top of page

పుత్రుడికి ‘దాతృత్వ’ నివాళి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 12
  • 2 min read
  • పారిశ్రామిక దిగ్గజం వేదాంత అనిల్‌కుమార్‌ స్ఫూర్తి

  • కుమారుడి మరణ వేదనలోనూ ఆస్తిలో మూడొంతులు విరాళం

  • తన వారసుడి కలలను సమాధి చేయలేనన్న తండ్రి

  • ఇప్పటికే సేవారంగంలో పని చేస్తున్న వేదాంత ఫౌండేషన్‌

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

భావోద్వేగాలకు తన పర భేదం ఉండదు.. పేద, ధనిక అన్న తారతమ్యం అసలే ఉండదు. అయినవారు పోతే ఆ బాధ అంచనాలకు, భౌతిక తేడాలకు అతీతమైనది. ఉన్నవారైనా, లేనివారైనా తమ అనుకున్నవారు దూరమైతే అనుభవించే వేదన ఒకేలా ఉంటుంది.. కాకపోతే దాన్ని వ్యక్తీకరించే తీరులోనే తేడాలు ఉంటాయి. ఇంటి వారసుడు, అందులోనూ అందివచ్చిన కొడుకు హఠాత్తుగా చనిపోతే ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. ఆ బాధ నుంచి కోలుకోవడానికే చాన్నాళ్లు పడుతుంది. అలాంటిది చెట్టంత కుమారుడిని కోల్పోయి పుట్టెడు బాధలో ఉన్న ఒక వ్యాపార దిగ్గజం తన బాధ్యత మర్చిపోకపోవడం భారతీయ సమాజాన్ని అబ్బురపరుస్తోంది. ఆ వ్యాపార దిగ్గజం మరెవరో కాదు.. ప్రముఖ అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థ అయిన వేదాంత గ్రూప్‌ అధిపతి అనిల్‌ అగర్వాల్‌. ఇటీవలే ఈయనకు పుత్రశోకం కలిగింది. తన వారసుడిగా సంస్థ నిర్వహణలో చేదోడువాదోడుగా ఉంటున్న కుమారుడు అగ్నివేష్‌ అనారోగ్యంతో మరణించడంతో అనిల్‌ అగర్వాల్‌, ఆయన కుటుంబం తీరని ఆవేదనలో మునిగిపోయింది. అయితే అంతటి వేదనలోనూ ఆయన తన బాధ్యత మర్చిపోలేదు. కుమారుడికి ఇచ్చిన మాటను అంతకంటే మర్చిపోలేదు. పుత్రుడి మరణాన్ని దిగమింగుతూనే.. అతనికిచ్చిన మాట నిలుపుకోవడానికి మించిన నివాళి పుత్రుడి ఇవ్వలేనని భావించారేమో. తన ఆస్తిలో ముప్పావు భాగానికిపైగా సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళంగా ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు.

అగ్రశ్రేణి పారిశ్రామిక గ్రూప్‌

దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో వేదాంత గ్రూప్‌ ముందు వరుసలో ఉంటుంది. అనిల్‌ అగర్వాల్‌కు చెందిన ఈ గ్రూప్‌ ఖనిజాలు, అయిల్‌ అండ్‌ గ్యాస్‌, విద్యుత్‌, మైనింగ్‌ రంగాల్లో పని చేస్తోంది. హిందుస్తాన్‌ జింక్‌ లిమిటెడ్‌, కెయిర్న్‌ ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, భారత్‌ అల్యూమినియం కంపెనీ(బాల్కో), స్టెరిలైట్‌ కాపర్‌, వేదాంత అల్యూమినియం, జూర్సుగుడ అల్యూమినియం స్మెల్టర్‌ వంటి పరిశ్రమలు వీరి యాజమాన్యంలోనివే. ఈ పరిశ్రమల టర్నోవర్‌ ఏటా లక్షల కోట్లలోనే ఉంటుంది. ఈయన కుమారుడు అగ్నివేష్‌. 1976 జూన్‌ మూడో తేదీన పాట్నాలో జన్మించిన ఈయన అజ్మీర్‌లోని మాయో కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. తండ్రి బాటలోనే పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి పుజైరా గోల్డ్‌ అనే సంస్థను స్థాపించారు. కుటుంబానికి చెందిన హిందుస్తాన్‌ జింక్‌కు ఛైర్మన్‌గా కూడా పని చేశారు. అమెరికాలో జరిగిన స్కీయింగ్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అగ్నివేష్‌ అగర్వాల్‌(49) న్యూయార్క్‌లోని మౌంట్‌ షినాయ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని ఆనందాన్ని ఆవిరి చేస్తూ గుండెపోటుకు గురై ఈ నెల ఏదో తేదీన మరణించారు. అగ్నివేష్‌ మరణంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకుంటూనే తన కుమారుడికి ఇచ్చిన మాట ప్రకారం తన సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువ భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు దానం చేయనున్నట్లు అనిల్‌ అగర్వాలో ప్రకటించారు.

కుమారుడికి ఇచ్చిన మాట

తన కుమారుడికి గతంలో ఇచ్చిన మాట ప్రకారం తన ఆస్తిలో సింహభాగం దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా అనిల్‌ అగర్వాల్‌ తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ దాతృత్వ ప్రకటనను కుమారుడి కోరిక మేరకు అనిల్‌ 2014లోనే చేశారు. బిల్‌గేట్స్‌ స్ఫూర్తితో ‘గివింగ్‌ ప్లెడ్జ్‌’లో చేరి కుటుంబ సంపదలో 75 శాతం దానం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే అనిల్‌ అగర్వాల్‌ ఫౌండేషన్‌ ద్వారా వేదాంత గ్రూప్‌ విద్య, ఆరోగ్యం, పేదరిక నిర్మూలన వంటి రంగాల్లో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. భావోద్వేగపూరితంగా ఉన్న ఆ పోస్ట్‌లో తన కుమారుడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను సంపాదించిన దాంట్లో మెజారిటీ సొమ్మును సమాజ సేవకు ఉపయోగిస్తానని నా కొడుకు అగ్నివేష్‌కు గతంలోనే మాట ఇచ్చాను. జీవితాంతం తోడుగా ఉంటాడని, తాన వ్యాపార, కుటంబ బాధ్యతలను కొనసాగిస్తాడనుకున్న కొడుకు అర్థంతరంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు. నేడు వాడి భౌతికకాయాన్ని సమాధి చేయక తప్పలేదు. కానీ వాడి కలలను , వాడికిచ్చిన మాటను మాత్రం సమాధి చేయను’ అని అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం అనిల్‌ అగర్వాల్‌ కుటుంబ నికర ఆస్తి విలువ దాదాపు 4.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 35,000 కోట్లు). ఇందులో 75 శాతానికిపైగా అంటే సుమారు రూ.25 వేల కోట్లు ఆయన దానం చేయనున్నారు. దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే తన కుమారుడి కల అని అనిల్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘దేశంలో ఏ ఒక్క బిడ్డ ఆకలితో నిద్రపోకూడదు, ప్రతి ఒక్కరికీ విద్య అందాలి, మహిళా సాధికారత పెరగాలి. యువతకు ఉపాధి అవకాశాలు లభించాలి. వాడు లేని జీవితం వెలితిగా ఉన్నా ఈ సామాజిక లక్ష్యాలను సాధించడం ద్వారా వాడికి నిజమైన నివాళి అర్పిస్తాను’ ఆయన తన పోస్టులో పేర్కొనడం గుండెలను కదిలించకమానదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page