పంతమా.. పదవా.. సందిగ్ధంలో జగన్!
- DV RAMANA
- 1 day ago
- 2 min read

రాజకీయ పోరాటాలు రెండు రకాలు. ఒకటి ప్రజల కోసం జరిపేది.. రెండోది వ్యక్తిగత, పార్టీ మనుగడ కోసం జరిపేది. ప్రజల కోసం పోరాటాల మాటెలా ఉన్నా.. పార్టీలు, నాయకులు తమ ఉనికిని ప్రకటించుకోవడానికే పోరాడుతుంటారు. వాటికే ప్రజాపోరాటాలుగా కలరింగ్ ఇస్తుం టారు. పైగా ప్రజాసేవకు అధికారానికి ముడిపెడుతుంటారు. అధికారంలో లేనందున ఏమీ చేయలేకపోతున్నామని, తమకు అధికారం ఇస్తే ఏదేదో చేసేస్తామని చెబుతుంటారు. అధికారం లేకపోయినా ఆ హోదా కోసం అర్రులు చాస్తుంటారు. వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ అదే ఆరా టం కనబరుస్తున్నారు. తనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతు న్నారు. రాజ్యాంగం ప్రకారం అది కుదరదంటున్నా.. మంకుపట్టు వీడకపోగా దానికోసం పంతం పూనారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది లేదని భీష్మించుక్కూర్చున్నారు. అదే ఇప్పుడు ఆయన్ను ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. హోదా కోసం పట్టు పడితే ఉన్న ఎమ్మెల్యే పదవి కాస్త ఊడిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. ఆయన ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. పంతానికి కట్టుబడి పట్టుదలకు చిరునామా అన్న పేరు నిలబెట్టుకోవడం లేదా పంతం వీడి ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడం. వీటిలో ఆయన ఏ ఆప్షన్ ఎంచుకుంటా రన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది. ఈ నెల 18న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు అసెంబ్లీని బహిష్కరిస్తూ వస్తున్న ఆయన దానికే కట్టుబడితే ఎమ్మెల్యే పదవికే ముప్పు ఏర్పడుతుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ వైకాపా 11 స్థానాలకే పరిమితమై అధికారం కోల్పోయింది. అధికార కూటమి తర్వాత తమ పార్టీయే సీట్ల పరంగా రెండో స్థానంలో ఉన్నందున ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ తొలి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన 18 మంది (పది శాతం) సభ్యుల బలం ఆ పార్టీకి లేదు. ఈ కారణంతోనే వైకాపాకు ఆ హోదా ఇచ్చేం దుకు స్పీకర్ నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, గౌరవం లేని సభలో అడుగుపెట్టేది లేదని, ప్రజాక్షేత్రమే తమ వేదిక అని ప్రకటించి జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప సభలో అడుగుపెట్టేదిలేదని పంతం పూనారు. ఈ నిర్ణయం ఆయనొక్కడికే పరిమితం కాలేదు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ అదే వర్తింపజేశారు. దాంతో వైకాపాకు చెందిన మొత్తం 11 మంది ఎమ్మెల్యేలూ ఒక్క గవర్నర్ ప్రసంగం రోజు తప్ప సమావేశాల్లో ఇంతవరకు పాల్గొనలేదు. అయితే ఇప్పుడు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే.. ఇటువంటి రాజకీయ పంతాలకు రాజ్యాంగం ఒక గడువు పెట్టింది. ఆర్టికల్ 190(4) ప్రకారం సభ అనుమతి లేకుండా ఒక సభ్యుడు వరుసగా 60 సమావేశ దినాల్లో గైర్హాజరైతే ఆ సభ్యుడి ఎమ్మెల్యే పదవిని రద్దుచేసి.. ఆ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. అంటే జగన్ తన బహిష్కరణను కొనసాగిస్తే తన శాసనసభ్యత్వానికే దూరం కావాల్సి వస్తుంది. ప్రతిపక్ష హోదా కోల్పోవడం కంటే ఇది పెద్ద నష్టం. పులివెందుల ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచినట్టు అవుతుంది. ఇది వైకాపాకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలకూ వర్తిస్తుంది. రాజకీయ పంతాలు, వ్యూహాలను పరిస్థితులను బట్టి మార్చుకోవచ్చు. కానీ, రాజ్యాంగ నిబంధనలు శాశ్వతం. పంతం కోసం నిబంధనలను కాల రాయలేం. అలాగని పంతం కోసం పదవిని ఫణంగా పెట్టడం కూడా రాజకీయంగా ఆత్మహత్యా సదృశమే. సభకు దూరంగా ఉండటం మిగిలిన పది మంది ఎమ్మెల్యేల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. అసెంబ్లీ అనేది ప్రభుత్వ తప్పులను, విధానాలను అధికారికంగా ప్రశ్నించడానికి, ప్రజల వాణిని వినిపించే అవకాశం కల్పించే అతిపెద్ద వేదిక. దాన్ని వదులుకోవడమంటే ప్రత్యర్థికి లేదా అధికార పార్టీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే. అందువల్ల అంతిమ నిర్ణయం స్పష్టంగానే కనిపిస్తోంది. పంతం కన్నా పదవిని, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి జగన్ అసెంబ్లీకి తిరిగి రావడం అనివార్యం. ఈ పునరాగమనాన్ని ఓటమిగా కాకుండా సభ లోపల పోరాటాన్ని కొనసాగించే వ్యూహాత్మక ఎత్తుగడగా ప్రచారం చేసుకుంటే మేలు.
Comments