top of page

పునాది వేశా.. ప్రగతి సౌధాలు నిర్మిస్తా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 18, 2025
  • 6 min read
  • తొలి ఏడాది పనితీరుపై గొండు శంకర్‌ వివరణ

  • కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణ రాష్ట్రస్థాయి అంశం

  • సీఎం మార్గదర్శనం ప్రకారమే నిత్యం ప్రజాక్షేత్రంలో

  • జిల్లా గ్రంథాలయ స్థలం అమ్మేస్తున్నారన్నది తప్పుడు ప్రచారం

  • విలీన పంచాయతీల్లోనూ ముమ్మరంగా అభివృద్ధి పనులు

  • తొలి ఏడాది పనితీరుపై ఎమ్మెల్యే గొండు శంకర్‌తో సత్యం ప్రత్యేక ఇంటర్వ్యూ..


ఎటువంటి అంచనాల్లేకుండా.. సొంత పార్టీ క్యాడర్‌ వెంట లేకపోయినా.. కేవలం అధిష్టానం అనుగ్రహంతో ఆయన టికెట్‌ దొరకబుచ్చుకున్నారు. గెలుపే కనాకష్టం అనుకుంటే శ్రీకాకుళం నియోజకవర్గ చరిత్రలోనే రికార్డు మెజారిటీతో గెలిచి అసెంబ్లీ మెట్లెక్కారు. ఎమ్మెల్యేగా గొండు శంకర్‌ తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు. తన పుట్టినరోజును, ఎమ్మెల్యేగా మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంటున్న ఆయన ఈ ఏడాది కాలంలో శ్రీకాకుళంలో దాదాపు స్తంభించిపోయిన అభివృద్ధికి మళ్లీ పునాదులు వేయగలిగానని చెప్పుకొచ్చారు. ఆ పునాదులపై ప్రగతి సౌధాలు నిర్మించడమే వచ్చే నాలుగేళ్లలో తన కర్తవ్యమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో చాలావరకు ఆచరణలో పెట్టగలిగానని, వాటిని పూర్తి చేస్తానన్న తన హామీకి బద్ధుడనై ఉన్నానని స్పష్టం చేశారు. రానున్న నాలుగేళ్లలో నగర ప్రగతికి తన మదిలో ఉన్న ప్రణాళికలను ‘సత్యం’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శంకర్‌ సవివరంగా ప్రస్తావించారు.



సత్యం: ఎమ్మెల్యేగా గత ఏడాది మీరు రోజుల పిల్లాడు. ఇప్పుడు ఎమ్మెల్యేగా మొదటి పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ జర్నీ ఎలా ఉంది?

ఎమ్మెల్యే శంకర్‌: బర్త్‌డే అంటూ ప్రత్యేకంగా జరుపుకోవడం నాకు ఇష్టం ఉండదు. కానీ గత మూడేళ్లుగా అలా జరిగిపోతోంది. ఇక ఈ ఏడాది జర్నీ అంటారా.. సంతోషంగానే ఉంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు కేటాయించడం, ఆ మేరకు నా నియోజకవర్గంలో పనులు జరుగుతుండటం ఆనందమే కదా!. ఇప్పటి వరకు భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించిన పునాది వేయగలిగాను. ఇక దాని మీద పూర్తిస్థాయి నిర్మాణాలే చేపట్టాలి. మున్సిపాలిటీ ఏర్పడి వందేళ్లు దాటినా ఇంకా మౌలిక వసతుల కల్పనలో థర్డ్‌గ్రేడ్‌గానే ఉంది. ఇప్పుడిప్పుడే కాలువలు, రోడ్లు, సుందరీకరణ వైపు దృష్టి సారించాం. ఆ మేరకు పనులు చేపడుతున్నాం. కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణ పనులు అనుకున్నట్టే ప్రారంభించాం. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రెండు అంతస్తులు నిర్మించాం. ఈలోగానే సంబంధిత కాంట్రాక్టరు సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ కూలిన కేసులో చిక్కుకుపోయారు. దీంతో స్టేడియం పనులు నిలిచిపోయాయి. అలాగే గత ప్రభుత్వం కొంతమేర జరిగిన పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. నియోజకవర్గంలో శివారు భూములకు నీరందించే పనిని వేగవంతం చేశాం.


