పాకిస్తాన్ ముర్దాబాద్.. అంటున్న సింధ్!
- DV RAMANA

- 3 days ago
- 2 min read
బలూచిస్థాన్, పీవోకేల బాటలో సింధీల స్వేచ్ఛాగానం
నిరసనలతో అట్టుడుకుతున్న ప్రావిన్స్
పంజాబీల ఆధిపత్య జాతీయ సర్కారుపై అవిశ్వాసం
నాటి తూర్పు పాకిస్తాన్ మాదిరిగా స్వతంత్య్ర ఉద్యమం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
‘పాకిస్తాన్ ముర్దాబాద్.. ఇస్లామాబాద్ డౌన్ డౌన్’.. ఈ నినాదాలు వింటే ఎవరో పాకిస్తాన్ వల్ల నష్టపోయిన భారతీయులు చేస్తున్నారనుకోవడం సహజం. కానీ అది వాస్తవం కాదు. పాకిస్తాన్ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై వినిపిస్తున్న నిరసన గళాలే అవన్నీ! ఇది ముమ్మాటికీ నిజం.. ప్రతి విషయానికీ పాకిస్తాన్ భారత్‌పై పడి ఏడుస్తుంటే.. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ అవసరాలను, హక్కులను కాలరాస్తూ బానిసల్లా వాడుకుంటున్నారంటూ పాకిస్తాన్ జాతీయ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికి ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం వంటి సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్‌లో ప్రాంతీయవాదాలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. ఒకవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) తాము భారత్‌లో కలిసిపోతామని నినదిస్తుంటే మరోవైపు బలూచిస్థాన్ ప్రజలు స్వాతంత్య్ర పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సింధ్ ప్రాంతం ప్రత్యేక దేశం కోసం ఉద్యమపంథా అందుకుంది. ఆ ప్రాంత ప్రజల డిమాండ్ పాతదే అయినా కొన్నేళ్ల తర్వాత కొత్తగా శిరమెత్తింది. దీనికి బలూచ్, పీవోకే పోరాటాలే స్ఫూర్తి కావచ్చని భావిస్తున్నారు. పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, పీవోకే, బలూచిస్థాన్ తదితర ప్రావిన్సులు ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా ఆదేశ జాతీయ ప్రభుత్వాల్లోనూ, అధికార వ్యవస్థల్లోనూ పంజాబ్ డామినేషన్ అధికంగా ఉంటుంది. ఆ అధికార బలంతోనే మిగతా ప్రాంతాల్లోని ఖనిజ, ఇతర ప్రకృతి వనరులను తరలించుకుపోయి పంజాబ్‌లో కుమ్మరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని నెలలుగా విముక్తి కోరుతూ పోరాటాలు చేస్తున్న బలూచ్, పీవోకే ఉద్యమకారులు ప్రధానంగా నిధులు, వనరుల దోపిడీనే ప్రశ్నిస్తున్నారు. అలాగే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళితే అప్పట్లో తూర్పు పాకిస్తానీయులు కూడా ఇలాంటి దోపిడీనే తిరస్కరించి విముక్తి పోరాటాలు చేసి చివరికి భారత ప్రభుత్వం, సైన్యం మద్దతుతో 1971లో యుద్ధం ద్వారా తూర్పు పాకిస్తాన్‌కు పాక్ నుంచి విముక్తి సాధించి బంగ్లాదేశ్ అవతరణకు కారణమయ్యారు. ఇప్పుడు సింధ్ ప్రావిన్స్ కూడా పాక్ పాలకుల కబందహస్తాల నుంచి బయటపడాలని కోరుకుంటోంది.
