పొగరాయుళ్లకు కొత్త ఏడాది సెగ
- DV RAMANA

- 2 days ago
- 3 min read

‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ ’.. అన్నాడు కన్యాశుల్కంలో గిరీశం. ‘సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరల్ తాగు భల్ సిగరెట్టు’ అన్నాడో సినీకవి. దొరలేం ఖర్మ.. ఈరోజుల్లో చదువుకుంటున్న కుర్రాళ్లు కూడా సరదా సరదాగానే సిగరెట్టు తాగడం మొదలుపెట్టి.. క్రమంగా దానికి బానిసలైపోతున్నారు. తామూ దొరల్లా ఫీలైపోతున్నారు. సిగరెట్టు పొగను గుండెల నిండా పీల్చి గుప్పుమని రైలు ఇంజను మాదిరిగా గాలిలోకి వదులుతూ దాని మాయలో పడి పరిసరాలనే మర్చిపోతున్నారు. సిగరెట్టు, చుట్ట, బీడీ వంటి పొగ పీల్చే రకాలతోపాటు గుట్కా, ఖైనీ వంటి నోట్లో పెట్టుకుని నమిలుతూ అదోరకమైన మత్తులో యువత నుంచి వృద్ధుల వరకు జోగుతున్నారు. ఆ మత్తులోనే గుండె, ఊపిరితిత్తులకు చిల్లులు పెట్టుకుని అనారోగ్యం పాలవుతూ జేబుకు కూడా చిల్లులు పెట్టుకుంటున్నారు. అయినా పొగరాయుళ్లు ఏమాత్రం ఖాతరు చేయకుండా సంపాదనలో చాలావరకు వ్యసనానికి తగలేస్తున్నారు. కానీ కొత్త ఏడాదిలో పొగరాయుళ్లందరికీ కేంద్ర ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంటు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. సిగరెట్లు సహా అన్ని రకాల పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీతోపాటు, అదనంగా ఎక్సైజ్ సుంకం భారీగా పెంచడంతో వాటి ధరలు అమాంతం పెరగనున్నాయి. వస్తుసేవల పన్ను(జీఎస్టీ)లో నాలుగు శ్లాబులు ఉండగా 5 శాతం, 12 శాతం, 18 శాతం శ్లాబులు కొనసాగిస్తూ 28 శాతం శ్లాబును జీఎస్టీ మండలి గత సెప్టెంబరులో ఎత్తివేసింది. 28 శాతం పన్ను శ్లాబులో ఉన్న వస్తువులను మిగతా మూడు శ్లాబుల్లో సర్దుబాటు చేయగా ఔషధాలు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వాటి పన్ను శ్లాబులను తగ్గించడమో, పూర్తిగా మినహాయించడమో చేసింది. ఈ సంస్కరణలతోపాటు అంతవరకు 28 శాతం శ్లాబులో ఉన్న పొగాకు ఉత్పత్తులను మాత్రం కొత్తగా ఏర్పాటు చేసిన 40 పన్ను శ్లాబులో చేర్చింది. కొత్త పన్ను శ్లాబు 2026 ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అప్పట్లోనే జీఎస్టీ మండలి ప్రకటించింది. పాత పన్ను రేట్లతో ఉన్న ఉత్పత్తులన్నీ అమ్ముడుపోయేవరకు, కొత్త రేట్లతో ఉత్పత్తుల ప్యాకింగులు సిద్ధం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ దాదాపు నాలుగు నెలల గడువు ఇచ్చింది. జీఎస్టీ పెంపుకు అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని కూడా ఈమధ్యే కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆ మేరకు సెంట్రల్ ఎక్సైజ్ సవరణ బిల్లు`2025ను గత నెల 27న పార్లమెంటు ఆమోదించింది. దీన్ని కూడా ఫిబ్రవరి ఒకటి నుంచే వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం రెండూ ఒకేసారి పొగాకు వినియోగదారులపై పడనున్నాయి. అందువల్ల సిగరెట్లు తాగేవారు ఇక నుంచి పొగాకు ఉత్పత్తుల వినియోగంపై అదనపు బడ్జెట్ కేటాయించుకోవాల్సి ఉంటుంది. లేదా పొగాకు వాడకం తగ్గించుకోవాల్సి ఉంటుంది. కానీ వ్యసనానికి అలవాటు పడిన వారు రేట్లు పెరుగుదల వల్ల కొద్దిరోజులు వ్యసనాన్ని తగ్గించుకునేందుకు, ఖర్చులు మిగుల్చుకునేందుకు ప్రయత్నించినా.. కొన్నాళ్లకే