సత్యం: శ్రీకాకుళం`ఆమదాలవలస రోడ్డు గత ప్రభుత్వంలో పూర్తి చేయలేదని, మీరు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో రోడ్డును అందుబాటులోకి తెస్తామని చెప్పిన మీరు ఆ మేరకు పనులు జరగకపోతే మీ సొంత సొమ్ములు తీసి కోటి పైచిలుకు విలువైన బీటీని కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కూడా ఇటువంటి సాయమే చేశారు. పెండిరగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వంతో దాదాపు యుద్ధమే చేశారు. ఇప్పుడు ఆ రోడ్డు పనుల తీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా?

ఎమ్మెల్యే శంకర్‌: ఈ పనుల మీద నేను చాలా అసంతృప్తిగా ఉన్నాను. చాలా బాధపడుతున్నాను. సంబంధిత కాంట్రాక్టర్‌ ప్రోపర్‌గా రెస్పాండ్‌ అవ్వడంలేదు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసి, కేసు పెట్టడానికి కూడా వెనుకాడను. అందులో ఎటువంటి మొహమాటం లేదు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తాను. ఎందుకంటే.. ముఖ్యమంత్రి జరిపిన సమీక్షలో కాంట్రాక్టరే రూ.10.50 కోట్లు బిల్లులు చెల్లిస్తే, మళ్లీ ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు పనులు ఆపనని స్వయంగా మాటిచ్చారు. అలాగే రోడ్డు పూర్తవడానికి టెక్నికల్‌గా రెండు ఇబ్బందులు ఉన్నాయి. అలాగని మిగిలిన పనుల పూర్తికి, దీనికి సంబంధం లేదు. ఇక శ్రీకాకుళం కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న రోడ్డు వెడల్పునకు మాస్టర్‌ ప్లాన్‌ అడ్డంకిగా ఉంది. బలగ ప్రాంతంలో 60 అడుగులకు మాత్రమే మాస్టర్‌ప్లాన్‌లో అనుమతి ఉంది. కానీ ఈ రోడ్డు 80 అడుగుల వెడల్పునకు ప్రతిపాదించాం. ఇప్పుడు కొత్త మాస్టర్‌ప్లాన్‌ ఆమోదం పొందితే రోడ్డు వెడల్పు సులువవుతుంది. అప్పుడు మాత్రమే స్థలం, భవనాలు కోల్పోయినవారికి టీడీఆర్‌లు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో రోడ్డుకు అవసరమైన మేరకు ప్రహరీలు తొలగించాం. ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ కాంట్రాక్టర్‌ స్పందించడంలేదు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాంట్రాక్టర్‌కు రూ.16 కోట్ల బిల్లులు చెల్లించాం. ఆ తర్వాత రూ.8 కోట్ల వరకు ఆయన పనులు చేసి ఉండొచ్చు. ఆ బిల్లులు కూడా త్వరగానే చెల్లిస్తాం. కల్వర్టు పనులు పూర్తి చేయకపోవడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. దీని మీద నేను అభ్యంతరం చెబితే మొన్నే ఒక కల్వర్టుకు స్లాబ్‌ పూర్తిచేశారు. త్వరలోనే రెండో కల్వర్టు పనులు చేపడతారని భావిస్తున్నాను. మొత్తానికి అసంతృప్తిగానే ఉన్నాను.


సత్యం: ఎమ్మెల్యే అయి ఏడాది దాటిపోయినా ఇంకా మీరే కార్యకర్త పని, కమిషనర్‌ పని, ఎంపీడీవో పని చేస్తుండటం వల్ల ఎమ్మెల్యే ప్రోటోకాల్‌ అనేది దక్కుతుందనుకుంటున్నారా?

ఎమ్మెల్యే శంకర్‌: నేను ఎమ్మెల్యేగానే వ్యవహరిస్తున్నాను. ఒక వార్డు మెంబర్‌ ఎలాగో, కార్పొరేటర్‌ ఎలాగో అసెంబ్లీలో నేనొక మెంబర్ని. అంతేగానీ లీడర్‌ను కాను. అంటే అందరూ సేవకులమే. గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలకు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అక్కడ మా ప్రతినిధులు లేరు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వైకాపావారే ఇప్పటికీ ఉండటం వల్ల మా పథకాల అమలులో వివక్ష ఎదురవుతోంది. అందుకే అన్నింటినీ స్వయంగా పర్యవేక్షించాల్సి వస్తోంది. ఉదాహరణకు చెప్పాలంటే జిల్లాపరిషత్‌ కార్యాలయం నుంచి కునుకుపేట వరకు అమ్మవారి పండగలు జరిగినప్పుడు ఎలక్ట్రిఫికేషన్‌ పనులు చేయించాం. కార్పొరేషన్‌లో పాలకవర్గం లేకపోవడం వల్ల నేనే చూసుకున్నాను. ఇది పండగల సందర్భంగా చేసినా, ఆ ప్రాంతానికి విద్యుత్‌ తీగలు, స్తంభాలకు సంబంధించి శాశ్వత పరిష్కారం దొరికింది. మా నాయకుడు చంద్రబాబు కూడా క్షేత్రస్థాయిలో ఉండమనే చెబుతున్నారు. నేనిలా జనం మధ్య ఉంటున్నానంటే ముఖ్యమంత్రి ఆదేశమనే భావించాలి.


