top of page

పేకాడిస్తుంటే ఏం పీకుతున్నారు?

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • May 12
  • 2 min read

  • రూరల్‌ పరిధిలో పర్మినెంట్‌ డెన్లపై ఎస్పీ సీరియస్‌

  • రెండు శిబిరాలపై దాడులకు వెళ్తే ఓచోట ముందే లీకైన సమాచారం

  • మొబైల్స్‌, వాహనాలు సీజ్‌ చేసిన టాస్క్‌ఫోర్స్‌

  • పేకాటరాయుళ్లలో సగానికి పైగా బుకీలే


ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

శ్రీకాకుళం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి పెద్దపాడు సమీపంలో పద్మావతి కల్యాణ మండపం వెనుక ఉన్న కాలనీలో శనివారం సాయంత్రం ఎస్పీ ఆధ్వర్యంలో నడిచే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ పేకాట శిబిరం మీద మెరుపుదాడులు నిర్వహించారు. పేకాడుతున్న 12 మందిని, రూ.1.73లక్షల నగదును, వారికి సంబంధించిన మొబైల్‌ ఫోన్లు, వాహనాలను రూరల్‌ పోలీసులకు అప్పగించి వెనక్కు వచ్చేశారు. కట్‌ చేస్తే.. పెద్దపాడు సమీపంలో ఉన్న ఈ కాలనీలో పర్మినెంట్‌ డెన్‌లు ఏర్పాటుచేసుకొని ఇద్దరు ముగ్గురు పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని ఎస్పీకి టాస్క్‌ఫోర్స్‌ రిపోర్ట్‌ చేసింది. నగరం మధ్యలో పర్మినెంట్‌ డెన్లు ఏర్పాటుచేసి పేకాడిస్తుంటే.. రూరల్‌ పోలీసులు చేతులు కట్టుకొని చూడటమేమిటంటూ ఎస్పీ మహేశ్వర్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసేవరకు రూరల్‌ పోలీసులు ఏం చేస్తున్నారని ఎస్పీ ప్రశ్నించినట్టు భోగట్టా. శనివారం సాయంత్రం పద్మావతి కల్యాణ మండపం వెనుక రెండో లైన్‌లో పొట్నూరు చందు నిర్వహిస్తున్న పేకాట డెన్‌ మీద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసినప్పుడే పక్కనే గోపి అనేక మరొకడు పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడని, దాని అడ్రస్‌ ఎక్కడంటూ ఆరా తీశారు. కానీ, పోలీసులు పొట్నూరు చందు (నల్ల చందు) డెన్‌ మీద దాడి చేసినప్పటికే గోపి శిబిరం నుంచి పేకాటరాయుళ్లు పారిపోయారు. దీనిపై ముందస్తు సమాచారం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. కొంతకాలంగా ఇదే ప్రాంతంలో నిత్యం ఆడిస్తున్న రూరల్‌ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం మంత్లీలేనని వేరేగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగేసరికి బండారం బయటపడిరది. శనివారం సాయంత్రం దొరికిన 12 మందిలో నలుగురు గతంలో కూడా పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ఇంతవరకు పేకాటాడుతూ దొరికితే పెట్టీ కేసుగానే పోలీసులు చూస్తూవచ్చారు. కానీ, ఈసారి స్వయంగా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డే తెర వెనుక చక్రం తిప్పడంతో వీరి వాహనాలు, మొబైల్స్‌ కూడా ప్రస్తుతం పోలీసుల హ్యాండోవర్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడే అసలు చిక్కంతా వచ్చిపడిరది. పేకాడుతూ దొరికిపోతే మహా అయితే బెంచ్‌ కోర్టులో ఫైన్‌ వేస్తారు తప్ప పీకలు తెగిపోవని పేకాటరాయుళ్లు భావిస్తూ వచ్చారు. కానీ నగరంలో పేకాటకు, క్రికెట్‌ బెట్టింగులకు ప్రత్యక్ష సంబంధాలున్నాయన్న విషయం పోలీసులకు తెలియదు. ప్రస్తుతం దొరికిన 12 మందిలో సగానికి పైగా పేకాటరాయుళ్లు క్రికెట్‌ బుకీలు. వీరు మధ్యాహ్నం ఒంటిగంటకు డెన్‌ తెరిచేవరకు స్థానిక గణేష్‌ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో తాగడం, ఆ తర్వాత డెన్‌కు వెళ్లి, ఒకవైపు పేకాడుతూ, మరోవైపు గ్రామీణ యువతను బెట్టింగులకు దించడం చేస్తుంటారు. ఇప్పుడు పోలీసుల హ్యాండోవర్‌లో ఉన్న వీరి సెల్‌ఫోన్‌లో డేటా తీస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది బుకీలతో సంబంధాలున్నాయి? ఎటువంటి లావాదేవీలు జరిగాయనేది ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఏం చేయాలో తెలీక వీరంతా ఆందోళన చెందుతున్నారు. భీమవరంలో ఉంటూ జిల్లాలో క్రికెట్‌ బెట్టింగులు నడుపుతున్న బరంపురం శ్రీనుకు బంటుగా ఇక్కడ రాజేష్‌ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. శనివారం అరెస్టయిన 12 మందిలో రాజేష్‌ కూడా ఉన్నాడు. మధ్యాహ్నం డెన్‌ తెరిచేవరకు ఉదయం పూట తమ ద్వారా బెట్టింగ్‌ వేసినవారి నుంచి కలెక్షన్లు చేయడం, పేకాట ముక్కలు పరిచిన తర్వాత అక్కడకు వచ్చినవారికి బీరు, బిర్యానీ ఇవ్వడం చేస్తుంటాడు. రాజేష్‌ మొబైల్‌ పరిశీలిస్తే మొత్తం గుట్టంతా బయటపడుతుంది. గతంలో సమగ్రశిక్ష కార్యాలయం దగ్గర డెన్‌లు నడిపిన పొట్నూరు చందుది కరజాడ. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో రూరల్‌ పరిధిలో పద్మావతి కల్యాణ మండపం వెనుకవైపునకు చాన్నాళ్ల క్రితం దీన్ని మార్చారు. విచిత్రమేమిటంటే.. పోలీసులు అరెస్ట్‌ చేసిన 12 మందిలో ప్రభుత్వ విధుల్లో ఉండాల్సిన ఇద్దరు ఉద్యోగులు పేకాట శిబిరంలో ఉన్నారు. ఇందులో ఒకరు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే ఉద్యోగి కాగా, మరొకరు రాష్ట్ర ఉద్యోగి అని తెలుస్తుంది. రోజూ డెన్‌ తెరిచే సమయానికి ఒక్కొక్కరు రూ.50వేలు పట్టుకొని పేకాటకు వస్తారు. సాధారణంగా 15 మందికి తక్కువ కాకుండా నిత్యం ఒక్కో డెన్‌లో ఉంటారు. కానీ పోలీసులు రైడ్‌ చేసిన రోజు 12 మందే ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పేకాట శిబిరానికి రాకపోకలు మొదలవుతాయని తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ శనివారం ఉదయం నుంచే అక్కడ మాటువేసి సాయంత్రం అందరూ చేరి పేక పురాణం రసవత్తరంగా సాగుతున్న సమయంలో దాడులు నిర్వహించారు. అయితే పొట్నూరు చందు నడుపుతున్న పేక శిబిరం కంటే గోపీ నడుపుతున్న పక్కలైన్‌లో ఉన్న శిబిరం వద్ద మరింత మంది బిగ్‌ షాట్‌లు నిత్యం ఆడుతుంటారు. లక్కీగా తప్పించుకున్న గోపీ శిబిరం మీద కూడా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రస్తుతం ఓ కన్నేసుంచారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page