస్తర్‌లోని నాలు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నాయి. అబుజ్మడ్‌ ఎన్‌కౌంటర్‌ను నారాయణపూర్‌ ఎస్పీ ప్రభాత్‌ కుమార్‌ ధ్రువీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పోలీసు సహాయకుడు మృతి..

ఈ ఎదురు కాల్పుల్లో పోలీసు సహాయకుడు ఒకరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన జవానుకు ప్రాణాపాయం లేదని ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి వెల్లడిరచారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లోని కరేగుట్ట పర్వతాల్లో 24 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన విషయం తెలిసిందే వీరిలో 16 మంది మహిళలు ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page