సత్యం: రోజుకు 15 నుంచి 18 గంటలు జనం మధ్యనే ఉంటున్న మీరు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోతారని ఒక సెఫాలజీ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో 57 మంది ఈ జాబితాలో ఉంటే.. మీరు కూడా ఉన్నారని చెబుతోంది. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు?

ఎమ్మెల్యే శంకర్‌: వారు ఏ ప్రాతిపదికన ఈ అంచనా వేశారో నాకు తెలియదు. ఎక్కడ సర్వే చేశారో తెలియదు. గతంలో కూడా ఇదే వ్యక్తులు నాకు ఎమ్మెల్యే సీటు రాదని ప్రకటించారు. వచ్చిన తర్వాత గెలవనని సర్వే పేరుతో ప్రకటించారు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇంతకు మించి దీని మీద వ్యాఖ్యానించను.


సత్యం: ఎమ్మెల్యే అయిన వెంటనే శ్రీకాకుళం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపిస్తానని వాగ్దానం చేశారు. ఏడాది పూర్తయినా ఇప్పుడా ఊసు లేదు. దీని ప్రభావం మీ మీద ఉండదా?

ఎమ్మెల్యే శంకర్‌: ఎన్నికైన ఏడాదిలోనే కార్పొరేషన్‌ ఎన్నికలు పెట్టిస్తానని మాటిచ్చాను. ఆ మేరకు సిన్సియర్‌గా ప్రయత్నించాను. రాష్ట్రంలో 22 మున్సిపాల్టీల ఎన్నికలకు సంబంధించి చిక్కులున్నాయి. మన జిల్లాలో శ్రీకాకుళం నగరంతో పాటు ఆమదాలవలస కూడా ఉంది. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేను ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని ప్రకటించినప్పుడు అది అంత సులువు కాదని ‘సత్యం’ పత్రికలో వచ్చిన కథనం చదివిన తర్వాతే అసలు విషయం నాకు బోధపడిరది. ఇప్పటికి కూడా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరిపి సమర్థులైన ప్రజాప్రతినిధులు వస్తే నా పని మరింత సులువవుతుంది. అలా జరగాలనే కోరుకుంటున్నాను. విలీనమైన ఏడు పంచాయతీల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న తోటపాలెం, కుశాలపురం పంచాయతీలను దీని నుంచి వేరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల్లో కేబినెట్‌ అప్రూవల్‌ కూడా వస్తుంది. మిగిలిన పంచాయతీలతో మళ్లీ డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏ డేటా అడిగినా ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం. దీనిపై జూన్‌లో ప్రభుత్వం నుంచి ఓ స్టేట్‌మెంట్‌ వస్తుందని భావించాం. కానీ మొదటి ఏడాది ప్రభుత్వం పూర్తిగా అమరావతి పునర్నిర్మాణం మీదే దృష్టి పెట్టింది. అక్కడ యుద్ధప్రాతిపదికన రాజధాని పనులు జరుగుతున్నాయి. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ కూడా వాటి పర్యవేక్షణలోనే ఉన్నారు. అలాగే పోలవరం పూర్తిచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని భావిస్తున్నాను.


సత్యం: శ్రీకాకుళం కార్పొరేషన్‌లో పంచాయతీలు విలీనం కావడం వల్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనులు చేయడం కుదరడంలేదని, దీని వల్ల అభివృద్ధి ఆగిపోతుందని స్వయంగా మీ పార్టీ నేతలే చెబుతున్నారు. మీరేమో వీటి విలీనంతో కార్పొరేషన్‌ ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ఈ జోడుగుర్రాల స్వారీ ఎలా కుదురుతుంది?