నిధులు, వనరుల దోపిడీపై ఆగ్రహం
ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, ఉవ్రవాద బెదిరింపుల మధ్య తలెత్తిన సింధ్ ప్రజల విభజనవాదం పాకిస్తాన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు సృష్టిస్తోంది. తమ ప్రావిన్స్ వనరులను దోచుకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం అదే సమయంలో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను, భాషను నిర్లక్ష్యం చేస్తున్నదని సింధ్ ప్రాంతీయులు దీర్ఘకాలంగా చేస్తున్న ఆరోపణలు నిరసన జ్వాలలుగా ఉధృతమయ్యాయి. ఈ ఉద్యమం వెనుక ‘జియె సింధు ముత్తాహిదా మహజ్’ వంటి సింధీ జాతీయవాద సంస్థలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. సింధ్ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని ప్రకటిస్తున్న ఈ సంస్థలు ఈ ప్రావిన్సును పాకిస్తాన్ నుంచి విడదీసి స్వతంత్ర దేశం ఏర్పాటు చేయాలన్న ఏకైక డిమాండును బలంగా వినిపిస్తున్నాయి. భూ ఆక్రమణలు, కరాచీ వంటి నగరాలకు సింధీయేతర ప్రజల వలసలు పెరగడం వల్ల సింధీల జనాభా క్రమంగా తగ్గిపోతున్నది. మరోవైపు సింధీ రైతులను వారి భూముల నుంచి బలవంతంగా బయటకు పంపేయడం వంటి దోపిడీ వ్యవహారాలు సింధీలను అసంతృప్తికి గురి చేసి జాతీయవాదాన్ని ప్రేరేపించాయి. దశాబ్దాలుగా వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తి ప్రస్తుతం వీధుల్లో నిరసనల రూపంలో ప్రతిధ్వనిస్తోంది.
సైన్యం అణచివేతలపై అసంతృప్తి
సింధుదేశ్ డిమాండ్ 1971లో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారితీసిన విషాద సంఘటనల జ్ఞాపకాలను తలపిస్తోంది. పంజాబీ ఆధిపత్య ప్రభుత్వాలు ఇతర చిన్న జాతుల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక హక్కులను నిర్లక్ష్యం చేయడం అప్పట్లో పాకిస్తాన్ విభజనకు బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. అదే విధమైన నిర్లక్ష్యాన్ని, దోపిడీని ఎదుర్కొంటున్న సింధ్ జాతీయవాదులు బంగ్లాదేశ్ విభజనను ఉదాహరణగా చూపుతున్నారు. ఈ అంతర్గత విభజనవాద ఉద్యమాలతో అంతర్గత సమస్యలు పెరిగినా రాజకీయ నాయకీయ, సైనిక నాయకత్వాలు పెత్తనం కోసం, భారత్‌పై అకారణ కోపంతో దానిపై దాడులకు ఉగ్రమూకలను పెంచిపోషించడంలోనే తలమునకలవుతున్నాయి. విపత్కర పరిస్థితులో తమ కుటుంబాలు తలదాచుకునేందుకు రక్షణ బంకర్ల నిర్మాణాల్లో సైన్యాధికారులు నిమగ్నమయ్యారు. ఇవే దేశంలోని వివిధ ప్రావిన్సుల ప్రజల్లో ఆగ్రహం, అవిశ్వాసం ప్రోది చేస్తున్నాయి. పాకిస్తాన్ పాలకులు తమ అంతర్గత సమస్యలను పరిష్కరించి శాంతిభద్రతలను పరిరక్షించడం కంటే భారతదేశాన్ని విమర్శించడంలో, రాజకీయ అధికారంలో తమ సైన్యం విపరీత జోక్యాన్ని కప్పిపెట్టడంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. బలూచ్, పీవోకేతోపాటు సింధుదేశ్ ఉద్యమాలను సైన్యంతో బలప్రయోగం ద్వారా అణచివేసేందుకు, చట్టవిరుద్ధ అరెస్టులకు పాల్పడుతుండటం వల్లే ఈ ఉద్యమాలు బలపడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. సింధుదేశ్ నినాదం ఆ ప్రాంత ప్రజల ఉనికి పోరాటం మాత్రమే కాదు.. అది పాకిస్తాన్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యలకు, దాని అసమర్థతకు పరాకాష్ట. తీవ్ర ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ రంగంలో ఒంటరితనం, తీవ్రవాద సంస్థల బెదిరింపులు ఇప్పుడు అంతర్గత విభజనవాద నిరసనలు వంటి బహుముఖ సమస్యల్లో చిక్కుకున్న పాకిస్తాన్ సింధ్ ప్రజల హక్కులను గుర్తించకుండా ఆర్థిక దోపిడీ కొనసాగిస్తే పాకిస్తాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.










Comments