top of page

పెద్దన్న దన్నుతోనే చిట్టెలుక చిందులు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 5 days ago
  • 3 min read

ప్రస్తుతం పశ్చిమాసియా భగ్గుమంటుండటానికి అసలు సూత్రధారి ఇజ్రాయెల్. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ.. చివరికి ఆ దేశాన్నే సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడంలో ఇజ్రాయెల్ సిద్ధహస్తురాలు. పశ్చిమాసియాలో యూదులు, అరబ్బుల మధ్య గొడవలు ఇప్పటివి కావు. శతాబ్దాలుగా ఇవి యుద్ధజ్వాలలు రగిలిస్తూనే ఉన్నాయి. పెద్దసంఖ్యలో ఉన్న అరబ్బు దేశాలు యూదులకు నిలువనీడ లేకుండా చేశారన్నది చారిత్రక వాస్తవమే కావచ్చు. ఇప్పటికీ ఆ వివాదాలు రావణ కాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంపాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న యూదు జాతి ఎట్టకేలకు 1948 మే 14న స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అయితే బ్రిటీషర్ల నుంచి విముక్తి పొంది ఆవిర్భవించిన కొత్త దేశానికి జెరూసలేంను రాజధానిగా చేసుకోవడం, పాలస్తీనాలోని కొన్ని ప్రాంతాలను బలవంతంగా తనలో కలుపుకోవడంతోపాటు, చుట్టుపక్కల అరబ్ దేశాలకు చెందిన సరిహద్దులను అతిక్రమించడం వల్ల వాటితో నిత్యం కయ్యాలు తప్పడంలేదు. గతంలో కోల్పోయిన భూభాగాల కోసం అనేక దేశాలతో, ముఖ్యంగా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంది. వాస్తవానికి ఇజ్రాయెల్ చిట్టెలుకలాంటిది. విస్తీర్ణం పరంగా చాలా చిన్న దేశం. మన తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణలో ఐదువంతు మాత్రమే ఉంటుంది. ఆ దేశ మొత్తం విస్తీర్ణం 22,145 చ.కిలోమీటర్లు మాత్రమే. భౌగోళికంగా పిపీలికమంత ఉండే ఇజ్రాయెల్ మన దేశంలోని ఓ జిల్లా కంటే తక్కువ పరిమాణంలో ఉంటుంది. అయితే పెద్ద దేశాలతో వివిధ రంగాల్లో పోటీ పడుతూ రక్షణ, తదితర అనేక రంగాల్లో వాటిని సవాల్ చేసే స్థాయికి ఎదగింది. మరోవైపు దశాబ్దాలుగా యుద్ధాలు చేస్తూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇజ్రాయెల్ 1948లో దేశంగా ఏర్పడినప్పటి నుండి తన ఉనికి కోసం, భూభాగాల కోసం అనేక దేశాలతో, ముఖ్యంగా అరబ్ దేశాలతో నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంది. ఆ దేశ జనాభా 98 లక్షల నుంచి ఒక కోటి లోపే ఉంటుంది. అంటే జనాభా పరంగా కూడా తెలంగాణ రాష్ట్రం కంటే ఇజ్రాయెల్ మూడున్నర రెట్లు చిన్నదన్నమాట. మాతభూమి కోసం, మనుగడ కోసం శతాబ్దాల తరబడి పోరాటాలు చేసిన ఇజ్రాయెల్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా తన చుట్టూ ఉన్న ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్, పాలస్తీనా తదితర దేశాలతో పోరాటాలు చేస్తూనే ఉంది. దీనికి కారణం.. యూదులకు ఒక ప్రత్యేక దేశం ఏర్పడటం అరబ్బులకు ఇష్టం లేకపోవడంతోపాటు వారి భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించడమేనని చరిత్రకారులు చెబుతారు. ఈ క్రమంలో ఆ దేశాలతో ఇజ్రాయెల్ వరుసగా యుద్ధాలు చేస్తూనే ఉంది. 1982 నుంచి 2006 వరకు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న పాలస్తీనా విముక్తి సంస్థ, హిజ్బుల్ మొజాహిదీన్‌లు లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధాలు చేసింది. 