top of page

పింఛన్‌.. టెన్షన్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 1, 2025
  • 3 min read

  • సమయం దాటిన జాడ లేని సచివాలయ సిబ్బంది

  • పంపిణీ ప్రదేశాల్లో గంటల తరబడి లబ్ధిదారుల పడిగాపులు

  • చివరికి 8.30 తర్వాత సచివాలయాలకు రమ్మని కబురు

  • అవెక్కడున్నాయో తెలియక, నడవలేక వృద్ధుల అవస్థలు

బుధవారం.. ఉదయం ఏడు గంటలు..

  • నెలా నెలా పింఛను తీసుకునే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు షరా మామూలుగా ప్రతి నెలా తమకు పింఛను ఇచ్చే ప్రాంతాలకు చేరుకున్నారు. అలా గంట.. గంటన్నర గడిచిపోయినా పెన్షన్‌ ఇచ్చే సచివాలయ సిబ్బంది జాడ లేదు.

  • కొన్నావీధి సమీపంలో ఇంకా తెరవని ఒక షాపు అరుగు మీద ఓ పండుటాకు కూర్చుని అయోమయంగా దిక్కులు చూస్తున్నారు. ఆమె వద్దకు వెళ్లి అడిగితే పింఛను కోసం సచివాలయానికి వెళ్లాలి బాబు. సచివాలయం ఎక్కడుందో.. ఎలా వెళ్లాలో.. తెలియడం లేదు అంటే బిక్కమొహంతో చెప్పింది.

  • ..అదేమిటి సంక్షేమ పెన్షన్లను వీధుల్లో ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తున్నారు కదా! మళ్లీ ఇప్పుడు గంటల తరబడి ఎదురుచూడటమేమిటి? సచివాలయానికి వెళ్లడమేమిటి?? అని సందేహాలు రావడం సహజం. కానీ ఇది వాస్తవం. పండు ముదుసళ్లు, వికలాంగులు, వితంతువులు ఈ నెల పింఛన్లు అందుకోవడానికి అవస్థలు పడ్డారు. దీనికి కారణం.. సరైన సమాచారం లేకపోవడం, సమన్వయం కొరవడటమేనని తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్‌ రాళ్లపై ఆధారపడి జీవితాలను వెళ్లదీసే పండుటాకులు, అనాథలకు చాలా ఏళ్ల తర్వాత గతంలోని చేదు అనుభవాలు గుర్తుకొచ్చాయి. గంటల తరబడి నిరీక్షణ, వేర్వేరు ప్రాంతాలకు తిరగడం వంటి అవస్థలు ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలోనూ పరిస్థితి ఇలాగే ఉండేది. 2019కి ముందు మున్సిపాలిటీలు, పంచాయతీల సిబ్బంది కార్యాలయంలోనో, కమ్యూనిటీ హాల్లోనో ఇచ్చేవారు. వారు ఎప్పుడు వస్తారో.. అసలు వస్తారో లేదో తెలియదు. వారి వచ్చినంత వరకు ఎంతసేపైనా వేచి ఉండి పెన్షన్‌ అందుకునేవారు. ఆ సమయానికి రాకపోయినా, ఆలస్యమైనా ఇక ఆ నెలకు పెన్షన్‌ ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి ఉండేది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చి వలంటీర్లకు పంపిణీ బాధ్యతలు అప్పగించింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్‌ అందించే విధానాన్ని తీసుకొచ్చింది. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లకపోయినా వీధిలో అందరికీ అందుబాటులో ఉండేచోట కూర్చుని తమ పరిధిలో ఉన్నవారందరికీ సకాలంలో పింఛన్లు అందించేవారు. తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను తప్పించి సచివాలయ సిబ్బందికి పంపిణీ బాధ్యతలు అప్పగించడం తప్ప గత విధానాన్ని యథాతథంగా అమలు చేస్తోంది. ఇంతకు ముందులా తెల్లవారుజామున ఆరు గంటలకు కాకుండా ఏడు గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తున్నారు. దాంతో పెన్షనర్లు ఎటువంటి అసౌకర్యానికి గురయ్యేవారు కాదు.

