నల్లచెరువులో మట్టి మాఫియా
- BAGADI NARAYANARAO

- May 17, 2025
- 2 min read
ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్న రియల్ వ్యాపారి
ఇళ్ల లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్న వైనం
ప్రశ్నించిన వారికి దబాయింపులు, బెదిరింపులు
ఫిర్యాదులకు స్పందించని అధికారులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇంతవరకు ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలతో కోట్లు గడిరచిన మాఫియాలను చూశాం. ఇప్పుడు ఈ మాఫియా ముఠాలు మట్టినీ వదలడంలేదు. ఇసుక, గ్రావెల్ తవ్వకాలకు ప్రభుత్వ అనుమతులు అవసరమైనట్లే.. మట్టి తవ్వకాలకూ తీసుకోవాల్సి ఉన్నా జిల్లా అంతటా పెచ్చరిల్లిపోతూ చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వేసి ఇష్టారాజ్యంగా తరలించి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేమిటని స్థానికులు అడిగితే మట్టి తవ్వకాలకు ఎవరి అనుమతి అవసరం లేదని దబాయిస్తున్నారు. అధికారంలో ఉన్న కూటమి నాయకులే మట్టి తవ్వకాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ తవ్వకాల వల్ల చెరువు గర్భాల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. ఒకవైపు ఉపాధి హమీ పథకం కింద ఇదే తరహా పనులు జరుగుతున్నా లెక్క చేయకుండా రాత్రివేళల్లో మట్టిని తరలించుకు పోతున్నారు.
రియల్ వ్యాపారానికి తరలింపు
శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ రాగోలుపేట గ్రామంలో ఉన్న నల్లచెరువును అదే గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, నీటిసంఘం సభ్యుడు సురేష్ జేసీబీలతో తవ్వించి ట్రాక్టర్లలో మట్టి తరలించుకుపోతున్నారని గ్రామస్తులు తహసీల్దారు, ఎంపీడీవోలకు ఫి˜ర్యాదు చేశారు. మట్టి తరలించడానికి వచ్చే వాహనాల రాకపోకలకు వీలుగా చెరువు గర్భంలో బాటలు వేయడంతోపాటు చెరువు గట్టును చదును చేసి మట్టిరోడ్డు వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ధనుంజయరావు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 7/2లో 12.60 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్లచెరువులో ఇప్పటికే సుమారు 70 సెంట్ల మేరకు కబ్జాకు గురైంది. 150 ఎకరాల ఆయకట్టు కలిగిన ఈ చెరువుకు రాగోలు ఆర్టీసీ కాలనీ మీదుగా సాగే పంటకాలువ నుంచి వంశధార నీరు వస్తుంది. దీన్ని స్థానికులు పశువుల తాగునీటి అవసరాలకు వినియోగిస్తుంటారు. గ్రామానికి పలు రకాలుగా ఉపయోగపడుతున్న ఈ చెరువులో నుంచి నీటిసంఘం సభ్యుడిగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి సురేష్ మట్టి తవ్వుకుపోతుండటంపై గ్రామంలో అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇదే విషయం ప్రశ్నించిన ధనుంజయరావును సురేష్ మొదట బెదిరించినట్టు తెలిసింది. ఎదురుతిరగడంతో రచ్చ చేయవద్దని, మట్టి తవ్వకాన్ని తానే వేరొకరికి అప్పగించానని, అతని నుంచి గ్రామంలో దేవాలయానికి కొంత మొత్తం ఇప్పిస్తానని సురేష్ బేరం పెట్టినట్టు తెలిసింది. అందరికీ నచ్చినట్టు చెరువులో ఎక్కడ తవ్వమంటే అక్కడే తవ్వి మట్టిని తరలిస్తాడని అతన్ని అడ్డుకోవద్దని, తన మాట విని రాద్ధాంతం చేయొద్దని ధనుంజయరావును వాట్సప్ చాటింగ్ ద్వారా నచ్చజెప్పడానికి సురేష్ ప్రయత్నించారు. అయితే రాత్రివేళల్లో చెరువులో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో లేఅవుట్లకు తరలించుకుపోతున్నారని ధనుంజయరావు ఆరోపిస్తున్నారు. మండల అధికారుల కనుసన్నల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నాడు. మట్టి తవ్వకాల వల్ల చెరువులో ఏర్పడిన గుంతల్లో పశువులు, స్నానానికి వచ్చేవారు పడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌వోకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. తక్షణమే మట్టి తవ్వకాలను అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.











Comments