‘పెద్దల’తో టీడీపీకి చిక్కులే!
- DV RAMANA

- 2 days ago
- 2 min read

మన రాష్ట్ర కోటాలోని రాజ్యసభ సీట్లు వచ్చే జూన్‌లోగానీ ఖాళీ కావు. ఆ నెలలో నలుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుండటంతో.. ఆలోగా ఆ నాలుగు సీట్లకు కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. కానీ ఇప్పటినుంచే అధికార ఎన్డీయే కూటమిలో రాజ్యసభ పదవుల రేస్ ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. ఇదే సందర్భంగా రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి పార్లమెంటులో పెద్దల సభగా పేర్కొనే రాజ్యసభ అంతగా అచ్చిరావడంలేదన్న చర్చ తెరపైకి వచ్చింది. నాలుగు దశాబ్దాలకుపైగా తెలుగుదేశం చరిత్రను పరిశీలిస్తే ఆ చర్చలో నిజముందనిపించకమానదు. టీడీపీని స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన నాటినుంచీ ఆ పార్టీ తరఫున సుమారు 40 మంది నేతలు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. పార్టీలో అత్యంత సీనియర్లు, ఇతర నేతలకు దిశానిర్దేశం చేసే స్థాయి ఉన్నవారు, మేథావులుగా పేరొందినవారే ఎక్కువగా రాజ్యసభకు వెళ్లారు. అయితే టీడీపీ ప్రతినిధులుగా పెద్దల సభలో అడుగుపెట్టినవారిలో అనేకమంది ఆ తర్వాత కాలంలో పార్టీని వీడటమో, అధినేతలపై తిరుగుబాటు చేయడమో జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ప్రస్తుత చంద్రబాబు 3.0 ప్రభుత్వ హయాం వరకు చూస్తే టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన నేతల్లో అధికశాతం మంది పార్టీపై తిరుగుబాటు చేసిన వారే కనిపిస్తున్నారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో తొలిసారి ఆ పార్టీ నుంచి పి.ఉపేంద్ర, బి.సత్యనారాయణరెడ్డి, యల్లా శశిభూషణరావు, పుట్టపాక రాధాకృష్ణ వంటి ప్రముఖులు రాజ్యసభలో అడుగుపెట్టారు. అయితే ఉపేంద్ర, సత్యనారాయణరెడ్డి తమ పదవీకాలం పూర్తయిన తర్వాత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అలాగే ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన రేణుకా చౌదరి, ఎన్.తులసిరెడ్డి, మోహన్‌బాబు, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, కిమిడి కళావెంటరావు, సి.రామచంద్రయ్య తదితరులు కూడా రాజ్యసభ సభ్యులుగా అవకాశం అందుకున్నా ఆ తర్వాత టీడీపీకి రాంరాం చెప్పేశారు. ఎన్టీఆర్ తదనంతరం మోహనబాబు, యార్లగడ్డ లక్ష్మిప్రసాద్, సి.రామచంద్రయ్య టీడీపీకి రాజీనామా చేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మోహన్‌బాబు ఆ తర్వాత టీడీపీ వైపు చూడనేలేదు. సి.రామచంద్రయ్య నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి.. అనంతరం ప్రజారాజ్యంలోకి, అక్కడి నుంచి వైకాపాలోకి వెళ్లి ఎమ్మెల్సీ పదవి కూడా పొందారు. చేశారు. కానీ గత ఎన్నికల ముందు తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావును అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా టీడీపీ అధిష్టానం రాజ్యసభకు పంపి గౌరవించింది. అయితే ఎంపీ పదవీకాలం పూర్తయిన తర్వాత ఆయన ప్రజారాజ్యంలోకి ఫిరాయించి అధినేత చంద్రబాబుకు రaలక్ ఇచ్చారు. రేణుకాచౌదరి, జయప్రద, వంగా గీత, గుండు సుధారాణి వంటి మహిళా నేతలు సైతం టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పెద్దల సభలో అడుగుపెట్టారు. కానీ వీరంతా తర్వాత కాలంలో ఆ పార్టీకి దూరమయ్యారు. అదేవిధంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరొందిన సీఎం రమేష్, సుజనా చౌదరిలతోపాటు టీజీ వెంకటేశ్, గరిపాటి మోహనరావులు టీడీపీ నుంచి రాజ్యసభ అవకాశం అందుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వారు పార్టీని వీడటమే కాకుండా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని ఏకంగా బీజేపీలో విలీనం చేశారు. ఈ నలుగురిలో సుజనా చౌదరికి కేంద్ర మంత్రిగా కూడా పార్టీ అవకాశం ఇచ్చింది. సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు వ్యాపార కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందని అధినేతకు చెప్పారని అప్పట్లో ప్రచారం జరగ్గా, అంతకుముందు పార్టీని వీడిన వారంతా రాజకీయ ప్రయోజనాలను ఆశించారన్న విమర్శలు వినిపించాయి. అసలు ఈ చర్చకు దారితీయడానికి త్వరలో రాజ్యసభ ఎన్నికలు జరగనుండటమే. జూన్‌లో ఏర్పడనున్న నాలుగు ఖాళీలకు మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం అధికార కూటమిలోని మూడు పార్టీల నేతల మధ్య ఇప్పటినుంచే ఆసక్తికర పోటీ మొదలైపోయింది. నాలుగు సీట్లు ఖాళీ అవుతుంటే ప్రతిపార్టీ నుంచీ పదుల సంఖ్యలోనే ఆశావహులు పోటీపడుతున్నారు. ఎవరికి తోచిన ఈక్వేషన్లతోపారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమి పార్టీల ఆధిపత్యమే ఉంది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఖాళీ అయ్యే నాలుగు సీట్లనూ కూటమి పార్టీలే చేజిక్కించుకుంటాయి. ప్రతిపక్ష వైకాపాకు సంఖ్యాబలం లేనందున ఆ పార్టీ పోటీలో ఉండదు. ఏపీ నుంచి ప్రస్తుతం 11 మంది నేతలు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఏడుగురు వైకాపా సభ్యులు కాగా టీడీపీ, బీజేపీలకు చెరో ఇద్దరు ఉన్నారు. జూన్ 21న వైకాపాకు చెందిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిమళ్ నత్వానీలతోపాటు గత డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుంచి గెలిచిన సానా సతీష్ కూడా రిటైర్ అవుతారు. ఏడాదిన్నర మాత్రమే ఆ పదవిలో ఉన్నందున సతీష్‌ను మళ్లీ నామినేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన నారా లోకేష్‌కు సన్నిహితుడిగా పేరుంది. ఇక వైకాపా సభ్యులు ఖాళీ చేసే మూడు స్థానాల్లోనే కూటమి పార్టీల తరఫున కొత్తవారికి ఛాన్స్ లభించవచ్చు. ఈ మూడిరటిలో జనసేన, బీజేపీలకు చెరొకటి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే తెలుగుదేశం నుంచి ఇంకొకరికి మాత్రమే కొత్తగా అవకాశం లభించవచ్చు. ఆ ఒక్క సీటు కోసం పదిమందికిపైగా సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా మిగతావారు అలకపాన్పు ఎక్కే ప్రమాదముంది. దాంతో ఈసారి రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక టీడీపీ నాయకత్వానికి కత్తి మీద సాములాంటిదే.










Comments