పాత అవస్థలు పునరావృతం

కానీ అక్టోబర్‌ ఒకటో తేదీన మాత్రం పెన్షనర్లు అనూహ్యంగా అవస్థల పాలయ్యారు. ఎప్పటిలాగే పింఛన్లు అందుతాయని లబ్ధిదారులు భావించారు. అందులోనూ దసరా ముందురోజు కావడంతో డబ్బులు చేతిలో పడితే పండుగ మరింత సంతోషంగా చేసుకోవచ్చన్న ఆశతో ప్రతినెలా తాము పెన్షన్లు అందుకునే ప్రాంగణాలకు ఉదయం ఏడు గంటలకల్లా చేరుకున్నారు. ప్రతినెల మాదిరిగా అదే సమయానికి సచివాలయ సిబ్బంది కూడా చేరుకుని పంపిణీ ప్రారంభించాలి. కానీ సమయం గడుస్తున్నా.. వారి జాడ లేదు. గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేక.. కొందరు ఫోన్లలో సిబ్బందిని సంప్రదించడానికి ప్రయత్నించినా ఎవరూ ఫోన్లు లిఫ్ట్‌ చేయలేదు. సమయం గడుస్తున్న కొద్దీ ఏం జరిగిందో తెలియక లబ్ధిదారుల్లో గందరగోళం, ఆందోళన పెరుగుతూ వచ్చాయి. అసలు వస్తారో రారో.. తాము ఉండాలో వెళ్లిపోవాలో తెలియక అల్లాడిపోయారు. డబ్బులందితే పండుగ గడుస్తుందని ఆశపడితే.. ఇప్పుడే అందుతాయో లేదోనన్న అనుమానంతో ప్రశాంతత కోల్పోయారు. నగరంలోని చాలా డివిజన్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాల్సిన పెన్షన్ల పంపిణీ 8.30 తర్వాత కానీ ప్రారంభం కాలేదు. అది కూడా సచివాలయ సిబ్బంది ఎవరో తెలిసిన ఒకరిద్దరికి ఫోన్లు చేసి సచివాలయంలో ఇస్తాం.. రమ్మని కబురు పెడితే.. అది ఆనోటా.. ఈనోటా పడి తెలిసిన తర్వాత లబ్ధిదారులు కాళ్లీడ్చుకుంటూ సచివాలయాల వైపు అడుగులు వేశారు. పైగా ఇకనుంచి ప్రతినెలా సచివాలయాల్లోనే పింఛన్లు పంపిణీ చేస్తామని సిబ్బంది చెబుతుండటం గమనార్హం.

సమ్మె పేరుతో సిబ్బంది నిర్వాకం

ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఇంత గందరగోళం రేగిందయ్యా అంటే.. దానికి కారణం.. సచివాలయ సిబ్బంది అనే అందరూ ఆరోపిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనకు ఇటీవలే ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఆందోళనలో భాగంగా పలు రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నారు. గతంలో వలంటీర్లు చేసిన పింఛన్ల పంపిణీని తమ నెత్తిన రుద్దారని, దాన్ని మార్చలన్నది వారి డిమాండ్లలో ఒకటి. అలాగే వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం మరో సమస్య. ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోగా దుర్గాష్టమి, దసరా సెలవు మధ్యలో ఉన్న రోజున కూడా తమను ఉదయాన్నే పెన్షన్ల పంపిణీకి తరమడం వారికి మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల పెన్షన్ల పంపిణీ సమయానికి జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి గానీ.. సచివాలయ ఉద్యోగుల జేఏసీ వైపు నుంచి గానీ ఎటువంటి సమాచారం లేకపోవడంతో యథాప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తారని లబ్ధిదారులందరూ భావించారు. ఆ మేరకు ఉదయాన్నే వచ్చేశారు. కానీ సిబ్బంది రాకపోవడంతో వార్డు ఇన్‌ఛార్జీలుగా ఉన్న టీడీపీ నాయకులను పలువురు ఫోన్లలో సంప్రదించగా.. పెన్షన్ల పంపిణీపై తమకు కూడా సరైన సమాచారం లేదని ఆ నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. పోనీ సచివాలయం వద్ద పంపిణీ చేస్తున్న విషయాన్ని ముందుగానే తమకు చెబితే లబ్ధిదారులను అప్రమత్తం చేసేవారమని 18వ డివిజన్‌ పరిధిలోని పుణ్యపువీధి, రాచకట్ల వీధి, కోటివీధి, కృష్ణా పార్క్‌ ప్రాంతాల టీడీపీ వార్డు ఇన్‌ఛార్జి చవిటిపల్లి గోవిందరావు వ్యాఖ్యానించారు. చివరికి గంటన్నర తర్వాత సచివాలయంలో పింఛన్లు ఇస్తున్నట్లు తీరిగ్గా చెప్పడంతో అందరూ సచివాలయాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే చాలామంది వృద్ధులు సచివాలయాలు ఎక్కడున్నాయో తెలియక, అక్కడికి నడుచుకుని వెళ్లలేక నానా అవస్థలు పడ్డారు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. దీనివల్ల సచివాలయ సిబ్బంది తీరు వల్ల పేదల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page