పాపం పండిoది.. వేటు పడిoది!
- BAGADI NARAYANARAO

- 6 days ago
- 2 min read
సీఎంవో ఆదేశాలతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు
లంచం కేసులో ఎట్టకేలకు స్పందన
విధుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు
సీడీపీవో తొలగింపు కోరుతూ డైరెక్టర్‌కు ఫైల్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పాపాలు పండాయి. వాటిని మసిపూసి మాయ చేసే యత్నాలు విఫలమయ్యాయి. బాధితుడిని లొంగదీసుకునే ప్రయత్నాలూ వమ్మయ్యాయి. ఫలితంగా లంచం కేసులో చర్యలు మొదలయ్యాయి. గ్రీవెన్స్‌లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎచ్చెర్ల సీడీపీవో కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించారు. సీడీపీవో డోల పాపినాయుడును విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ ద్వారా ఐసీడీఎస్ డైరెక్టర్‌కు ఈ విభాగం పీడీ విమల ఫైలు పంపారు. డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే పాపినాయుడిని విధుల నుంచి తొలగిస్తామని ఆమె తెలిపారు. నాలుగు నెలలుగా ఈ వ్యవహారం పీడీ కార్యాలయంలో నానుతూ వచ్చింది. ఉన్నతాధికారులను కలవనీయకుండా బాధితుడికి కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఇన్నాళ్లూ కాలయాపన చేయడంతో ఆయన సీఎంవోకు ఫిర్యాదు చేశారు. దాంతో తగిన చర్యలు తీసుకోమని సీఎంవో అధికారులు ఐసీడీఎస్ డైరెక్టరేట్‌ను ఆదేశించడంతో జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకతప్పలేదు. అంతకుముందు సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావులను కాపాడేందుకు ఐసీడీఎస్ అధికారులు చేయని ప్రయత్నం లేదు. డబ్బులు ఇచ్చి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా రాజీ ప్రయత్నాలు చేసినా బాధితుడు వెనక్కి తగ్గలేదు. గ్రీవెన్స్ గడువు ముగిసేలోగా బాధితుడిపై ఒత్తిడి తెచ్చి సమస్యకు పరిష్కారం చూపించినట్టు ఎండార్స్‌మెంట్‌పై సంతకం చేయాలని ఒత్తిడి చేశారు.
జేసీ ఆదేశాలు బేఖాతరు
బాధితుడు ఫిర్యాదు చేసిన మరుసటి రోజునే జేసీ ఫర్మాన్ అహ్మద్ చాంబర్‌లో ఐసీడీఎస్ పీడీ విమల సమక్షంలో సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావు, ఫిర్యాదుదారుడు వెంకటరమణలను విచారించారు. ఈ సందర్భంగా సీడీపీవో పాపినాయుడు, శ్రీనివాసరావు వేర్వేరుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లున్న వాయిస్ మెసెజ్‌లను ఫిర్యాదుదారుడు వెంకటరమణ వినిపించారు. వారిద్దరూ డిమాండ్ చేసిన మొత్తం రూ.40వేలు ఇవ్వకపోవడంతో 2026 మార్చి 30 వరకు తన కాంట్రాక్టు గడువు ఉన్నా.. రవాణా బాధ్యతను వేరొకరికి అప్పగించారని బాధితుడు జేసీకి వివరించారు. దీనిపై జేసీ వివరణ అడగ్గా.. తప్పు జరిగిందని, క్షమించాలని వారిద్దరూ అభ్యర్థించారు. దాంతో వారిద్దరికి షోకాజ్ నోటీసులు జారీచేసి లిఖితపూర్వక సమాధానం తీసుకోవాలని ఐసీడీఎస్ పీవోను జేసీ ఆదేశించారు. నోటీసులకు ఇచ్చిన వివరణలోనూ తప్పు జరిగినట్లు పాపినాయుడు, శ్రీనివాసరావు అంగీకరించారు. బాధ్యులు ఇద్దరూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో వారిని విధుల నుంచి తొలగించాలని ఐసీడీఎస్ పీడీ విమలను జేసీ ఆదేశించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా చర్యలు తీసుకోకుండా బాధ్యులను ఐసీడీఎస్ అధికారులు కాపాడుతున్నారన్న ఆరోపణలు వినిపించాయి. మరోవైపు సీడీపీవో పాపినాయుడిని తొలగించే అధికారం తమకు లేదని డైరెక్టర్‌కు మాత్రమే ఉందంటూ కాలక్షేపం చేశారు. ఫిర్యాదుదారుడికి డబ్బులు ఎరవేయడం, రాజకీయ నాయకులతో రాజీ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. బాధ్యులిద్దరిపై చర్యలు తీసుకోవాలని మూడునెలల వ్యవధిలో రెండుసార్లు గ్రీవెన్స్‌లో విన్నవించిన తర్వాత జేసీ పిలిచి మాట్లాడినా ఐసీడీఎస్ అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో ‘సత్యం’లో ఎచ్చెర్ల ఐసీడీఎస్ సీడీపీవో కార్యాలయంపై వచ్చిన వరుస కథనాలు, లంచం డిమాండ్ చేసిన ఆడియోలు ఆధారంగా చూపిస్తూ బాధితుడు సీఎంవోను ఆశ్రయించడం, అక్కడి నుంచి తాఖీదులు రావడంతో డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావును విధుల నుంచి తొలగించారు. కానీ సీడీపీవో పాపినాయుడు డైరెక్టరేట్ పరిధిలో ఉండటం వల్ల ఆయన్ను తొలగించడానికి కలెక్టర్ ద్వారా ఫైల్ పెట్టించారు.
రాజీ యత్నాలు విఫలం
ఎచ్చెర్ల ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ సెంటర్లకు బాలామృతం ప్యాకెట్లు సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును పొందూరు మండలం మద్దిలపేటకు చెందిన పైడి వెంకటరమణ ఎనిమిదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. రవాణా కాంట్రాక్ట్ అగ్రిమెంట్ 2026 మార్చి వరకు ఉంది. ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాల పరిధిలోని 116 అంగన్వాడీ సెంటర్లకు ఒక్కో బాలామృతం ప్యాకెట్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం రవాణాచార్జీ కింద ప్యాకెట్‌కు రూ.5 చెల్లిస్తుంది. రవాణా చార్జీల 14 నెలల బకాయి బిల్లులు రూ.2.75 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. బకాయి బిల్లు రవాణా కాంట్రాక్టర్ ఖాతాలో నేరుగా జమ కావడంతో సీడీపీవో పాపినాయుడు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరావు కలిసి ప్యాకెట్‌కు రూ.0.75 పైసలు చొప్పున రూ.40వేల కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినంత ఇవ్వలేనని, ఎంతో కొంత ఇస్తానని చెప్పినా వినిపించుకోలేదు. పైగా కాంట్రాక్ట్ గడువు ఉన్నా పట్టించుకోకుండా వేరొకరితో బాలామృతం ప్యాకెట్లు రవాణా చేయించారు. దీంతో బాధితుడు గ్రీవెన్స్‌ను ఆశ్రయించాడు. సీడీపీవో, కంప్యూటర్ ఆపరేటర్ రెగ్యులర్ ఉద్యోగులు కాదని, వారిని సస్పెండ్ చేయడం భావ్యం కాదని ఐసీడీఎస్ పీడీ కార్యాలయం అధికారులు వారిద్దరినీ రక్షించే ప్రయత్నాలు చేసినా.. ఉన్నతాధికారుల చొరవతో చివరికి అవి విఫలమయ్యాయి.










Comments