పాత అలవాటకు వచ్చేస్తారన్నది అనుభవపూర్వకంగా అందరికీ తెలిసిందే. కొత్త జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం రేట్ల పెంపు కారణంగా అమ్మకం ధరల పెంపుపై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. సిగరెట్ల పొడవు, ఫిల్టర్ వంటి వాటిని బట్టి కొత్త రేట్ల పెరుగుదల ఉండవచ్చని మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. సగటున ప్రతి వెయ్యి సిగరెట్లకు ఎక్సైజ్ సుంకం విధిస్తారు. సిగరెట్టు పొడవును బట్టి రేటు మారుతుంటుంది. 65 మిల్లీమీటర్ల వరకు పొడవున్న నాన్ ఫిల్టర్ సిగరెట్లు వెయ్యికి రూ.2050 సుంకం విధిస్తారు. 65 నుంచి 70 మి.మీ. పొడవున్న నాన్ ఫిల్టర్ సిగరెట్లపై వెయ్యికి రూ.3600 సుంకం విధిస్తారు. 65 మి.మీ. వరకు పొడవున్న ఫిల్టర్ సిగరెట్లపై వెయ్యికి రూ.2100 సుంకం విధిస్తారు. ఫిల్టర్‌తో సహా 65 నుంచి 70 మి.మీ. పొడవుండే ఫిల్టర్ సిగరెట్లపై వెయ్యికి రూ.5400 సుంకం విధిస్తారు. అలాగే పొగాకు ప్రత్యామ్నాయ సిగరెట్లపై వెయ్యికి 12.5 శాతం లేదా రూ.4006 చొప్పున పన్ను విధిస్తారు. ఎకనమిక్స్ టైమ్స్ వెబ్‌సైట్ ప్రకారం వెయ్యి లాట్‌లలో కాకుండా విడిగా ఒక్కో సిగరెట్ ధర ఎలా ఉంటుందంటే.. 65మి.మీ. ఫిల్టర్ లేని చిన్నసైజు సిగరెట్టు ధర రూ.2.05 పెరగవచ్చు. చిన్నసైజు ఫిల్టర్ సిగరెట్టు(65 మి.మీ.) రూ.2.10 పెరగవచ్చు. 65 నుంచి 70 మి.మీ. మధ్య ఉండే మీడియం సైజ్ సిగరెట్టు ధర రూ.3.60 నుంచి రూ.4 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక పొడవైన, కింగ్‌సైజ్ ప్రీమియం (70 నుంచి 75 మి.మీ.) సిగరెట్టు రూ.5.40 వరకు పెరగవచ్చని అంటున్నారు. సిగరెట్టు పొడవు, స్థాయిని బట్టి ధరగా అంతగా పెరుగుతుందని అంచనా. సిగరెట్లతోపాటు గుట్కా, ఖైనీ, ఇతర నమిలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని 25 నుంచి వంద శాతానికి, హుక్కా పొగాకు డ్యూటీని 25 నుంచి 40 శాతానికి, ఇతర పొగ ఉత్పత్తులపై 60 నుంచి 325 శాతానికి పెంచారు. ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా పొగాకు ఉత్పత్తుల వినియోగానికి పూర్తిగా నియంత్రించే చర్యల్లో భాగంగా పొగాకు ఉత్పత్తులపై పన్నుల భారాన్ని భారీగా పెంచినట్లు కేంద్ర ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్య`జాతీయ భద్రత చట్టం`2025కు అనుగుణంగా పొగాకు ఉత్పత్తులపై పన్నులు భారీగా పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంటులో జరిగిన పలు చర్చల సందర్భంగా వెల్లడిరచారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా ఇటువంటి చర్యలనే సూచిస్తున్నదని ఆమె చెప్పారు. అయితే పొగాకు ఉత్పత్తులపై పన్నుల భారం మోపడంపై నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చర్యలు పొగాకు సాగుచేసే రైతులకు నష్టదాయకమని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పొగాకు వినియోగం తగ్గితే తమ పంటకు గిరాకీ ఉండదని రైతులు అంటున్నారు. సిగరెట్లు వంటివి కాకుండా గుట్కా, ఖైనీ, కొన్ని రకాల పాన్‌మసాలాలపై ఇప్పటికే నిషేధం ఉన్నా.. దాన్ని కట్టుదిట్టంగా అమలు చేయకుండా ప్రభుత్వమే పరోక్షంగా పొగాకు ఉత్పత్తులకు ఊతమిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.










Comments