top of page

పొదుపా.. రేపు చూద్దాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 22, 2025
  • 2 min read

దాదాపు ముప్పై నలభయ్యేళ్లు వెనక్కి వెళితే.. అప్పటి కుటుంబ వ్యవస్థకు ఇప్పటి కుటంబాలు నడుస్తున్న తీరుకు మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా సంపాదన, ఖర్చుల విషయంలో హస్తి మసంకాతర వ్యత్యాసం గోచరమవుతుంది. అప్పట్లో మెజారిటీ కుటుంబాల్లో సంపాదించేవారు ఒక్కరే ఉండేవారు. ఆ సంపాదనతోనే కుటుంబం మొత్తాన్ని పోషించేవారు. అప్పట్లో వెయ్యి, రెండువేల రూపాయల నెల జీతం సంపాదిస్తే చాలు.. అదే గొప్ప అనుకునేవారు. అందులోనే నెలవారీ కుటుంబ ఖర్చులుపోనూ ఎంతోకొంత పొదపు చేసేవారు. అలా పొదుపు చేసిన మొత్తాలను భవిష్యత్తు అవసరాలకు, ఇల్లు, వాహనం వంటి ఖరీదైన సౌకర్యాలకు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మంగళగిరి పానకాలస్వామిలా ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నారు. అప్పటి మాదిరిగా ఇప్పుడు పెద్ద కుటుంబాలు కూడా లేవు. చిన్న కుటుంబాలే ఉన్నా.. వారిలో భార్యాభర్తలిద్దరూ సంపాదనపరులుగా ఉన్నప్పటికీ, లక్షల్లో సంపాదిస్తున్నప్పటికీ ఇంకా ఆదాయం సరిపోవడం లేదని, భవిష్యత్తు అవసరాలకు ఏమీ మిగుల్చుకోలేకపోతున్నామన్న ఆవేదన, ఆందోళన కనిపిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి కారణం.. జీవన వ్యయం కొన్ని రెట్లు పెరిగిపోవడమే. దీనికితోడు గతంలో కూడు, గూడు, గుడ్డ ఉంటే చాలన్న రీతిలో ఆలోచించేవారు. ఇతరత్రా అవసరాలను పెద్దగా పట్టించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరాలు విస్తృతంగా పెరిగాయి. ధరలు కూడా ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి. చదువు, ఇంటి అద్దె, తిండికి చాలాతక్కువ ఖర్చుచేసేవారు. కానీ ఇప్పుడు నగరవాసం పెరిగింది. గ్రామాలు పట్టణాలుగా, పట్టణాలు నగరాలుగా, నగరాలు మెట్రో సిటీలుగా మారుతున్న క్రమంలో నగరవాసం చాలా ఖరీదైనదిగా మారిపోయింది. నగర జీవనంలో కనీసం రూ.50వేల ఆదాయం ఉన్నా అరకొరగా సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్యఖర్చులకే ఆదాయంలో సింహభాగం కేటాయించాల్సి వస్తోంది. కూరగాయలు, నిత్యావసర వస్తువులు సైతం ఆకాశాన్ని తాకుతుండటంతో ఆదాయం సరిపోక ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. ఇవి కాకుండా టీవీ కేబుల్‌ బిల్లు, సెల్‌ఫోన్ల నెలవారీ బిల్లులు నిత్యావసరాల జాబితాలో చేరిపోయాయి. వీటికి తోడు ఓటీటీ, ఇతర అదనపు యాప్స్‌ కోసం మరికొంత సొమ్ము వెచ్చించాల్సి వస్తోంది. ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటే నెలలో కొన్ని రోజులు ఉద్యోగాల్లో బిజీ కారణంగా ఇంట్లో వంట చేసుకునే సమయం లేక బయటనుంచి ఫుడ్‌ కొనుక్కోవాల్సి వస్తుంది. దీనికి మళ్లీ అదనపు ఖర్చు. మన ముందు తరాలవారు తమ ఆదాయంలో కొంత దాచుకుని.. సమకూడిన పెద్ద మొత్తంతో ఇంటికి కావలసిన హంగులు కల్పించుకోవడమో, పెద్ద అవసరాలు తీర్చుకోవడానికో ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడది రివర్స్‌ అయిపోయింది. కంపెనీల సృష్టించిన మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకున్న మెజారిటీ ప్రజలు ముందు పెద్ద పెద్ద కొనుగోళ్లు చేసేసి, ఆ తర్వాత ఈఎంఐల పేరుతో నెలవారీ చెల్లింపులు జరపడానికి అలవాటు పడిపోయారు. ఈ ఈఎంఐల సంస్కృతి ఎంతగా జనాల్లో పాతుకుపోయిందంటే.. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు కావలసిన డబ్బులు ఉన్నా సరే వాటిని వెచ్చించకుండా ‘ఉందిగా ఈఎంఐ సౌకర్యం’ అంటూ వాయిదా పద్ధతిలోనే కొనుగోళ్లు జరుపుతున్నారు. దీనివల్ల వడ్డీల భారం పడుతుందన్న విషయాన్ని వినియోగదారులు పట్టించుకోవడంలేదు. ఉదాహరణకు రూ.70 వేల విలువైన సెల్‌ఫోన్‌ నెలకు రూ.3వేలు చెల్లిస్తే చాలా మన సొంతం అయిపోతుందని భావిస్తున్నారే తప్ప.. దాని వల్ల కొన్ని నెలలపాటు మన ఇంటి బడ్జెట్‌పై రూ.మూడు వేలు చొప్పున అదనపు భారంతోపాటు అన్ని నెలలకూ అదనంగా వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించడం లేదు. ప్రస్తుత కాలంలో గిగ్‌ ఎకానమీ వల్ల ఉద్యోగ భద్రత కొరవడిరది. మన తల్లిదండ్రులు, ఇతర పెద్దలు ఒక ఉద్యోగంలో చేరితే దశాబ్దాల తరబడి, ఇంకా చెప్పాలంటే రిటైరయ్యేవరకు ఆ ఉద్యోగంలోనే కొనసాగేవారు. అప్పట్లో ఉద్యోగ భద్రత అలా ఉండేది. కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలు పెరిగినా, అదే సమయంలో ప్రతిభ ఉన్నవారికే కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. అదే సమయంలో లాభనష్టాల ప్రాతిపదికన కంపెనీలు లే ఆఫ్స్‌ పెరగడం, ఉద్యోగులు కూడా తమ స్థాయి, ఎక్కువ జీతాలు ఆశిస్తూ తరచూ ఉన్న ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండటం వల్ల ఉద్యోగ భద్రత లేకుండాపోతోంది. ఇది ఒక రకమైన అనిశ్చితికి దారితీస్తోంది. ఈ అనిశ్చితే పొదుపును అడ్డుకోవడం, పొదుపు మొదలుపెట్టినా దాన్ని ఎక్కువ లాభం ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టడానికి వెనుకంజ వేసేలా చేస్తోంది. పొదుపు ప్రారంభించినా.. భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోతే కట్టలేమన్న భయంతో చాలామంది తమ పొదుపును దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పట్టడానికి భయపడుతున్నారు. ‘ఉందిగా సెప్టెంబర్‌, మార్చ్‌ ఫైనల్‌’ అన్నట్లు పొదుపు విషయంలోనూ మెజారిటీ యువత వాయిదా మంత్రం అవలంభిస్తున్నారు. ఉన్నదాంతో ఎంతోకొంత పొదుపు చేయకుండా.. ఇప్పుడు వస్తున్నదే ఖర్చులకు సరిపోవడంలేదు, అందువల్ల వచ్చే ఏడాది జీతం పెరిగాక.. ఆ పెరిగిన మొత్తాన్ని పొదుపు చేద్దామని.. ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోతున్నారు. జీతాలు పెరిగే సమయంలో ఖర్చులు, అవసరాలు కూడా పెరిగి కూర్చుంటున్నాయి. ఫలితంగా పొదుపు ఎప్పటికీ వాయిదా ఖాతాలో పడిపోతోంది. చిన్న వయసులోనే తగిన ప్రణాళికతో పొదుపు చేస్తే భవిష్యత్తు అది పెద్ద పొదుపు అవుతుందన్న అవగాహన పెరుగుతున్నా.. చిన్నమొత్తాలతోనే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించేందుకు మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌ వంటి అవకాశాలు ఎన్నో అందుబాటులోకి వచ్చినా యువత వాటిని అందిపుచ్చుకోవడంలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page