ఎమ్మెల్యే శంకర్‌: నష్టపోవడం కాదు.. ఆల్రెడీ నష్టపోయాం. ఈ పంచాయతీల నుంచే కార్పొరేషన్‌కు ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను అనేకసార్లు కలిసి వీటికి మినహాయింపు ఇవ్వాలని కోరాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్లాను. కార్పొరేషన్‌ ఎన్నికలు జరగకపోయినా విలీనం అనే ఒక్క మాట వల్ల పంచాయతీలు నష్టపోతున్నాయని చెప్పాను. ఏది ఏమైనా ఈ నష్టాన్ని పూడ్చాల్సింది నేనే. అందుకే పాత్రునివలసలో రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నాం. కిల్లిపాలెంలో వ్యవసాయ కాలువల్లో పూడికలు తీయిస్తున్నాం. ఇంక మిగిలిన పంచాయతీల్లో కూడా పనులు చేయాల్సి ఉంది. కనీసం ఎన్నికలు జరిగేవరకైనా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో టైఅప్‌ ఉండాలన్నదే నా భావన. గత ప్రభుత్వం విలీనంపై ఆర్డినెన్స్‌ తీసుకురావడం వల్ల ఈ పంచాయతీలు ఎటూ చెందకుండాపోయాయి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి జీతాలు ఒక శాఖ నుంచి వస్తే, అడ్మినిస్ట్రేషన్‌ మరో శాఖ చూస్తుంది. ఈమధ్యనే ఆ గందరగోళం నుంచి బయటకు తెచ్చి పూర్తిగా కార్పొరేషన్‌కు అప్పగించాం. ఎంత ప్రయత్నించినా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రావని తెలిసిన తర్వాత కార్పొరేషన్‌ నిధుల నుంచే వీటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాం. లేదూ అంటే వీటిని మళ్లీ పంచాయతీలుగానే ఉంచేయాలి. కానీ ఇవన్నీ రెవెన్యూ జనరేట్‌ చేసే కాలనీలుగా మారిపోయినందున మున్సిపాలిటీకి ఆనుకొని ఉన్నందున అలా చేయలేం. చాపురం మొత్తం పర్యటించి ఎక్కడెక్కడ ఏయే పనులు చేపట్టాలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. పెద్దపాడులో రూ.22 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. కిల్లిపాలెంలో కూడా పనులు గుర్తించాం. ఖాజీపేటలో పెద్దగా సమస్యలు లేవు. అరసవల్లి మీద దృష్టి పెట్టాం.


సత్యం: పొట్టిశ్రీరాములు పెద్దమార్కెట్‌ను పి`3 మోడ్‌లో ఎప్పుడు పునర్నిర్మిస్తున్నారు?

ఎమ్మెల్యే శంకర్‌: పి`3 మోడ్‌లో కాదు.. ప్రస్తుతం మార్కెట్‌లో భవనాలు 90 శాతం ఉపయోగపడటంలేదు. అంతా రోడ్డు మీదే వ్యాపారం చేస్తున్నారు. అలా కాకుండా అందరికీ ఉపయోగపడేలా ఒక డిజైన్‌ తయారుచేసి, దాన్ని మార్కెటింగ్‌ శాఖ పరిధిలోనే నిర్మించాలని మంత్రి అచ్చెన్నాయుడు భావించారు. ముందు దీని డిజైన్‌ ఖారారైతే ఆ తర్వాత శతశాతం నిధులు మంజూరైతేనే కొత్త మార్కెట్‌ను నిర్మిస్తాం. ప్రస్తుతానికి ఇందుకు సంబంధించి ఎటువంటి కొత్త అప్‌డేట్‌ లేదు.


సత్యం: ఆర్‌ అండ్‌ బి బంగ్లాను పి`3 మోడ్‌లో అభివృద్ధి చేస్తున్నారట. నిజమేనా?

ఎమ్మెల్యే శంకర్‌: నాకూ నిన్నటి వరకు తెలియదు. కానీ కలెక్టర్‌ మాత్రం ఈ ప్రాంతంలో పి`3 మోడ్‌లో రివర్‌ వ్యూ పాయింట్‌లో ఒక ఫోర్‌ స్టార్‌ హోటల్‌ నిర్మిస్తే బావుంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. శ్రీకాకుళంలో కొన్ని త్రీస్టార్‌ హోటల్స్‌ ఉన్నందున ఫోర్‌ స్టార్‌, ఆ పైస్థాయిలో ఉన్న హోటలైతే బాగుంటుందని నా భావన. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే స్టార్‌ హోటల్‌కు శ్రీకాకుళంలో నష్టం ఉండదనేదే నా ఆలోచన.


సత్యం: జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఎప్పుడు అమ్మేస్తున్నారు? ఎవరికి అమ్మేస్తున్నారు?

