పెంచు.. పోషించు!
- Prasad Satyam
- Sep 15, 2025
- 2 min read
మంత్లీల కలెక్షన్ బాధ్యత నెత్తికెత్తుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ
బెల్టులు, ఎమ్మార్పీ ఉల్లంఘనపై ఉదాశీనత
గతం కంటే ఈసారి హెచ్చుకు పోతున్న ఎక్సైజ్ శాఖ
మింగుడుపడని ఆమదాలవలస, నరసన్నపేట సిండికేట్ల వైఖరి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పెంచు పోషించు.. తిను తినిపించు.. ప్రస్తుతం ఈ నినాదం మీదే నడుస్తుంది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వమే నడపడం వల్ల సొమ్ములు రాలేదని, ఈసారి ప్రైవేటుపరం చేసినా తమకు సుఖం లేకుండాపోయిందని బయటకు చెప్పుకుంటున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు చాపకింద నీరులా వసూళ్లు చేసుకుంటున్నారు. 20 శాతం కమిషన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 13 శాతానికే దాన్ని పరిమితం చేయడంతో లబోదిబోమంటున్న వ్యాపారులకు లాభాలు ఎలా రాబట్టాలో స్వయంగా ఎక్సైజ్ అధికారులే చెబుతున్నారట. అందులో భాగంగానే బెల్టు షాపులకు ఎమ్మార్పీలు పెంచుకోమని, డైల్యూషన్ చేసుకోమని అభయమిస్తున్నారని తెలుస్తుంది. సాధారణంగా షాపులో కస్టమర్‌కు ఎమ్మార్పీ పెంచకపోయినా బెల్టులకు వెళ్లే బాటిళ్ల మీద రూ.20 పెంచి అమ్ముతున్నారు. అసలు బెల్టు షాపులే ఉండకూడని చోట ఎమ్మార్పీ మీద రూ.20 పెంచి అమ్మడానికి ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారు. అలాగే కాస్ట్‌లీ లిక్కర్‌లో చీప్ లిక్కర్ కలుపుకోడానికి కూడా ఎక్సైజ్ అధికారుల నుంచి అనధికార అనుమతులు ఉన్నాయి. వీటన్నింటినీ చూసీచూడనట్లు వ్యవహరించడానికి ఒక్కో స్టేషన్‌కు ఒక్కో షాపు నుంచి నెలకు రూ.25వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది. అలాగే సబ్‌డివిజన్‌కు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు రూ.11వేలు చొప్పున, ఉన్నతాధికారులు ముగ్గురికి రూ.14వేలు చొప్పున ఒక్కో షాపు నుంచి వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది గతంలో ప్రైవేటు షాపులు నడిచినప్పుడు ఇచ్చిన మంత్లీల కంటే ఎక్కువ. వీటన్నింటినీ ఒక ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ కలక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆమదాలవలస, నరసన్నపేట మినహా అన్నిచోట్లా మంత్లీలు ఎక్సైజ్ అధికారులకు వెళ్తున్నాయి. ఈ రెండుచోట్లా ప్రజాప్రతినిధుల తరఫున వారి మనుషులే షాపులు నడుపుతుండటం వల్ల ఎక్సైజ్ అధికారులకు ఈ రెండు సెంటర్లు కొరకరాని కొయ్యలా తయారయ్యాయి. నరసన్నపేట సిండికేట్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వడం కోసం ఆమధ్య సారవకోట వైన్‌షాపు మీద ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యాన్ని బయటపెట్టారు. దీంతో నరసన్నపేట సిండికేట్ లైన్‌లోకి వస్తుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆమదాలవలసలో కూడా ఏదో ఒక షాపు మీద పెద్ద ఎత్తున దాడులు చేయాలని ఎక్సైజ్ అధికారులు పథక రచన చేస్తున్నట్లు భోగట్టా. మంత్లీలు వసూలు చేయడాన్ని భుజానికెత్తుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ ఈ జిల్లాలో అనేక సంవత్సరాలు పని చేశారు. ఇక్కడ లైసెన్సీలు, నౌకర్‌నామాలతో ఆయనకు పరిచయాలున్నాయి. గతంలో షాపుల్లో పని చేసినవారే ఇప్పుడు కూడా పని చేస్తుండటం వల్ల వారి నుంచి సమాచారాన్ని రాబట్టి దాడులకు సిద్ధపడాలని చూస్తున్నారు. ఎవరైతే నౌకర్‌నామాలు తమకు డైల్యూషన్ కోసం సమాచారమిస్తారో, వారి నుంచి కేసు నుంచి తప్పించి మిగిలినవారిని బుక్ చేయడానికి సిద్ధపడుతున్నారు. అలా నౌకర్‌నామాలు గాని ఉప్పందించకపోతే వారి మీద కేసులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. పలాస సబ్‌డివిజన్‌లో ఇప్పటి వరకు ఎటువంటి బకాయి లేకుండా అన్ని షాపులు ఎక్సైజ్ మామూళ్లు ఇవ్వడంలో అప్‌డేట్‌లో ఉన్నాయి.
సబ్‌డివిజన్లలో కూడా తేడాలొస్తాయని..
శ్రీకాకుళం సబ్ డివిజన్‌లో ఆమదాలవలస, నరసన్నపేట తాము చెప్పినట్లు వినడంలేదని, వీరిని ఇలాగే వదిలేస్తే మిగిలిన సబ్‌డివిజన్లలో కూడా తేడాలొస్తాయని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారట. బెల్టుషాపులకు రూ.20 అధికంగా అమ్మడం వల్ల 20 కేసుల దగ్గర దాదాపు లక్ష రూపాయలు అదనంగా సంపాదిస్తున్నారు. ఇది కాకుండా కాస్ట్‌లీ లిక్కర్ ఫుల్‌బాటిల్‌లో 30 ఎంఎల్‌కు పైన మందు తీసేసి, అందులో రూ.95 రకం చీప్‌ను కలుపుతున్నారు. ఇలా అమ్మడం ద్వారా అదనంగా మరో రూ.2 లక్షలు సంపాదిస్తున్నారు. అన్ని బాటిళ్లలోనూ లిక్కర్‌ను కొంత కొంత మొత్తంలో బయటకు తీయడం, అప్పటికే పర్మిట్ రూమ్‌లోనో, పరిసర ప్రాంతాల్లోనో తాగి పడేసిన క్వార్టర్ బాటిళ్లను సేకరించడం, దానిలో ఈ లిక్కర్‌ను కలిపి కొత్తగా మూతలు కొనుగోలు చేసి బిగించడంతో బాట్లింగ్ కంపెనీ నుంచి కొనుగోలు చేసిన దాని కంటే ఎక్కువ మొత్తంలో ప్రతీ షాపులోను క్వార్టర్ బాటిళ్లు కనిపిస్తున్నాయి. వీటిని వీలైనంత త్వరగా బెల్టులకు పంపించేసి, ఎమ్మార్పీ కంటే రూ.20 ఎక్కువకు అమ్మేసి పెద్ద ఎత్తున సొమ్ములు చేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ ఎక్సైజ్ సిబ్బంది కోసం వారికి తేలిసే చేస్తున్నారు.










Comments