పాతవారు పోయె.. కొత్త డాన్ వచ్చె..!
- BAGADI NARAYANARAO

- Jun 19, 2025
- 2 min read
ఎస్పీ ట్రీట్మెంట్‌కు అన్నీ మూసుకున్న నిర్వాహకులు
కొత్త దుకాణాలు తెరిచిన చంద్ర
ఒడిశాలో మూడు పేకాట కేంద్రాలు
జిల్లా నుంచి వెళ్తున్న పేకాట బాబులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో ఉన్నత చదువులు అభ్యసించినవారికి ఉద్యోగాలు దొరకడంలేదు. ఇంతకు క్రితమే ఉద్యోగాలు సంపాదించుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కాస్ట్ కటింగ్ పేరుతో పింక్ స్లిప్‌తో బయటకు వచ్చేస్తున్నారు. కానీ ఏ చదువూ లేని పోరంబోకులు మాత్రం జిల్లాలో అరాచకాలు చేస్తూ దండిగా సొమ్ములు సంపాదిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో రూ.30 వడ్డీకి రౌడీ బ్యాచ్ అంతా తిప్పుతోంది. బెట్టింగులు ఆడేవారు, పేకాట శిబిరాలకు వెళ్లేవారే వీరి కస్టమర్లు. గంజాయి తాగడానికి అలవాటుపడి, దాని మీద మందు కొట్టి ఎంత అప్పు చేస్తున్నాం, ఎంత పేకాటలో ఓడిపోతున్నామని గ్రహించలేని అభాగ్యుల వల్లే జిల్లాలో కొత్త క్యాంపస్‌లు వెలుస్తున్నాయి. ఇవేవో ఇంజినీరింగ్ కాలేజీలో, లేదూ అంటే సాఫ్ట్‌వేర్ సంస్థలో కావు. పేకాట శిబిరాలు. ఆడేవారు మీద పోలీసు దాడులు లేకుండా చూసేందుకు జిల్లా వ్యాప్తంగా కొందర్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు బయట ప్రోపగండా మొదలుపెట్టి తమ దగ్గర పేకాడితే ఒక్క రాత్రిలోనే లక్షలు సంపాదించొచ్చవచ్చని మభ్యపెట్టి పేకాట శిబిరాలకు తరలిస్తున్నారు. జిల్లా ఎస్పీ మహేశ్వర్‌రెడ్డి ఇటువంటి వారి మీద ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు కొత్త జనరేషన్ ఇందులోకి రిక్రూట్ అవుతుంది. అందులోని ఒకడే పోలాకి చెందిన చంద్ర.
కాపుకాసి పట్టుకున్నారు.
పేకాట శిబిరాలు నిర్వహించడం, ఆడడం, జట్టులుగా ఆడిరచడం, శిబిరాలకు జూదర్లను తరలించడం వీడి ఉద్యోగం. కొన్నేళ్లు క్రితం వరకు పేకాట శిబిరాల నిర్వాహకుల సహాయకుడిగా రోజువారి కూలీకి పనిచేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి కమీషన్ తీసుకొని జూదర్లను తరలించడానికి వాహనాలు సమకూర్చాడు. ప్రస్తుతం సొంతంగా పేకాట శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. నిర్వాహకులపై ఎస్పీ ఉక్కుపాదం మోపడంతో ఈ ఏడాది జనవరి నుంచి పేకాట శిబిరాల నిర్వాహకులు అన్నీ మూసుకు కూర్చున్నారు. దీన్ని అదనుగా చూసికొని చంద్ర ఒడిశాలోని కాశీనగర్, గురండి, రాణిపేట వద్ద మూడు శిబిరాలు ఏర్పాటుచేసి పేకాట ఆడిస్తున్నట్టు భోగట్టా. వారం క్రితం పేకాట శిబిరానికి వెళుతుండగా మెళియాపుట్టి వద్ద పోలీసులు కాపుకాసి పట్టుకున్నారు. రోజంతా స్టేషన్‌లో కూర్చోబెట్టి విడిచిపెట్టేశారు. దీంతో చంద్రకు ధైర్యం పెరిగిపోయింది. కాశీనగర్‌లో రామినాయుడు, రాణిపేటలో హిరమండలం పరిధిలోని అవలింగికి చెందిన చిన్నారావు, గోవిందరావు, గురండిలో పర్లాకిమిడికి చెందిన బుడ్డు, ఒడిశాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తున్న కుమార్‌లతో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూడుచోట్ల నిర్వహిస్తున్న శిబిరాలకు చంద్రానే బాస్ అని చెప్పుకుంటున్నారు. ఈ శిబిరాలకు మందస, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం నుంచి జూదర్లను వాహనాల్లో తరలించే బాధ్యతను చంద్రానే చూస్తున్నాడటే. ఈ మూడుచోట్ల పేకాట శిబిరాలను పర్యవేక్షిస్తున్న చిన్నారావు, రామినాయుడు గతంలో హిరమండలం పోలీసులకు ఒకసారి, టాస్క్‌ఫోర్స్‌కు మరోసారి చిక్కారు. వీరితో చంద్ర జత కట్టడంతో ఒడిశా బాటపట్టారు.
కౌన్సిలింగ్ ఇచ్చినా
రోజూ మెళియాపుట్టి మీదుగా పర్లాకిమిడి నుంచి ఒడిశాలోని కాశీనగర్, రాణిపేట, గురండిలకు వెళ్లి పర్యవేక్షిస్తున్న సమయంలోనే మెళియాపుట్టి పోలీసులు చంద్ర వాహనాన్ని అడ్డగించి విచారించి ఒడిశాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాల వివరాలను సేకరించారు. గతంలో పేకాట ఆడుతున్న, శిబిరాలు నిర్వహిస్తున్న వారిని పోలీస్‌స్టేషన్లకు పిలిపించి బైండోవర్ చేసి విడిచిపెట్టారు. అందులో చంద్ర ఉన్నాడు. నరసన్నపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌కు పలుమార్లు చంద్రను అధికారులు పిలిపించి హెచ్చరించారు. అయినా చంద్ర పట్టించుకోలేదు. శ్రీకాకుళం పరిధిలో ఉన్న పేకాట శిబిరాలు నిర్వాహకులను ఎస్పీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాచ్ అంతా వారి సొంత పనుల్లో నిమగ్నమైపోయారు. ఇది జరిగిన తర్వాత నరసన్నపేట పరిధిలో ఉన్న చంద్ర మాత్రం పేకాట శిబిరాలు నిర్వహించే పనిలో బిజీగా మారిపోయాడు. పోలీసులతో మాట్లాడిన తర్వాతనే ఒడిశాలో పేకాట శిబిరాలు నిర్వహించి, మనుషులను తీసుకువెళుతున్నట్టు చంద్ర బహిరంగంగా చెబుతున్నాడట. ఒడిశాలోని గారబందలో పేకాట శిబిరాలపై పలాస సర్కిల్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులను పట్టుకొనే ప్రయత్నం కొన్ని రోజులు క్రితం చేశారు. ఆ సందర్భంలో స్థానికులు ఎదురు తిరగడంతో పలాస పోలీసులు వెనక్కి వచ్చేశారు. అందులో చంద్ర ప్రధాన సూత్రధారి అని ప్రచారం ఉంది.










Comments