ఎమ్మెల్యే శంకర్‌: ఇది నూటికి నూరుశాతం అవాస్తవం. నేను కూడా నిన్ననే ఒక ఇంగ్లీష్‌ పేపర్‌లో ఈ వార్త చూశాను. నాకు తెలిసినంత వరకు గతంలో ఇక్కడ డిజిటల్‌ గ్రంథాలయం, డార్మిటరీతో పాటు మెడిటేషన్‌ హాల్‌తో కూడిన యువ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని భావించాం. కానీ ఆ స్థలం సరిపోదని ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో ఉన్న హాస్టల్స్‌ ప్రాంతాన్ని చూశాం. అక్కడా కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ కాస్ట్‌ కూడా కాలగమనంలో రూ.10 కోట్ల అంచనాకు చేరిపోయింది. దీంతో యువ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. అంతవరకే నాకు తెలుసు. కానీ గ్రంథాలయ పరిరక్షణ సమితి పేరుతో కొందరు ఈమధ్య ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. గ్రంథాలయం ఎప్పట్నుంచో శిథిలావస్థకు చేరుకుంటున్నా గత ప్రభుత్వ హయాంలో ఈ పరిరక్షణ సమితి ఎటువంటి పోరాటాలు చేసిందో చెబితే బాగుంటుంది. గత ఐదేళ్లలో రూ.5 లక్షలు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ములు రాబట్టలేకపోయినవారు ఇప్పుడు పరిరక్షణ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014`19 టీడీపీ హయాంలో రూ.5 కోట్ల ప్రభుత్వ నిధులతో యువ బిల్డింగ్‌ కడదామనుకున్నాం. టెండరింగ్‌ ప్రక్రియకొచ్చేసరికే ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు అమ్మేస్తామనో, పి`3 మోడ్‌లో ఇచ్చేస్తామనో ప్రచారం చేస్తున్నారు. కార్గిల్‌ పార్క్‌ను సీఎస్‌ఆర్‌ యాక్టివిటీలో అభివృద్ధి చేస్తే అక్కడ కూడా ఓ ఆర్టిఫీషియల్‌ ఉద్యమాన్ని నడిపారు. ఇప్పుడు గ్రంథాలయం మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా దీన్ని పి`3 మోడ్‌లో ఇస్తున్నామని గాని, అమ్మేస్తున్నామని గాని రుజువు చేస్తే నా ముక్కు నేలకు రాస్తా. మరో నాలుగేళ్లు ఎమ్మెల్యేగా పని చేయాలి. ఆ తర్వాత కూడా ఇక్కడే ఉండాలి. తేడా వస్తే ప్రజలు పిలక తిప్పేస్తారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకుంటే మంచిది. నేనే చెబుతున్నాను. మున్సిపల్‌ కార్యాలయమో, ఆర్టీసీ కాంప్లెక్సో పి`3 మోడ్‌లో ఇస్తే అభివృద్ధి జరుగుతుంది. కావాలంటే ఇటువంటి ప్రచారం చేస్తున్నవారు ముందుకొస్తే ఇచ్చేస్తాం. వారే దీన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వారు నాశనమైపోడానికే ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు.


సత్యం: పార్టీలతో ప్రమేయం లేకుండానే అందరూ ఓట్లేస్తే, మీకు రికార్డు మెజార్టీ వచ్చింది. అటువంటిది కొందరు మీ పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వెంట నడిస్తే మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నిజమేనా?

ఎమ్మెల్యే శంకర్‌: నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం వారిది. పరామర్శలు, పలకరింపులకు వెళ్తే కాదనడానికి నేనెవర్ని? కానీ పార్టీ కార్యక్రమాలు చేపడితే చీలిక వస్తుందని మాత్రం చెప్పాను. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కొన్ని గ్రామాల్లో పర్యటిస్తే టీడీపీ ఇన్‌ఛార్జిని కాదు కాబట్టి పార్టీ కార్యక్రమాలు చేపట్టొద్దంటూ దూరం పెట్టారు. టికెట్‌ వచ్చిన 20 రోజుల వరకు నాతో కలిసి నడవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయ్‌.. అందరూ మనస్ఫూర్తిగా పని చేశారు.. అక్కడక్కడ కొందరు మాత్రమే మిగిలిపోయారు. అప్పుడు నాకు వర్తించిన సూత్రమే ఇప్పుడు ఎవరికైనా వర్తిస్తుంది కదా.. అందుకే అటువంటి చర్యలకు పాల్పడినవారిని తప్పని చెప్పాను. అంతే తప్ప వ్యక్తిగత పరిచయాలపై కుటుంబ కార్యక్రమాల కోసం ఎవరు ఎవరితో వెళ్లినా నాకెందుకు అభ్యంతరం ఉంటుంది!

పూర్తి ఇంటర్వ్యూ కోసం #satyamtvsrikakulam (4pm onwards) ను వీక్షించగలరు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page