పేటలో ఆక్రమణల జోరు!
- BAGADI NARAYANARAO

- Jan 13
- 1 min read
ప్రభుత్వ స్థలాల్లో అడ్డగోలు నిర్మాణాలు
రాజకీయ ప్రాపకంతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

(సత్యంన్యూస్, నరసన్నపేట)
నరసన్నపేటలో భూ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇందిరానగర్ వద్ద నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్, మారుతీనగర్ జంక్షన్ వద్ద నిర్మించిన స్వీట్‌స్టాల్, ఫ్యాషన్ షాపు, షాపింగ్‌మాల్, రాజుల చెరువు గట్టు తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలు జరిగాయి. ఈ ఆక్రమణలు పట్టణ శివారు ప్రాంతాలకు సైతం విస్తరించాయి. కొందరు రాజకీయ నేతలు ఆక్రమణదారుల తరఫున అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారికి ఆనుకొని నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 3/15లో (ఎల్పీ నెంబర్ 11) 11 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని జమ్ము, తామరపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరిద్దరూ టీడీపీ నేతల పేరు చెప్పి అక్రమాలకు పాల్పడుతుంటే, రెవెన్యూ అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పి ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నారని స్థానిక వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని చదును చేసి నిర్మాణం కోసం మార్కింగ్ చేసినప్పుడే తహసీల్దార్‌కు గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేశారని, కానీ రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోకపోగా అక్రమ నిర్మాణానికి పునాదులు, శ్లాబ్ దగ్గరుండి వేయించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వైకాపా నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయితే ఈ విషయంలో తమపై ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఉన్నందున ఏమీ చేయలేమని ఆయన చేతులెత్తేశారని వైకాపా నాయకులు అంటున్నారు. కూటమి నేతల దన్నుతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ రూ.లక్షల్లో దండుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికైనా ఆక్రమణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.










Comments