2008, 2012, 2014, 2021 సంవత్సరాల్లో హమాస్‌తో ఎడతెగని యుద్ధం నడిచింది. పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ కోసం, మరోవైపు హౌతీలతోనే నిరంతర పోరాటాలు చేస్తున్న ఇజ్రాయెల్ గత నెల రోజులుగా ఆపరేషన్ ప్యూరీ పేరుతో అమెరికాతో కలిసి ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొంటున్నది. అతి చిన్నదేశమైన ఇజ్రాయెల్ దశాబ్దాలుగా యుద్ధాలు చేయడానికి అవసరమైన భారీస్థాయి ఆర్థిక, సైనిక వనరులు ఎక్కడినుంచి వస్తున్నాయన్నది ప్రశ్న. అయితే కేవలం సైనిక బలంతోనే కాకుండా పటిష్టమైన ఆర్థిక వ్యూహాలు, అంతర్జాతీయ మిత్రదేశాల మద్దతు ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా అండదండలు ఇజ్రాయెల్‌ను నిలబెడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తన చుట్టూ ఉన్న అరబ్బు దేశాల నుంచి రక్షణ కోసం ప్రపంచ పెద్దన్నగా చెలామణీ అవుతున్న అమెరికా వద్ద అణిగిమణిగి ఉంటున్నదన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి కూడా అమెరికాను ఇజ్రాయెల్ రెచ్చగొట్టడమే కారణమన్నది వాస్తవం. అణు ఒప్పందానికి ముందుకు రాకపోవడాన్ని సాకుగా చూపి ఇరాన్‌పై విరుచుకుపడేలా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇజ్రాయెల్ రెచ్చగొట్టింది. దీనికితోడు ఏళ్ల తరబడి దాడులు, శత్రు దేశాలతో యుద్ధాలు చేస్తుందంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఆయుధ సంపత్తి, ఆదాయ వనరులు ఎన్ని ఉన్నాయి.. వాటిని ఎలా సమకూర్చుకుంటుందన్నది ఆసక్తికరం. ఈ విషయంలో కూడా అమెరికాయే ఆ దేశానికి పెద్ద ఆదరువు. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్‌లో అగ్రరాజ్యం సాయమే అత్యంత కీలకం. ఈ దేశానికి ప్రతి ఏటా అమెరికా సుమారు 3.8 బిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందిస్తున్నది. యుద్ధ సమయాల్లో ఇది మరింత పెరుగుతుంది. ఇటీవల అమెరికా కాంగ్రెస్ అదనంగా బిలియన్ల కొద్దీ డాలర్లను యుద్ధ అవసరాల కోసం.. ముఖ్యంగా ఐరన్ డోమ్ క్షిపణుల తయారీకి మంజూరు చేసింది. విస్తీర్ణం, జనాభా పరంగా ఇజ్రాయెల్ చాలా చిన్న దేశమైనా ఆర్థికంగా మాత్రం చాలా అభివృద్ధి చెందిన దేశం. అక్కడి ప్రజల తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ రంగాల్లో అగ్రస్థానంలో ఉండటమే దీనికి కారణం. ఈ పరిశ్రమల ద్వారా వచ్చే పన్నులే ఇజ్రాయెల్ ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు ఇజ్రాయెల్ ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా తమ స్వదేశానికి భారీగా నిధులు సమకూరుస్తున్నారు. ఆయుధ రంగం కూడా కీలకమైన ఆదాయ వనరుగా ఉంది. తన అవసరాలకు ఆయుధాలు కొనుగోలు చేయడమే కాకుండా అత్యాధునిక ఆయుధాలు తయారు చేస్తూ అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, పెగాసెస్ వంటి నిఘా సాఫ్ట్‌వేర్ విక్రయించడం ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్నది. మధ్యధరా సముద్రంలో లభించిన సహజ వాయువు నిల్వలు ఇజ్రాయెల్‌ను ఇంధన దిగుమతిదారుగా ఉండే దుస్థితి నుంచి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగేలా చేశాయి. సహజ వాయువు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తోంది. ఇవే ఇజ్రాయెల్‌ను యుద్ధోన్మాదిగా మారుస్తున్నాయన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page