top of page

పెద్దోళ్లు గుర్తుంచుకోవాల్సిన లైఫ్‌ లెసన్‌

  • Guest Writer
  • May 16
  • 2 min read

అధికారులైనా, రాజకీయ నాయకులైనా గుర్తు పెట్టుకోవాల్సిన లైఫ్‌ లెసన్స్‌ వల్లభనేని వంశీ, ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, ఐపీఎస్‌ పిఎస్‌ఆర్‌ ఆంజనేయుల అనుభవాలు. అధికారం శాశ్వతం కాదన్న రాజకీయ నాయకుల మాటలు డైరీలో రాసిపెట్టుకోవాలి. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతి నాయకుడ్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ దూషిస్తే రెడ్‌బుక్‌లో పేర్లు నమోదు అవుతాయన్న విషయం తెలుసుకోవాలి.

రాజకీయాలు గతంలోలా లేవు. ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి. దాని పర్యవసానాలు కూడా తీవ్రంగా ఉంటాయ్‌. గడిచిన రెండు నెలలుగా జైల్లోనే మగ్గుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటే ఏంటో ప్రాక్టికల్‌గా ఆయనకు తెలిసివచ్చి ఉంటుంది.

ఎంత డబ్బున్నా, ఎంతమంది లాయర్లున్నా, నాయకుడు తోడున్నా, ఎవరూ ఆయన్ని బయటికి తీసుకురాలేకపోతున్నారు. బెయిల్‌ రావడం ఆలస్యం అవుతుంది. అతడి మీద పెట్టిన సెక్షన్లు అటువంటివి. ఒక కేసులో బెయిల్‌ వస్తే, ఇంకో కేసులో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ అవుతుంది. లేటెస్ట్‌గా నూజివీడులో వంశీ మీద ఇంకో కేసు ఫైల్‌ అయ్యింది. రాజకీయాల్లో వంశీ ఒక్కరే రౌడీయిజం చేశారా? ఇంకా చాలామంది ఉన్నారు కదా? ఆ మాటకొస్తే మన ఎమ్మెల్యేలలో చాలామంది రౌడీలే కదా? మరి ఎందుకు వంశీ ఒక్కడే ఇంత టార్గెట్‌ అయ్యారు?

బియాండ్‌ ద పాలిటిక్స్‌

రాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం. ఇవి లేకుండా రాజకీయాలు లేవు. అయితే వంశీ ఈ లైన్‌ క్రాస్‌ చేశారు. విమర్శల స్థానంలో బూతులు రంగ ప్రవేశం చేశాయి. అధికారం చేతిలో ఉంది కదాని ప్రతి నాయకుడ్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసుకుని బూతులు గుప్పించారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన చంద్రబాబు సైతం చిన్న పిల్లాడిలా భోరున ఏడ్చారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

...

ఏపీలో అధికారాలు మారాయి. వంశీ గన్నవరంలో ఓడిపోయారు. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు అయినా వంశీని మర్చిపోయారేమో కానీ లోకేష్‌ మర్చిపోలేదు. రెడ్‌బుక్‌లో పేర్లు రాసుకుంటున్నా.. అధికారంలోకి వస్తే ముందు వాళ్లే నా టార్గెట్‌ అవుతారని ఓపెన్‌గా చెప్పి మరీ టార్గెట్‌ చేశారు లోకేష్‌. అనుకున్నట్టుగానే వంశీని టార్గెట్‌ చేశారు. ఫలితం నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లతో ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద కేసు నమోదు.

వంశీ మీద పెట్టిన కేసులు రాజకీయ కక్ష సాధింపులో భాగమా? కాదా? వంశీ మీద పెట్టిన కేసులు నిలబడతాయా? లేదా? అన్నది సెకండరీ. ప్రస్తుతం జైలు జీవితంతో అనారోగ్యాల పాలై ఇబ్బందులు పడుతున్నారన్నది నిజం. అప్పట్లో వంశీతో పాటు చంద్రబాబును విమర్శించిన కొంతమంది నాయకులు ఇప్పుడు కూడా విమర్శిస్తున్నారు. అయితే అవన్నీ రాజకీయాల్లో భాగం. కాబట్టి ఏ పార్టీలో ఉన్న నాయకులు అయినా తెలుసుకోవాల్సిన సత్యాలు రెండు. అధికారం శాశ్వతం కాదు.. రాజకీయాల్లో విమర్శలకే స్థానం ఉంటుంది, వ్యక్తిగత దూషణలకు ఉండదు.

...

అలాగే అధికారంలో ఉన్న నాయకులు చెప్పారని ఇష్టారాజ్యంగా ఫైళ్ల మీద అధికారులు సంతకాలు పెడితే ఐఏఎస్‌ శ్రీలక్ష్మిలా, ఐపీఎస్‌ ఆంజనేయులులా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. ఓబులాపురం మైనింగ్‌ కేసులో శ్రీలక్ష్మిని తిరిగి విచారించాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. నటి జిత్వానీ కేసులో అధికార పార్టీ నాయకుల మాట విని అధికార దుర్వినియోగం చేసిన కేసులో ప్రస్తుతం ఆంజనేయులు జైళ్లో ఉన్నారు.

...

ఉపసంహారం: ఇప్పుడు అధికారం చేతిలో ఉంది కదాని టీడీపీ నాయకులు బియాండ్‌ ద లైన్‌ వెళ్తే భవిష్యత్తులో ఒకవేళ వైకాపా అధికారంలోకి వస్తే ఇదే చరిత్ర పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పెద్దలు చెప్పారు కదాని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అధికారులు కూడా ఆలోచించుకోవాలి !

- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page