top of page

బీజేపీ ‘మిషన్‌ బెంగాల్‌’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 3 days ago
  • 2 min read

ree

‘మా నెక్ట్స్‌ టార్గెట్‌ పశ్చిమబెంగాల్‌’.. బీహార్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ సారధులు నరేంద్ర మోదీ, అమిత్‌షా చేసిన ప్రకటన ఇది. అంటే బెంగాల్‌పై దండయాత్రకు ఎన్డీయే కూటమిని ఇప్పటినుంచే సిద్ధం చేస్తున్నట్లు తేటతెల్లమవుతోంది. ఆ రాష్ట్రంలో వచ్చే మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో కమల దళపతులు చేసిన ప్రకటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి బహిరంగ సవాల్‌ విసరడమే. కమ్యూనిస్టు కోటగా ఉన్న బెంగాల్‌లో ఆ కోటలను తునాతునకలు చేసి హ్యాట్రిక్‌ విజయాలతో పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మమతను పడగొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు. గతంలో కమ్యూనిస్టులు, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండేది. క్రమంగా వారిని వెనక్కి నెట్టి మమత ముందుకొచ్చారు. అనంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టులను అక్కడి నుంచి కూడా బీజేపీ తరిమేసి ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పుడు మమతను నేరుగా ఢీకొంటోంది. ఈసారి బీజేపీని ఎదుర్కోవడం ఆమెకు అంత ఈజీ కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయం అంతలా మారిపోయింది. బీజేపీ ఎదుగుదలకు కారణం కూడా ఒకరకంగా మమతా బెనర్జీనే. కమ్యూనిస్టులు దశాబ్దాల తరబడి అధికారంలో ఉండటానికి కారణం భూసంస్కరణలు వంటి చర్యలని పైకి చెప్పుకున్నా గ్రామాల్లో గ్రూపుల గొడవలు, హత్యా రాజకీయాల ద్వారానే వారు అధిపత్యం చెలాయించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి రాజకీయాలను ఎదిరించి మమత విజయం సాధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను కమ్యూనిస్టుల కంటే రెండాకులు ఎక్కువే చదివానన్నట్లుగా రాజకీయాలు చేసి క్రమంగా కమ్యూనిజం ఉనికి లేకుండా చేయడం ప్రారంభించారు. కానీ వారు ఖాళీ చేస్తున్న స్థానాన్ని బీజేపీ అందిపుచ్చుకున్న ఎదుగుతున్న విషయాన్ని గుర్తించలేకపోయారు. కమ్యూనిస్టు, బీజేపీ సిద్ధాంతాలకు అసలు పొంతనే ఉండదు. కానీ తృణమూల్‌ ప్రభుత్వంలో తమపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతుండటంతో రక్షణ కోసం వామపక్షవాదులు బీజేపీలో చేరిపోవడం ప్రారంభించారు. బెంగాల్లో ముస్లింల సంఖ్య ఎక్కువే. వారిలోనూ కమ్యూనిస్టులు అధికం. కానీ వర్గ పోరాటాల్లో అనేకమంది ముస్లింలు సైతం బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. బీజేపీలో ఇప్పుడు పెద్ద నేతలు ఉన్నారు. వారిలో చాలామంది మమతా బెనర్జీ నీడలో ఎదిగిన వారే. మమతను ఎలాగైనా అధికారానికి దూరం చేయాలన్నదే వారందరి టార్గెట్‌. మోడీ, షా మార్గదర్శకత్వంలో వారు అదే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కమ్యూనిస్టులను తరిమేసి గ్రామస్థాయిలో మమత పట్టుపెంచుకున్నారు. రాష్ట్రంలో ముప్పై శాతం వరకూ ఉన్న ముస్లింలు తృణమూల్‌ పార్టీకి గట్టి ఓటు బ్యాంకుగా ఉన్నారు. కానీ ఆ ఓటుబ్యాంకు కూడా దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన మూర్షిదాబాద్‌ ఎమ్మెల్యే హుమయూన్‌ కబీర్‌ నుంచి మమతాబెనర్జీకి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. నాలుగోసారి ఆమెను ముఖ్యమంత్రి కానివ్వబోనని ప్రతిన పూనిన కబీర్‌ దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా ప్రారంభించారు. బెల్దంగలో బాబ్రీ తరహాలో మసీదు నిర్మాణానికి ఐదు రోజుల క్రితం పునాదిరాయి వేయించిన ఆయన ఆ కార్యక్రమానికి ముస్లిం దేశాల ఇమాంలను రప్పించారు. అలాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీతో పొత్తు కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించడం చూస్తే వచ్చే ఎన్నికల్లో ముస్లిం ఓటుబ్యాంకు పూర్తిస్థాయిలో మమతకు దక్కే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మరోవైపు ఎన్నికలకు ఇంకా ఆరునెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ బీజేపీ మిషన్‌ బెంగాల్‌ పేరుతో కార్యాచరణ ప్రారంభించేసింది. 160కిపైగా సీట్లు సాధించి బెంగాల్‌ కోటను మమత నుంచి లాక్కోవడమే ఈ మిషన్‌ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు విభిన్న ఫార్ములాతో ముందుకు వెళ్లాలని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. కుల రాజకీయాల ప్రభావం బెంగాల్లో పెద్దగా ప్రభావం ఉండదని, అందువల్ల ప్రాంతీయ, మతపరమైన ఈక్వేషన్లను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకు వెళ్లాలనుకుంటోంది. రాష్ట్ర జనాభాలో మూడోవంతు వరకు ఉన్న ముస్లింలు 30-40 నియోజకవర్గాల్లో పార్టీల గెలుపు ఓటములను శాసించగలరు. ఇక్కడి నుంచే తృణమూల్‌కు పెద్ద సంఖ్యలో ఓట్లు పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఓవరాల్‌ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలపై పెద్దగా ఉండదని బీజేపీ భావిస్తోంది. అయినప్పటికీ ముస్లిం ఓటుబ్యాంకుకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో పోలరైజేషన్‌ ద్వారా హిందూ ఓటర్లను తమవైపు తిప్పుకోవచ్చని అభిప్రాయపడుతోంది. గతంలో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలుచుకోవడం ద్వారా రాష్ట్రంలో పార్టీ బలంగా వేళ్లూనుకుంది. ఈ పునాదిని మరింత పటిష్టం చేయడం ద్వారా రాష్ట్రంపై పట్టు బిగిస్తే 160కి పైగా సీట్లు సాధించడం పెద్ద కష్టం కాకపోవచ్చని బీజేపీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. గతంలో బీజేపీ పనితీరును పరిశీలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పరంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏకంగా 18 ఎంపీ సీట్లు గెలుచుకుని 40.25 శాతం ఓట్‌ షేర్‌ సాధించింది. 2012 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 77 సీట్లు దక్కించుకుని 38.14 శాతం ఓట్‌ షేర్‌ రాబట్టింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 39.10 శాతం ఓటుషేర్‌ సాధించింది. అదే తృణమూల్‌ అత్యుత్తమ ఓట్‌ షేర్‌ 46.20 శాతంగా ఉంది. అంటే మరో ఏడు శాతం ఓట్లు అదనంగా సాధించగలిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సులభసాధ్యమేనని బీజేపీ అంచనా వేస్తోంది. దానికోసమే ఆరు జోన్లుగా విభజించి సీనియర్‌ నేతలకు బాధ్యతలు అప్పగించింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page