నరక ‘యోగ’ంలో రికార్డు సాధిస్తారా?
- DV RAMANA

- Jun 19, 2025
- 2 min read

రెండు నెలల విరామం తర్వాత ఈమధ్యే సముద్రంలో చేపల వేట మొదలైంది. కానీ ఇంతలోనే మళ్లీ వేట నిషేధ ప్రకటన. మత్స్యకారులెవరూ చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారుల హెచ్చరికలు. ఈ ప్రకటనలు చూసి వాయుగుండమో, తుపాను వాతావరణం అలముకుందేనన్న అనుమానాలు కలగవచ్చు. కానీ అటువంటివేవీ లేవు. కానీ ఈ నెల 20,21 తేదీల్లో విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపలవేటను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేనా ఆ రెండు రోజులూ విద్యాసంస్థలకు సెలవు. గత నెల రోజులుగా ఉత్తరాంధ్రలోనే కిందిస్థాయి నుంచీ పైస్థాయి వరకు ఏ శాఖ అధికారిని కది లించినా అందరిదీ ఒకటే మాట.. ఒకటే బిజీ. ఇక విశాఖ నగరంలో అయితే విపరీతమైన ట్రాఫిక్ ఆంక్షలు. పర్యాటకులకు స్వర్గధామంగా భాసిల్లుతున్న బీచ్‌రోడ్డు దాదాపు మూసివేత. ఇవన్నీ ఎందుకంటే.. అధికారుల నుంచి వస్తున్న సమాధానం.. యోగాంధ్ర. అవును అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్క రించుకుని విశాఖ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో యోగా విన్యాసాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఉత్సవాలకు దేశప్రధాని నరేంద్ర మోదీని సైతం రప్పిస్తోంది. సుమారు ఐదు లక్షల మంది ప్రజలను ఈ మహాక్రతువులో భాగస్వాములను చేయడం ద్వారా భారతీయ సనాతన విద్య అయిన యోగాను విశ్వవిఖ్యాతం చేయడం, గిన్నిస్ బుక్ సహా పలు అంతర్జాతీయ రికార్డులు సాధించడం, ప్రజా బాహుళ్యాన్ని యోగా వైపు మళ్లించి ఆరోగ్య సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతే బాగానే ఉంది. కానీ యోగాంధ్ర పేరుతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పాలనను పక్కన పెట్టేసి యోగాంధ్ర విన్యాసాలే చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏ కార్యాలయానికి పనులపై వెళ్లినా యోగాంధ్ర తర్వాత రండి.. అన్న సూచనే వినిపిస్తోంది. కిందిస్థాయి గ్రామ, వార్డు సచివాలయాల నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు అందరూ ఈ కార్యక్రమాల బిజీతో సతమతమవుతున్నారు. ఇవన్నీ ఒకెత్తు, అయితే 21న అంటే శనివారం విశాఖ బీచ్ రోడ్డులో జరిగే యోగా కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఐదు లక్షల మంది ప్రజలను తర లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 40 వేలు చొప్పున, అనకా పల్లి జిల్లా నుంచి లక్ష మందిని, పార్వతీపురం, అల్లూరి మన్యం జిల్లాల నుంచి 25 వేల మంది గిరిజన విద్యార్థులను, మిగతా జనాన్ని విశాఖ జిల్లా నుంచి తరలించాలని ఆయా జిల్లాల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. వీరందరినీ 20వ తేదీ(శుక్రవారం) సాయంత్రానికే ఆయా జిల్లాల నుంచి విశాఖ నగరానికి తరలించాలని నిర్ణయించారు. అలా చేస్తే గానీ శనివారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభమయ్యే యోగా కార్యక్రమంలో వారందరూ పాల్గొనలేరు. దాంతో షరా మామూలుగా జిల్లాల అధికారులు మహిళలు సభ్యు లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు, ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీలు, వైద్యశాఖ పరిధిలోని ఆశా కార్యకర్తల పైనే దృష్టి పెట్టారు. పదిమంది సభ్యులుండే ప్రతి డ్వాక్రా సంఘం నుంచి ఇద్దరు సభ్యులను తీసుకురావా లని లక్ష్యం విధిస్తూ మెప్మా, డీఆర్‌డీఏ అధికారులు రిసోర్స్‌పర్సన్ల(ఆర్పీ) మెడపై కత్తిపెట్టారు. మామూలుగా పగటిపూట జరిగే కార్యక్రమాలకైతే జనసమీకరణ పెద్ద కష్టం కాదు. మహిళలు వెళ్లడానికి పెద్దగా అభ్యంత రాలు ఉండవు. కానీ ఇప్పుడు అలా కాదు. తెల్లవారు జామున జరిగే కార్యక్రమం కావడంతో తప్పనిసరిగా ముందురోజు రాత్రికే జనాలను విశాఖ నగరానికి తరలించక తప్పదు. ఈ అంశంగా అటు జనసమీకరణ కు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, ఇటు మహిళా సంఘాల సభ్యులకు ఇబ్బందికరంగా మారింది. డ్వాక్రా సంఘాల సభ్యులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలందరూ మహిళలే. వారు ఒక రాత్రంతా ఇంటికి దూరంగా ఎక్కడో తెలియని ప్రాంతంలో ఉండటం, ఉంచాలనుకోవడం అభ్యంతరకరంగా చాలామంది భావిస్తున్నారు. వీరిలో పెళ్లికాని యువతుల విషయంలో ఒకరకమైన ఇబ్బందులున్నాయి. పెళ్లి అయ్యి పిల్లలున్న వివాహితలైతే పిల్లలు, సంసారాలను వదిలేసి రాత్రివేళ దూరంగా ఉండటం ఎంత ఇబ్బందికరమో ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే లక్షల సంఖ్యలో తరలించే మహిళలను విశాఖ నగరంలో రాత్రి వేళ ఆశ్రయం కల్పించడం, ఉదయం వారంతా కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం కూడా చిన్న విషయం కాదు. అది అధికారులకు కత్తి మీద సాములాంటిదే. ఏ చిన్న లోపం జరి గినా, అనుకోని అపశృతులు దొర్లినా అధికార యంత్రాంగంతోపాటు ప్రభుత్వం బద్నాం అవుతుంది. మరి యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన ప్రభుత్వ పెద్దలు ఈ అంశాలను గుర్తించారో లేదో!










Comments