పందులు వచ్చేశాయ్.. కుక్కలు రానివ్వడంలేదు..!
- Prasad Satyam
- 3 days ago
- 2 min read
నగరంలో విచ్చలవిడిగా సంచరిస్తున్న పందులు
వ్యాధులతో ఆసుపత్రిల్లో ఎడతెగని ఔట్‌పేషెంట్లు
డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నాయ్
జనాలను వీధుల్లో అడుగు పెట్టనీయని శునకరాజాలు
శ్వాస ఆగిపోయేలా పరుగులు పెట్టిస్తున్న వైనం
కనీసం పట్టించుకోని అధికార యంత్రాంగం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
గతంలో పాండమిక్ వ్యాధులు అంటే సీజనల్‌గా వచ్చే వ్యాధులు కేవలం సీజన్ మారినప్పుడే వచ్చేవి. అంటే ఎండాకాలం తర్వాత వర్షాలు పడినప్పుడు జ్వరాలు, శీతాకాలం మొదలైనప్పుడు జలుబు దగ్గులు మొదలయ్యేవి. దీనికోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేది. దీనికి మున్సిపల్ కార్పొరేషన్ జతయ్యేది. ఎలా అంటే.. దోమలు నిల్వ ఉండకుండా మిలాథియన్ ఆయిల్ పిచికారీ చేయడం, నీరు నిల్వ ఉన్నచోట గంబూషియా చేపలను వదలడం, ఊరి మధ్యలో పందులు విహరించకుండా తరిమేయడం వంటి కార్యక్రమాలన్నమాట. అయితే ఇప్పుడు వ్యాధులకు సీజనంటూ ఒకటి లేదు. నిరంతరం జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎక్కువైపోయాయి. ఏ ఆసుపత్రిలో చూసినా ఎడతెగని ఔట్‌పేషెంట్లు కనిపిస్తున్నారు. ఈమధ్య వస్తున్న జ్వరాలకు డెంగీ పాజిటివ్ చూపించకపోయినా ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నాయి. బ్లడ్‌టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అంటున్నారు. గాలిలో కొత్త వైరస్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ అనేక మ్యుటేషన్లు చెంది ఇప్పుడు ఈ విధంగా రూపాంతరం చెందిందని, జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదమంటున్నారు. అటువంటప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, లేదా పంచాయతీల్లో వాతావరణం ఎలా ఉండాలి? కానీ ఎలా ఉంది? అనేదే ఈ కథనం సారాంశం.
ఏ ఉద్యోగం లేకపోయినా రెండు పందుల్ని పెంచుకుంటే ఐదేళ్లలో కోటేశ్వరుడైపోవచ్చనే సామెత ఒకటుంది. దీనికి మేత మనం పెట్టక్కర్లేదు.. కోతకు తెచ్చుకుంటే చాలు. సరిగ్గా వ్యాధులు బలంగా ప్రబలుతున్న సమయంలోనే ఈమధ్యంతా కనపడని పందులు నగర ప్రవేశం చేశాయి. ఇప్పుడు కాలువల్లో పూడికలు తీసున్నారేమో.. స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్తలు పేరుకుపోయి కనిపిస్తుండటంతో దాని మీద పడి మేస్తున్నాయి. ఊరి శివార్లలో తప్ప మధ్యలో పందుల పెంపకమంటే ఊరుకోమని గతంలో ఇక్కడ కమిషనర్‌గా పని చేసిన నల్లనయ్య వెంటబెట్టారు. ఆ తర్వాత నుంచి ఇవి పంచాయతీల్లోనే రాజ్యమేలేవి. బహుశా కార్తీకమాసం పూర్తవడంతో దీని మాంసానికి డిమాండ్ పెరిగిందో ఏమో తెలీదు గానీ పందులు మళ్లీ ఊర్లోకి వచ్చాయి. మెదడువాపు వ్యాధి లేకుండానే ఒక్కరోజు జ్వరానికి ప్లేట్‌లెట్‌లు తగ్గిపోతుంటే.. ఇప్పుడు పందుల ద్వారా వచ్చే మెదడువాపు వ్యాధికి మందులున్నాయో, లేదో కూడా తెలియదు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ తుప్పలు బలిసేసి, నీరు నిల్వ ఉండిపోయి పందులు జలకాలాడటానికి స్విమ్మింగ్‌పూల్‌లా మారాయి. కనీసం వీటికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ వేయడానికి కూడా రికార్డులు కార్పొరేషన్ కార్యాలయంలో లేవు. భూమి మీద పెట్టుబడి భవిష్యత్తులో కాసులు కురిపిస్తుందని నమ్మినవారంతా నగరంలో ఎక్కడపడితే అక్కడ లెక్కకు మించి స్థలాలు కొనేశారు. ఇప్పుడు దానిలో నిర్మాణాలు చేపట్టే ఓపికలు ఎవరికీ లేవు. ఒకవేళ నిర్మించినా.. గతం మాదిరిగా అద్దెలు పలకడంలేదు. అందుకే స్థలం ఆక్రమణకు గురికాకుండా ఓ ప్రహరీ కట్టి వదిలేస్తున్నారు. ఇప్పుడు అదే పందుల నివాస స్థానం. అక్కడి నుంచే వ్యాధులు ప్రబలుతున్నాయి.
ఇవి నగరంలోకి వచ్చి రాజ్యమేలుతుంటే.. మరోవైపు మన ఇంటిలోకి కూడా అడుగు పెట్టనీయకుండా శునకరాజాలు హల్‌చల్ చేస్తున్నాయి. విచిత్రంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన తర్వాత మనూరిలో కుక్కల సంఖ్య పెరిగిపోయింది. దీంతో ఊరిలో అడుగు పెట్టడానికి భయపడే పరిస్థితి. ప్రతీ వీధి మొదట్లోను, చివరిలోను కనిపిస్తున్న ఇవి కాపలా కుక్కలు కావు. మన ప్రాణాలు తీసే క్రూరమృగాలుగా తయారయ్యాయి. సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరంటారు. దాని సంగతేమో గాని అవి పిక్కలు పీక్కుండా పరుగుపెడుతున్నవారి శ్వాస ఎక్కడాగిపోతుందో తెలియడంలేదు. నగరంలో అనేక కుక్కలు చర్మవ్యాధితో బాధపడుతున్నాయి. వీటి నుంచి దుర్గంధంతో పాటు కొన్నిరకాల బ్యాక్టీరియా కూడా బయటకు వస్తున్నాయి. ఇవి కూడా గాలిలో కలిసి ధూళి రేణువులుగా మనం పీలుస్తుంటే జబ్బులురాక మరేమొస్తుంది.!










Comments