top of page

పాపం పండింది.. పదవి ఊడింది!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 9
  • 2 min read
  • డీసీసీ అధ్యక్ష పదవి నుంచి అంబటి తొలగింపు

  • పార్టీ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు

  • సీనియర్లు, ఇతర నేతలను పట్టించుకోకుండా ఏకపక్ష ధోరణి

  • పీసీసీ అధ్యక్షురాలినే మాయ చేసేందుకు యత్నించిన ఫలితం

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

అనుకున్నట్లే అయ్యింది. తనను అందలం ఎక్కించిన పార్టీకే సున్నం రాయడానికి ప్రయత్నించిన జిల్లా కాంగ్రెస్‌ (డీసీసీ) అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పదవి ఊడింది. ఆయన్ను తొలగిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడమే కాకుండా పార్టీ కార్యాలయం ద్వారా వచ్చే అద్దెలు, ఇతర నిధులు గుటుక్కుమనిపించడం, కార్యాలయ ఉద్యోగుల జీతాలకు కూడా ఎగనామం పెట్టడం ద్వారా డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు తీవ్ర అవినీతికి, క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని గత నెలలో ఆరోపణలు వచ్చాయి. గతంలో ఈ వ్యవహారాలపై ‘సత్యం’ పత్రికలో కథనం ప్రచురితం కావడంతోపాటు కాంగ్రెస్‌ నేతల నుంచి పలు ఫిర్యాదులు కూడా రాష్ట్ర నాయకత్వానికి అందాయి.

పీసీసీ అధ్యక్షురాలికే నేరుగా ఫిర్యాదులు

జిల్లాలోని పార్టీ సీనియర్లను ఏమాత్రం పట్టించుకోని అంబటి కృష్ణారావు.. సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కూడా మాయ చేసేందుకు ప్రయత్నించి ఆమెకే దొరికిపోయారు. గత నెల 20న షర్మిల జిల్లా పర్యటనకు వచ్చారు. ఆమె పర్యటన, సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని క్యాడర్‌కే కాదు.. కనీసం జిల్లాలోని సీనియర్‌ నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకైనా చెప్పకుండా కొందరు కిరాయి మనుషులతో మేనేజ్‌ చేసేయాలని అంబటి ప్రయత్నించారు. కానీ సమావేశం పూర్తికాకముందే తమకు డబ్బులు ఇస్తే వెళ్లిపోతామని పెయిడ్‌ ఆర్టిస్టులు గోల పెట్టడంతో సమావేశం రచ్చగా మారింది. దాంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ షర్మిల వెళ్లిపోయారు. కాగా ఇదే సందర్భంగా ప్రైవేట్‌ వ్యక్తులు కూడా డీసీసీ అధ్యక్షుడి మోసాలపై షర్మిలకు ఫిర్యాదు చేశారు. తమకు భూమి అమ్ముతానంటూ చాలాకాలం క్రితం అంబటి తమ వద్ద డబ్బులు తీసుకున్నారని, కానీ ఇంతవరకు భూమి లేదు.. డబ్బులూ తిరిగి ఇవ్వలేదని.. అడిగితే మీ పేరు చెప్పి బెదిరిస్తున్నారని’ గార మండలానికి చెందిన దంపతులు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకే ఫిర్యాదు చేశారు.

ఇక పార్టీ నిధుల నుంచి రూ.15 లక్షల వరకు మాయమైనట్లు అప్పట్లోనే షర్మిలకు ఫిర్యాదు అందింది. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌ ఆవరణలో ఉన్న షాపులు, కల్యాణమండపం నుంచి ప్రతి నెలా అందుతున్న అద్దెలను ట్రస్ట్‌కు చెందిన జాయింట్‌ ఖాతాలో వేయకుండా అంబటి తన సొంతానికి వాడుకున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. కాగా అంబటి కృష్ణారావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వడంలేదని, పేపర్‌ బిల్లులు చెల్లించడంలేదని, వస్తున్న అద్దెల సొమ్ము ఏమవుతుంతో తెలియడంలేదని పలువురు షర్మిలకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలపై ఆమె అసహనం వ్యక్తం చేస్తూ నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని, డీసీసీ అధ్యక్షుడిని మారిస్తే తప్ప పరిస్థితి మారేట్టు లేదని వ్యాఖ్యానిస్తూ వెళ్లిపోయారు. మరోవైపు అంబటి వచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను పలువురు నేతలు షర్మిలకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ ఫిర్యాదులతోపాటు స్వయంగా చేదు అనుభవం ఎదుర్కొన్న షర్మిల పీసీసీ స్థాయిలో వాటిపై విచారణ జరిపించారు. పార్టీ నిధులను, పదవిని అంబటి కృష్ణారావు దుర్వినియోగం చేసినట్లు నిర్థారణ కావడంతో అతన్ని డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంతకంతో జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయనపై మరింత లోతుగా విచారణ జరిపిన తర్వాత క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. అయితే అంబటి స్థానంలో ఇంకా ఎవరినీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించలేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page